కొత్త సీన్: ఏపీ నుంచి హైదరాబాద్ కు భారీగా ఓటర్లు!
గతంలో ఎప్పుడూ లేని రీతిలో హైదరాబాద్ లో ఓటు ఉండి.. ఏపీలో ఉన్న పలువురు పెద్ద ఎత్తున బయలుదేరి వెళ్లిన వైనం ఆసక్తికరంగా మారింది.
ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొత్త సీన్ ఒకటి ఆవిష్క్రతమైంది. గతంలో ఎప్పుడూ లేని రీతిలో హైదరాబాద్ లో ఓటు ఉండి.. ఏపీలో ఉన్న పలువురు పెద్ద ఎత్తున బయలుదేరి వెళ్లిన వైనం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ లోనూ.. ఏపీలోనూ రెండు చోట్ల ఓట్లు ఉండటం తెలిసిందే. ఒక వ్యక్తికి రెండు వేర్వేరు చోట్ల ఓట్లు ఉంటే తొలగిస్తున్నట్లుగా కేంద్ర ఎన్నికల కమిషన్ చెబుతున్నప్పటికీ.. వాస్తవంలో మాత్రం అలాంటిదేదీ చోటు చేసుకోవటం లేదన్నది తెలిసిందే. దీనికి తగ్గట్లే.. హైదరాబాద్ మహానగరంలో ఓటు ఉండి.. ఏపీలోనూ ఓటు ఉన్న వారు పెద్దసంఖ్యలోనే ఉన్నట్లు చెబుతారు.
ఇలాంటి వారు హైదరాబాద్ లో ఉంటూ.. ఏపీలో ఎన్నికలు జరుగుతున్న వేళలో అక్కడకు వెళ్లి ఓటు వేసి రావటం తెలిసిందే. అయితే.. ఈసారి ఎన్నికలు పోటాపోటీగా జరుగుతున్న వేళ.. తమ ఓటుహక్కును వినియోగించుకోవటానికి పలువురు ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రైవేటు వాహనాల్లో బయలుదేరి హైదరాబాద్ కు చేరుకున్నట్లుగా చెబుతున్నారు. ఇదో రేర్ సీన్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కేవలం ఓటు వేసేందుకు ప్రైవేటు వాహనాలతో పాటు.. ఇతర ప్రజా రవాణాలోనూ హైదరాబాద్ కు చేరుకుంటున్న వారు.. ఎవరికి ఓటు వేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇలాంటి వారు వేలల్లో కాకున్నా.. వందల్లో ఉంటారని చెబుతున్నారు. దీనికి తగ్గట్లే.. టోల్ ప్లాజాల వద్ద కూడా ఏపీ నుంచి హైదరాబాద్ కు వచ్చే వాహనాల రద్దీ సాధారణంగా ఎక్కువగా ఉండటం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా పోలింగ్ వేళ.. హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్లే వాహనాలు కిటకిటలాడటం తెలిసిందే. అందుకు భిన్నంగా ఏపీ నుంచి హైదరాబాద్ కు వచ్చే రూట్లు సైతం హడావుడిగా ఉండటం ఆసక్తికర పరిణామంగా చెప్పాలి.