ఓటుకు 500... మాకొద్దంటున్న ఓటర్లు!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి నడుస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2024-05-03 04:26 GMT

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సందడి మరొంత సందడిగా నెలకొంది! గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణ రాజకీయ సమీకరణలు చాలా మారాయని అంటున్న నేపథ్యంలో... ఈ లోక్ సభ ఎన్నికలు మూడు పార్టీలకూ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయని చెబుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఏమాత్రం అమలు సాధ్యంకాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ ప్రజలను మోసం చేసి గెలిచిందని.. లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన శాస్తి చేస్తారని బీఆరెస్స్ నేతలు చెబుతున్నారు. మరోపక్క తమ పాలనకు రెఫరెండంగా లోక్ సభ ఎన్నికలను భావిస్తున్నామని అంటున్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు!

ఆ సంగతి అలా ఉంటే... తెలంగాణలో ఎన్నికలు అంటే ఓటుకు నోటు పెద్ద ఎత్తున ఉంటుందనే చర్చ తెరపైకి వచ్చింది. అందుకు కారణం గత అసెంబ్లీ ఎన్నికల నాడు జరిగిన సందడే! అవును... గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నోట్ల ప్రవాహం పీక్స్ కి చేరిందని.. దేశంలోనే కాస్ట్లీ ఎన్నికలుగా రికార్డ్ నెలకొల్పాయని చర్చ జరిగిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా... రియల్ ఎస్టేట్ బూమ్ వల్లో మరో కారణంతోనో కానీ... గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుకు రూ.2000 - రూ.4000 వరకూ ఇచ్చారని చెబుతున్నారు! ఈ నేపథ్యంలో... లోక్ సభ ఎన్నికలు సమీపించిన వేళ తెలంగాణలో నోట్ల కట్టల ప్రవాహం పీక్స్ కి చేరే అవకాశం ఉందని చర్చ మొదలైంది. అయితే.. పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న వేళ ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది.

దీని ప్రకారం... లోక్ సభ ఎన్నికల్లో బీఆరెస్స్ కానీ, బీజేపీ కానీ ఓటుకు నోటు ఇవ్వడం లేదని.. ఓటర్లకు డబ్బులు పంచే కార్యక్రమం చేయడం లేదని అంటున్నారు. ఇదే సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం అక్కడక్కడా రూ.500 చొప్పున పంచాలని ఫిక్సయ్యిందనే చర్చ గ్రౌండ్ లెవెల్ లో స్టార్ట్ అయ్యిందన్ని తెలుస్తుంది! ఈ సమయంలో... ఓటరు నుంచి ఊహించని రియాక్షన్ వస్తుందని అంటున్నారు.

ఇందులో భాగంగా.. ఎన్నికలు వచ్చాయంటే ఓటుకు కనీసం రెండువేల రూపాయలు అయినా వస్తాయని భావించో.. లేక, అలవాటు పడో తెలియదు కానీ.. రూ.500 చొప్పున ఇస్తుంటే మాత్రం ప్రజలు నేరుగా తిరస్కరిస్తున్నారని అంటున్నారు! డబ్బులు పంచుతున్న వారితో... “ఐదువందలైతే వద్దు” అని నిక్కచ్చిగా చెప్పేస్తున్నారని తెలుస్తుంది! దీంతో... ఈ పరిస్థితికి కారణం అలవాటు చేసిన నేతలా.. అలవాటు పడిన ఓటరా అని ప్రశ్నిస్తున్నారు పరిశీలకులు!

Tags:    

Similar News