వైసీపీ టీడీపీ జనసేన : ఓటు షేర్ ఎవరికెంత...!?

ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. మరో పదిహేను రోజులలో 2023 క్యాలెండర్ ఫేస్ టర్న్ ఇచ్చుకోగానే 2024 స్టార్ట్ అవుతుంది. దాంతో ఈ చలికాలంలోనే ఎన్నిక వేడి వేసవి తాపంగా రాజుకుంటుంది.

Update: 2023-12-15 03:50 GMT

ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. మరో పదిహేను రోజులలో 2023 క్యాలెండర్ ఫేస్ టర్న్ ఇచ్చుకోగానే 2024 స్టార్ట్ అవుతుంది. దాంతో ఈ చలికాలంలోనే ఎన్నిక వేడి వేసవి తాపంగా రాజుకుంటుంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కసరత్తులో తలమునకలు అయి ఉన్నాయి.

ఈసారి కూడా మాదే విజయం అని వైసీపీ అంటోంది. వై నాట్ 175 అన్న నినాదమే నిజం అవుతుందని కూడా గట్టిగా చెబుతోంది. వైసీపీ ధీమాకు చాలా కారణాలు ఉన్నాయి. తాము పల్లెలలో అభ్యున్నతి కోసం గడచిన అయిదేళ్లూ విశేషంగా కృషి చేశామని వైసీపీ నేతలు అంటున్నారు. గ్రామీణ అభివృద్ధి మీదనే వైసీపీ ఫుల్ ఫోకస్ పెట్టిందని కూడా చెబుతున్నారు.

సంక్షేమ పధకాల ద్వారా రెండున్నర లక్షల కోట్ల దాకా నగదు బదిలీని నేరుగా లబిదారుల ఖాతాలో వేశామని చెబుతున్నారు. అలాగే మరో రెండు లక్షల కోట్ల దాకా అభివృద్ధి అంతా గ్రామాలలోనే జరిగింది అని చెబుతున్నారు. గ్రామ వార్డు సచివాలయాల భవన నిర్మాణాలు, రైతు భరోసా కేంద్రాలు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు నాడు నేడు పేరిట పాఠశాలలు ఆసుపత్రుల నిర్మాణం పునరుద్ధరణ పనులు ఇలా అనేక రకాలుగా పల్లెల మీద ఫోకస్ పెట్టి పాలన చేశామని వివరిస్తున్నారు.

దీన్ని బట్టి చూస్తే మొత్తం డెబ్బై శాతానికి పైగా రూరల్ సెమీ అర్బన్ ఓటింగ్ అంతా తమవైపే ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓటు షేర్ దక్కిందని ఈసారి తాము ఇచ్చిన అన్ని హామీలూ నెరవేర్చామని, సుపరిపాలన అందించామని కాబట్టి ఈసారి ఓటు షేర్ 55 శాతం నుంచి అరవై శాతం మధ్యలో ఉండే చాన్స్ ఉందని కూడా లెక్కిస్తున్నారు.

ఇక ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం విషయానికి వస్తే ఆ పార్టీకి 2019 ఎన్నికల్లో 39 శాతానికి పైగా ఓటు షేరింగ్ వచ్చింది. గడచిన అయిదేళ్ల కాలంలో టీడీపీ చేసిన అనేక ఉద్యమాలు ఆ మీదట అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు అన్నీ కలసి మొత్తం ఓటు షేర్ టీడీపీకి బాగా పెరిగింది అని చెప్పుకుంటోంది. ఎట్టి పరిస్థితులల్లోనూ 45 శాతం కంటే ఓటు షేర్ తగ్గదని కూడా ధీమా వ్యక్తం చేస్తోంది. అది ఇంకా పెరిగి యాభై శాతం అయినా ఆశ్చర్యం లేదు అని అంటోంది

మరో వైపు చూస్తే ఆనాడు బీఎస్పీ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్న జనసేనకు ఆరేడు శాతం ఓటు షేరింగ్ వచ్చింది ఈసారి తమ ఓటు షేర్ అమాంతం పెరిగిందని ఏకంగా పవన్ కళ్యాణే చెప్పుకొచ్చారు. సగటు ఓటు షేర్ కచ్చితంగా ఇరవై శాతంగా ఉండవచ్చు అని అంటున్నారు. దాంతో తమకు అంతే స్థాయిలో సీట్లు కూడా దక్కుతాయని జనసేన నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఏపీలో జనసేన ఓటు షేర్ ఎంత పెరిగింది అన్నది చూస్తే విశ్లేషకుల మాట ప్రకారం పది శాతం దాకా ఉండవచ్చు అని అంటున్నారు. ఇక తెలుగుదేశం ఓటు షేర్ విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. జనసేనకు పెరుగుతున్న ఓటు షేర్ అంతా టీడీపీ నుంచే వస్తోంది అన్నది కూడా ఒక చర్చగా ఉంది. వైసీపీ ఓటు బ్యాంక్ నుంచి ఓట్లు తీసుకోవాలంటే సామాజికవర్గాల పరంగా అయితే ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు ఎక్కువగా అటు వైపే ఉంటాయని అంటున్నారు.

ఇక బీసీలలో కూడా మెజారిటీ షేర్ కోసం వైసీపీ చూస్తోంది. బీసీ ఓటు బ్యాంక్ కోసం టీడీపీ ఉంది. కాపులు అయితే అల్టిమేట్ గానే 2019లో జనసేనకు ఓట్లు వేశారు అని అంటున్నారు. సొంతంగా పోటీ పవన్ సీఎం అంటేనే ఆ స్థాయిలో ఓట్లు వచ్చాయని ఇపుడు పొత్తులు చంచ్రబాబు సీఎం అంటే ఆ సెక్షన్ ఓట్లు తగ్గుతాయా లేక అలాగే ఉంటాయా అన్నది చర్చగా ఉంది అంటున్నారు.

ఇక టీడీపీకి గతసారి అర్బన్ ఓటింగ్ బాగానే పడింది. రూరల్ ఓటింగ్ తగ్గింది. గతంలో అర్బన్ ఓటింగులో కొంత శాతం వైసీపీ తీసుకుంది. ఈసారి అర్బన్ ఓటింగ్ లో వైసీపీ వాటా ఎంత అన్నది చూడాలి. అలాగే రూరల్ ఓటింగ్ లో వైసీపీకి గట్టి పట్టు కొనసాగుతోంది. అందులో టీడీపీ వాటా ఎంత అన్నది చూడాలని అంటున్నారు.

మొత్తం మీద చూస్తే టీడీపీ ప్లస్ జనసేన కలిస్తే 50 నుంచి ఆ పైన ఓట్ల శాతం దక్కుతుందని గెలుపు ఖాయమని ఆ రెండు పార్టీలు అంటున్నాయి. అయితే జనసేన టీడీపీ కలసినా కూడా వారికి అందనంత ఓటు షేర్ తమకే ఉందని ఈసారి 60 శాతం ఓటు షేర్ తమదే అని వైసీపీ ధీమాగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఎవరి ఓటు షేర్ నికరంగా ఎంత ఉందో అన్నది రానున్న ఎన్నికల నెలలు నిర్ణయించాలని అంటున్నారు.

Tags:    

Similar News