వాలంటీర్లకు జగన్ పదివేలు ఇస్తారా...?

మరి వైసీపీ ఆ హామీ ఇస్తుందా లేదా అన్నది చూడాల్సిందే.

Update: 2023-07-25 05:35 GMT

వాలంటీర్లు ఇపుడు ఏపీ లో రాజకీయ దినుసు అయిపోయారు. వారితోనే రాజకీయం అన్నట్లుగా సీన్ మారింది. వాలంటీర్లను విపక్షం గట్టిగా టార్గెట్ చేస్తోంది. వారి ని ముందు పెట్టుకుని వైసీపీ తన రాజకీయ అవసరాల ను తీర్చుకుంటోంది అన్నది చాలా కాలంగా విపక్షానికి ఉన్న అనుమానం. అయితే ఎన్నికల వేళ దాన్ని ఎలా బయటపెట్టాలో వారి వైపు నుంచి వైసీపీ మీదకు ఎలా తమ తూటాలు గురి పెట్టాలో అర్ధం కాని నేపధ్యం ఉంది.

అయితే ఈ సమయం లో ఏ జంకూ గొంకూ లేకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ల మీద ఘాటు విమర్శలు చేశారు. ఇంకా చెప్పాలంటే తీవ్రాతి తీవ్రమైన విమర్శలు చేశారు. వాలంటీర్లను ఎవరూ అనలేని తీరు లో ఆయన సాహసించి అన్నీ అనేశారు. వాలంటీర్లు ప్రతీ ఇంట్లోకి వెళ్ళి ఒంటరి మహిళలు వితంతువుల వివరాలు సేకరించి అవి సంఘ విద్రోహ శక్తుల కు ఇస్తున్నారు అని ఆరోపించారు. ఆ విధంగా ఉమెన్ ట్రాఫికింగ్ ఏపీ లో జరుగుతోందని, ఏపీ లోనే ఎక్కువగా మహిళల మిస్సింగ్ కేసులు ఉన్నాయని పవన్ హీటెక్కించే కామెంట్స్ చేశారు.

అది పదిహేను రోజులు గడచినా ఆరని అగ్గిలాగానే ఉంది. అయితే ఏపీ లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం ఇంతటి ఆరోపణలు చేయలేదు కానీ పవన్ ద్వారా కాగల కార్యం సిద్ధించింది అని సంతోషిస్తోంది. మొత్తానికి వాలంటీర్ల మీద అందరిలో కాకపోయినా కొందరి లో అయినా ఒక డౌట్ అయితే పవన్ కామెంట్స్ ద్వారా పెట్టేశారు.

మరోవైపు చూస్తే వాలంటీర్ల ద్వారా వైసీపీ రాజకీయం అంత సులువుగా నడవదు అన్న సంకేతాలను కూడా పంపించారు. దాంతో వైసీపీ కూడా ఇరుకునపడింది. ఈ విధంగా చూసుకుంటే ఏపీ లో వాలంటీర్లు ఇపుడు అధికార విపక్షాల మధ్య రాజకీయ యుద్ధంలో సమిధలుగా మారిపోతున్నారు.

ఇదిలా ఉంటే వాలంటీర్ల విషయం లో తీవ్ర వ్యాఖ్యలు చేసిన జనసేన కోరి ఇబ్బందులో పడింది. ఆ పార్టీకి శ్రేయోభిలాషిగా ఉన్న మాజీ మంత్రి చేగొండి హరి రామజోగయ్య అయితే ఒక లేఖ పవన్ కి రాస్తూ వాలంటీర్ల విషయంలో పవన్ అభిప్రాయాలతో ఏకీభవిస్తూనే కొంత విభేదించారు. పవన్ అన్నట్లుగా వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాల్సిందే అని అంటూ మొత్తం వ్యవస్థను రద్దు చేయకుండా అందులో లోపాల ను సంస్కరించాలని ఆయన సూచించడం విశేషం.

అంతే కాదు మొత్తానికి మొత్తం మహిళలకే వాలంటీర్ల పదవులు ఇవ్వాలని ఇప్పటికే చాలీ చాలని జీతాలతో సతమతం అవుతున్న వాలంటీర్లకు ఏకంగా పదివేల జీతాని పెంచాలని ఆయన పవన్ కి సూచించారు. ఆ విధంగా పవన్ని హామీ ఇవ్వమని కోరుతున్నారు. దాంతో వాలంటీర్లు పవన్ మీద ఉన్న కోపాన్ని తగ్గించుకుంటారని, మరో వైపు వైసీపీకి అది ఇరాకాటం లో పెట్టే మ్యాటర్ అవుతుంది అన్నది జోగయ్య ఆలోచనగా ఉంది.

పవన్ దీని మీద ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. ఎందుకంటే ఆయన వాలంటీర్ల మీద చేసిన కామెంట్స్ కి ఈ రోజుకీ వెనక్కి తీసుకోవడంలేదు. అదే టైం లో ఆయన తాను అన్నది కరెక్ట్ అన్న ధోరణిలో ముందుకు పోతున్నారు. అయితే జోగయ్య వాలంటీర్ల జీతాల ను పది వేలకు పెంచమని కోరడం మాత్రం వైసీపీలోని తీవ్ర చర్చకు దారి తీసేది కావచ్చు అంటున్నారు.

వాలంటీర్లకు అయిదు వేలు ఇస్తూ గౌరవ వేతనంగా దాన్ని ప్రభుత్వం చూపుతోంది. అయితే ఈ విషయంలో వాలంటీర్లు చాలా మంది అసంతృప్తిగానే ఉన్నారు. అందువల్ల వారిలో ఉన్న అసంతృప్తిని సొమ్ము చేసుకోవడానికి రేపటి రోజున విపక్షం పది వేలు ఇస్తామని ముందుకు రావచ్చు. ఆ చాన్స్ వారికి ఇచ్చే కంటే తామే సృష్టించిన వ్యవస్థ కాబట్టి వైసీపీ ఆ పదివేల పెంపు అన్నది వారికి ఇచ్చెలా ఉంటే కనుక రేపటి రోజున వైసీపీకి మరింతగా వారు అండగా ఉంటారని ఆ పార్టీ రాజకీయ లక్ష్యం కూడా నెరవేరే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. మరి వైసీపీ ఆ హామీ ఇస్తుందా లేదా అన్నది చూడాల్సిందే.

Tags:    

Similar News