అదే జరిగితే.. మూడో ప్రపంచ యుద్ధం తప్పదా?

కాగా తమ పొరుగు దేశం ఉక్రెయిన్‌ పై రష్యా ప్రారంభించిన యుద్ధానికి రెండేళ్లు దాటిపోయాయి

Update: 2024-03-18 06:09 GMT

రష్యా అధినేత వాద్లిమిర్‌ పుతిన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడో ప్రపంచ యుద్ధంపై తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి. రష్యా, నాటో మిలిటరీ కూటమి మధ్య యుద్ధం జరిగితే మూడో ప్రపంచ యుద్ధం ముప్పు ఖచ్చితంగా ఉంటుందని పుతిన్‌ తేల్చిచెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలో అన్నీ సాధ్యమేనని తెలిపారు. అయితే ఈ యుద్ధాన్ని ఎవరూ కోరుకోవడం లేదన్నారు.

కాగా తమ పొరుగు దేశం ఉక్రెయిన్‌ పై రష్యా ప్రారంభించిన యుద్ధానికి రెండేళ్లు దాటిపోయాయి. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌ పై రష్యా దండయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. మొదట్లో తేలిగ్గా లొంగిపోయేలా కనిపించిన ఉక్రెయిన్‌.. అమెరికా, బ్రిటన్‌ తదితర దేశాలు అందించిన ఆయుధాలతో గట్టిగా పోరాడుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు రష్యా కూడా భారీగా నష్టపోయింది.

అమెరికా నేతృత్వంలోని ఉత్తర అట్లాంటిక్‌ దేశాల సంధి సంస్థ (నాటో)కు ఉక్రెయిన్‌ దగ్గరవుతోందని.. ఆ కూటమిలో చేరుతోందని ఆగ్రహం వ్యక్తం చేసిన రష్యా.. ఉక్రెయిన్‌ పై యుద్ధానికి దిగింది. ఈ నేపథ్యంలో అమెరికా, దాని నేతృత్వంలోని నాటో దేశాలు తమపై యుద్ధానికి దిగితే మూడో ప్రపంచ యుద్ధం తప్పదని రష్యా అధినేత వాద్లిమిర్‌ పుతిన్‌ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ యుద్ధాన్ని ఎవరూ కోరుకోవడం లేదన్నారు.

ఉక్రెయిన్‌తో జరుగుతోన్న యుద్ధంలో అణ్వాయుధాలను వాడాల్సిన అవసరం తమకు లేదని పుతిన్‌ వ్యాఖ్యానించారు. యుద్ధ విరమణపై చర్చించేందుకు ఫ్రాన్స్‌ తో పాటు ఇంగ్లండ్‌ ను తాము ఎంచుకున్నామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో పుతిన్‌ వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి.

మరోవైపు రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్‌ పుతిన్‌ 87.97 శాతం ఓట్లతో విజయం సాధించారు. ఆ దేశంలో మూడు రోజుల పాటు జరిగిన పోలింగ్‌ లో మొత్తం 60 శాతానికి పైగా పోలింగ్‌ శాతం నమోదైంది. ఈ ఎన్నికల్లో పుతిన్‌ ఘనవిజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆయన ఉక్రెయిన్‌ తో యుద్ధం, మూడో ప్రపంచ యుద్ధం సంభవించే అవకాశాలపై హాట్‌ కామెంట్స్‌ చేశారు. మూడో ప్రపంచ యుద్ధమనే ఆలోచన తమకు ఎన్నడూ రాలేదని అన్నారు.

కాగా, మార్చి 15 నుంచి 17 వరకు రష్యా ఎన్నికలు జరిగాయి. ఇదే సమయంలో ఉక్రెయిన్‌ రష్యాపై మరిన్ని దాడులకు దిగింది. రష్యా సరిహద్దు ప్రాంతాలపై దాడులు చేసింది. దీనిపై రష్యా అగ్గిమీద గుగ్గిలమవుతోంది.

ఇప్పటికే 24 ఏళ్లుగా వాద్లిమిర్‌ పుతిన్‌ రష్యా అధినేతగా, ప్రధానిగా ఉన్నారు. ఇప్పుడు తాజాగా మరో ఆరేళ్లు దేశ అధ్యక్షుడిగా ఉండనున్నారు.

Tags:    

Similar News