కూటమి నేతలకు సంక్రాంతి కానుక రెడీ చేసిన బాబు

సంక్రాంతి తెలుగు వారికి పెద్ద పండుగ. ఏపీలో అయితే దానికి అదనంగా కోడి పందేలతో సందడి చేస్తూంటారు.

Update: 2024-12-26 18:30 GMT

సంక్రాంతి తెలుగు వారికి పెద్ద పండుగ. ఏపీలో అయితే దానికి అదనంగా కోడి పందేలతో సందడి చేస్తూంటారు. ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న తెలుగు వారు అంత తప్పనిసరిగా వస్తారు. ఒకే చోట చేరి హడావుడి చేస్తారు. మూడు రోజుల ఈ పెద్ద పండుగ ఎపుడూ వెరీ స్పెషల్ గానే ఉంటుంది. అయితే 2025 సంక్రాంతి కూటమిలోని మూడు పార్టీల నేతలకు ఇంకా ప్రత్యేకంగా మారుతోంది అని అంటున్నారు. ఎందుకంటే వారికి ఈసారి స్వీట్ న్యూస్ ని తెచ్చేలా నామినేటెడ్ పదవులు దక్కుతాయని అంటున్నారు.

ఇప్పటికి రెండు విడతలుగా నామినేటెడ్ పదవులు పందేరం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు మూడో విడత నామినేటెడ్ కి రంగం సిద్ధం చేస్తున్నారు. అన్ని రకాలైన సమీకరణలను చూసుకుని కీలక నేతలకు నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు బాబు సిద్ధపడుతున్నారు.

గత రెండు దఫాలుగా ఇచ్చిన నామినేటెడ్ పదవులలో టీడీపీకే అగ్రభాగం దక్కింది. ఈసారి మాత్రం కూటమిలోని జనసేన బీజేపీలకు కూడా న్యాయం జరుగుతుంది అని అంటున్నారు. అంతే కాదు తమ సొంత సీటుని త్యాగం చేసి పొత్తులను పండించిన త్యాగరాజులకు ఈసారి కచ్చితంగా పదవులు దక్కుతాయని కూడా చెబుతున్నారు.

మరో విశేషం ఏంటి అంటే ఈసారి పదవులలలో కీలకమైనవి ఎన్నో ఉన్నాయని అంటున్నారు. దాంతో నామినేటెడ్ పదవుల విషయంలో అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈసారి చూస్తే చాలా ఎక్కువగానే నామినేటెడ్ పోస్టులు పంపిణీ చేస్తారు అని అంటున్నారు.

అంతే కాదు ఈ నామినేటెడ్ పదవులతో పాటు మార్చిలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పదవుల కోసం నేతల పేర్లు కూడా ప్రకటిస్తారు అని చర్చ సాగుతోంది. మొత్తంగా పది నుంచి పదిహేను దాకా ఎమ్మెల్సీ పదవులు ఈసారి మార్చిలో ఖాళీ అవుతాయని అంటున్నారు.

దాంతో అవి ఎవరికి దక్కబోతున్నాయని చర్చ ఉంది. ఎమ్మెల్యేలుగా చేసిన వారు సీనియర్ నేత్లు, మాజీ మంత్రులు ఆ పదవుల కోసం చూస్తున్నారు అని అంటున్నారు.

ఎమ్మెల్సీ పదవులకు పిఠాపురం సీటుని పవన్ కి త్యాగం చేసిన వర్మ పేరు వినిపిస్తోంది. అలాగే మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పేరు కూడా ఉంది. ఇక విజయవాడ నుంచి సీనియర్ నేత బుద్ధా వెంకన్న, అలాగే నెల్లూరు నుంచి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పేరు కూడా ఎమ్మెల్సీ పదవుల భర్తీలో వినిపిస్తోంది అని అంటున్నారు

ఇక అసలైన ముచ్చట ఏంటి అంటే ఏకంగా అరవై పై చిలుకు రాష్ట్ర స్థాయి కార్పోరేషన్ల చైర్మన్ పదవులు అంటున్నారు. వీటి కోసం భారీ స్థాయిలోనే పోటీ ఉందని తెలుస్తోంది. ఈ పదవులు దక్కిన వారి దర్జా వేరే లెవెల్ అని అంటున్నారు.

ఈ కీలక పదవులలో అధికార భాషా సంఘం చైర్మన్ పదవి ఉంది. అలాగే సాహిత్య అకాడమీ చైర్మన్, స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్, ప్రణాళికా సంఘం చైర్మన్, నెడ్ క్యాప్ చైర్మన్ వంటి వాటికి చాలా పోటీ ఉంది అని చెబుతున్నారు. అలాగే బేవరేజెస్ కార్పొరేషన్,, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆప్కాబ్, బ్యూటిఫికేషన్ గ్రీనరీ అండ్ కార్పొరేషన్, డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్, షిప్ అండ్ గోట్ కార్పొరేషన్ పదవులు ఉన్నాయి. వాటితో పాటుగానే స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రా కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా కీలకంగా ఉంది. వీటికి తోడుగా అనేక సామాజిక వర్గాలకు సంబంధించిన కార్పొరేషన్లకు చైర్మన్ పదవులు కూడా భర్తీ చేయాల్సి ఉంది.

దీంతో ఈసారి వీలైనంతవరకూ పదవులు అన్నీ భర్తీ చేసి పార్టీ కోసం కష్టపడిన వారికి ఇవ్వాలని ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడు నెలల కాలం గడచిపోయింది. దాంతో ఆశావహులను వేచి చూసేలా ఉంచడం మంచిది కాదని భావించే ఈ పదవుల పందేరానికి తెర తీస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే ఈ సంక్రాంతికి పదవుల పంపిణీ జరిగిపోతుంది. దాంతో అసలైన సంక్రాంతి ఈనాడే అని కూటమి నేతలు పాడుకునే చాన్స్ ఎటూ ఉంటుంది అని అంటున్నారు.

Tags:    

Similar News