మండించే మే ఎండలు...ఓటింగ్ శాతం తగ్గితే దెబ్బ ఎవరికి...!?

ఎన్నడూ లేని విధంగా దేశంలో ఈసారి ఏడు దశలకు పైగా ఎన్నికలు జరుగుతున్నాయి.

Update: 2024-04-02 03:54 GMT

ఎన్నడూ లేని విధంగా దేశంలో ఈసారి ఏడు దశలకు పైగా ఎన్నికలు జరుగుతున్నాయి. అంతే కాదు ఆలస్యంగా ఎన్నికలు మొదలవుతున్నాయి. అవి మండించే మే నెల అంతటా జరగబోతున్నాయి. సరే దేశంలోఅ మే నెలలో ఎన్నికలు గతంలోనూ జరిగాయి కదా అంటే అపుడు మే నెల మూడవ వారంతో ముగిసాయి. ఈసారి మాత్రం మే నెల అంతటా జరుగుతూ జూన్ 1న కూడా జరుగుతున్నాయి.

నిజానికి చూస్తే ఈసారి ఎండలు దారుణం అంటున్నారు. వేసవిలో ఎండలు ఠారెత్తించనున్నాయని భారత వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఏప్రిల్ నెలలో దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవనున్నాయని, వడగాల్పులు వీయనున్నాయని సూచించింది. ఏప్రిల్ చివరన మొదలుకొని సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు మరింత తీవ్రరూపం దాల్చనున్నాయని అంచనా వేస్తున్నట్టుగా ఐఎండీ పేర్కొంది.

అంతే కాదు రాబోయే రెండున్నర నెలల్లో ఇవే పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. దీంతో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన భాగస్వాములందరూ ముందస్తుగా సంసిద్ధం కావాల్సిన అవసరం ఉందని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రి కిరెన్ రిజిజు ప్రకటించారు.

ఇక ఈ మండే ఎండలు దేశంలో ప్రాంతాల వారీగా చూస్తే ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌తో పాటు గుజరాత్, మధ్య మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌లలో వేడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ చెబుతోంది.

గతాని కంటే భిన్నంగా ఏప్రిల్‌లో చాలా ప్రాంతాలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తేల్చింది. ఇలా చూస్తే ఐఎండీ అంచనాలు భయపెట్టేలా ఉన్నాయి. అన్నింటికంటే కూడా ఏప్రిల్ లో మండుతున్న ఎండలే దానికి ఉదాహరణగా ఉన్నాయి.

మొత్తానికి వేసవి ఎండలలో ఎన్నికలు పెట్టడం వల్ల ఎవరికి లాభం అన్న చర్చ వస్తోంది. మండే ఎండలలో జనాలు ఓటింగునకు దూరంగా ఉంటారు అన్నది ఒక సహజ విశ్లేషణ. గంటల తరబడి ఓటు కోసం పోలింగ్ బూతులకు క్యూ కట్టే బాపతు అయితే తక్కువే.

ఒక విధంగా అధికారంలో ఉన్న పార్టీలకే ఈ ఎండల వల్ల లాభం అంటున్నారు. పోలింగ్ శాతం ఎంత తక్కువగా నమోదు అయితే అంత ఎక్కువగా లాభాలు పొందేది అధికారంలో ఉండే పార్టీలే అని ఒక ఫ్లాష్ బ్యాక్ అంచనా ఉంది. ఏపీలో చూస్తే మండే ఎండల ప్రభావంతో పట్టణ ప్రాంత వాసులు ఓటింగుకు దూరంగా ఉంటే కనుక దెబ్బ పడేది టీడీపీ కూటమికే అని అంటున్నారు.

ఈ కూటమికి మద్దతు కూడా అర్బన్ ఏరియాలలో విద్యా వంతులలో చదువుకున్న వారిలో ఎక్కువగా ఉంది అని అంటున్నారు. పల్లెలలో అయితే ఓటింగ్ సెన్స్ మొదటి నుంచి ఎక్కువే. వారు మండే ఎండలను ఎపుడూ పట్టించుకోరు. మరి రూరల్ ఓటింగ్ సాలిడ్ గా పడుతూ పట్టణ ఓటింగ్ తగ్గితే ఆ ప్రభావం ఊహించని విధంగా ఉంటుంది. అది ఎన్నికల ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది అని అంటున్నారు. మొత్తానికి ఎన్నడూ లేని విధంగా ఏపీలో మే మూడవ వారంలో ఎన్నికలు జరగడం అంటే ఫలితాలు ఎలా ఉంటాయో అన్నది కూడా చర్చకు వస్తోంది.

Tags:    

Similar News