వేయి రోజుల ఉక్కు ఘోష... సముద్ర ఘోషగా మారిపోతుందా ?

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నది యాభై ఏళ్ళ నాటి నినాదం. ఏకంగా ముప్పయి రెండు మంది విశాఖలో ఉక్కు కర్మాగారం కోసం బలిదానం చేశారు.

Update: 2023-11-09 04:08 GMT

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నది యాభై ఏళ్ళ నాటి నినాదం. ఏకంగా ముప్పయి రెండు మంది విశాఖలో ఉక్కు కర్మాగారం కోసం బలిదానం చేశారు. చాలా మంది ప్రజలు తమ భూములను ఇచ్చి మరీ ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కారణం అయ్యారు.

ఉక్కు నగరంగా విశాఖకు పేరు వచ్చినా విశాఖ అభివృద్ధిలో స్టీల్ ప్లాంట్ కీలక పాత్ర పోషించినా అదంతా ఈ భారీ కర్మాగారం వల్లనే సాధ్యపడింది. అలాంటి విశాఖ ఉక్కుని కేంద్రం ప్రైవేటీకరించాలని చూసింది. కేంద్రం ఆ ప్రకటన చేసి వేయి రోజులు పూర్తి అవుతోంది. ప్రకటన చేసిన రోజు నుంచి ఈ రోజు దాకా విశాఖ ఉక్కు కార్మికులు ఆందోళనలు నిర్వహిస్తూ వస్తున్నారు.

విశాఖ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేస్తూ వస్తున్నారు. కేంద్రం అయితే రాజీ లేదని చెబుతూ వచ్చింది. ఉక్కు మంత్రి కూడా ఇది పాలసీ డెసిషన్ అని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కుని ప్రైవేట్ రంగంలోనే ఉంచుతామని కూడా పేర్కొన్నారు. ఏపీలోని రాజకీయ పార్టీలు మొదట ఉద్యమానికి మద్దతుగా నిలిచినా తరువాత కేంద్రం వైఖరి చూసి ఆగిపోయాయి.

అయినా ఉక్కు కార్మికులు మాత్రం పోరాట బాటనే ఎంచుకున్నారు. వేయి రోజుల ఉద్యమానికి గుర్తుగా విశాఖ అంతా నిరసనలు సాగాయి. పెద్ద ఎత్తున కార్మిక లోకం తరలివచ్చి ఉక్కుని కాపాడుకుంటామని ప్రతిన చేసింది. అయితే ఇటీవల కాలంలో కేంద్రం కొంత వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తోంది.

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అయితే ఉక్కుని ప్రైవటీకరించే ప్రసక్తి లేదు అని చెప్పారు. అయితే దీనిని కార్మికులు నమ్మడంలేదు. ఆ మాట పార్లమెంట్ సాక్షిగా కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ నేతలను ఈ విషయంలో ఉక్కు పోరాట నేతలు నిలదీస్తున్నారు.

అయితే ఎన్నికలు ముంచుకు వస్తున్న తరుణంలో విశాఖ ఉక్కు వంటి సున్నితమైన సమస్యను కెలకడం ఎందుకు అని కేంద్రం కాస్తా నిదానించినట్లుగా కనిపిస్తోంది అని అంటున్నారు. కానీ 2024 ఎన్నికలు పూర్తి మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ వెంటనే విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కావడం ఖాయమని అంటున్నారు

ఇదే విషయం వామపక్ష నాయకులు చెబుతూ కేంద్రంలో బీజేపీ మళ్ళీ వస్తే విశాఖ ఉక్కు కర్మాగారానికి నూరేళ్ళు నిండినట్లే అని హెచ్చరిస్తున్నారు. అందువల్ల తెలివిగా ఈసారి విశాఖ వాసులతో సహా అంధ్రులు వ్యవహరించాలని బీజేపీతో ప్రత్యక్షంగా పరోక్షంగా అంటకాగుతున్న పార్టీలను కూడా ఓడించాలని కోరుతున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే వేయి రోజుల ఉద్యమ ఘోష కేంద్రం చెవికెక్కకపోవడానికి లెక్క చేయకపోవడానికి తప్పు హస్తినలో లేదని ఏపీలోనే ఉందని అంటున్నారు. ఏపీలో రాజకీయ పార్టీలు అన్నీ ఒక్క త్రాటి మీద నిలిచి ఉక్కు ఉద్యమంలో పాల్గొంటే ఏనాడో ప్రైవేటీకరణ విషయం వెనక్కి పోయేదని కానీ రాజకీయ బలహీనతల వల్లనే ఇలా జరుగుతోదని అంటున్నారు. మరి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా నిలుస్తుందా లేక ఉద్యమ ఘోష విశాఖ సముద్ర ఘోషగా మారిపోతుందా అంటే కాలమే నిర్ణయించాలని అంటున్నారు




Tags:    

Similar News