శాడ్ స్టోరీ చెప్పిన వివేక్ రామస్వామి... లవ్ స్టోరీ చెప్పిన అపూర్వ రామస్వామి!

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన భారతీయ సంతతికి చెందిన వివేక్‌ రామస్వామి తనదైన శైలిలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే

Update: 2023-11-21 10:15 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన భారతీయ సంతతికి చెందిన వివేక్‌ రామస్వామి తనదైన శైలిలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అందరి మనసులను గెలుచుకోవడమే కర్తవ్యం అన్నట్లుగా ముందుకు కదులుతున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ కు ప్రత్యామ్నాయం అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి! ఈ నేపథ్యంలో తాజాగా అయోవాలో జరిగిన ఒక కార్యక్రమంలో వివేక్ రామస్వామి దంపతులు తమ జీవితంలో జరిగిన కీలకమైన సంఘటనలు పంచుకున్నారు.

అవును... తాజాగా అయోవాలోని ఫ్యామిలీ లీడర్ థాంక్స్ గివింగ్ ఫ్యామిలీ ఫోరం లో ఫ్యామిలీతో పాల్గొన్న రామస్వామి తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా తన జీవితంలోని అత్యంత విషాదాన్ని వెల్లడించారు. ఇందులో భాగంగా... తన భార్యకు గర్భం దాల్చి మూడున్నర నెలలకే గర్భస్రావం జరిగిందని ఇది తమకు చాలా బాధకరమైన క్షణమని పేర్కొన్నారు.

ఆ విధంగా తొలి బిడ్డను కోల్పోవడతో రెండోసారి ధైర్యం చేయలేకపోయినట్లు తెలిపారు. అయితే... ఆ భగవంతుడి మీద విశ్వాసంతోనే ధైర్యాన్ని తెచ్చుకున్నామని.. అలా కార్తీక్‌, అర్జున్‌ వచ్చారని.. ఫలితంగా వారు తమ జీవితాల్లోకి రావడంతో సంతోషం నిండిందని చెబుతూ తన అనుభవాలను పంచుకున్నారు.

ఇదే సమయంలో దేవుడు ఒక్కడే అని తాను విశ్వసిస్తానని చెప్పిన రామస్వామి... హిందూ విశ్వాసం.. క్రైస్తవ పాఠశాలలో చదువుతున్నప్పుడు నేర్చుకున్న క్రైస్తవ విలువల మధ్య సారూప్యాన్ని ప్రస్తావించారు. ఇవి మతపరమైన సరిహద్దులను అధిగమించిన దైవిక శక్తికి చెందినవని పేర్కొన్నారు. ఈ విధంగా అధ్యక్షుడిగా ఎన్నికైతే అమెరికా కోసం తాను ఏమి చేస్తానో వివరిస్తూనే.. కుటుంబ విలువల గురించి తన అభిప్రాయాలు పంచుకున్నారు.

అనంతరం రామస్వామి భార్య అపూర్వ వారి లవ్ స్టోరీని పంచుకున్నారు. ఇందులో భాగంగా... రామస్వామిని ఫస్ట్ టైం ఒక పార్టీలో కలిసినట్లు చెప్పిన ఆమె... ఆ పార్టీలో అతనొక్కడే తనకు ఆసక్తికరమైన వ్యక్తిగా కనిపించాడని తెలిపారు. దాంతో తానే వెళ్లి వివేక్‌ కు పరిచయం చేసుకున్నట్లు తెలిపారు. ఆ టైం లో వివేక్‌ లా చదువుతుంటుండగా.. తాను కాలేజీ స్టూడెంట్ అని చెప్పుకొచ్చారు.

అనంతరం ఇష్టాలు, అభిప్రాయాలను ఒకరితో ఒకరం షేర్‌ చేసుకున్నట్లు తెలిపిన అపూర్వ... బహుశా అదే నేను చివరిగా వెళ్లిన పార్టీ అని అన్నారు. ఈ క్రమంలో చాలా కాలం పక్క పక్క ఇళ్లలో ఉన్నట్లు తెలిపిన ఆమె... తర్వాత ఇద్దరి తల్లిదండ్రుల అనుమతితో పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించారు. అనంతరం వివేక్‌ మాట్లాడుతూ.. తమ తల్లిదండ్రులు విద్యతోపాటు దేవుడిపై విశ్వాన్ని కలిగించారని.. మనం ఎవరిని పెళ్లి చేసుకుంటామో వారి గురించి ఆలోచించాలని తమకు నేర్పించారని అన్నారు.

Tags:    

Similar News