వ‌రంగ‌ల్ స‌ల‌స‌ల‌.. వేడెక్కిన రాజ‌కీయం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో పోరుగ‌ల్లుగా పేరున్న వ‌రంగ‌ల్ జిల్లా వేడెక్కింది.

Update: 2023-11-01 03:48 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో పోరుగ‌ల్లుగా పేరున్న వ‌రంగ‌ల్ జిల్లా వేడెక్కింది. నామినేషన్లకు ఇంకా గ‌డువు ఉండ‌గానే ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరుగా ప్రచారాలు సాగిస్తున్నారు.. గ్రామాలను సైతం జల్లెడ పడుతున్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు స‌హా చిన్నాచిత‌కా పార్టీల నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు.

జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌, పాలకుర్తి నియోజకవర్గాల్లో తెల్లారే సరికే అభ్య‌ర్థులు గ్రామాల బాట పడుతున్నారు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే.. అభ్యర్థులు ఏకంగా రాత్రిపూట ప్రచారం ముగించిన గ్రామంలోనే నిద్ర చేసి పొద్దున్నే తమ ప్రచారాలను కొనసాగిస్తున్నారు. నామినేషన్ల ఘ‌ట్టం ప్రారంభానికి ముందే వీలైనన్ని ఎక్కువ గ్రామాలను చుట్టేయాలనే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు.

అధికార పార్టీ దూకుడు!

బీఆర్‌ఎస్‌ తరపున జనగామ నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి కడియం శ్రీహరి, పాలకుర్తి నుంచి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్లు ఖరారు అయ్యాయి. కాంగ్రెస్‌ నుంచి తొలి విడతలో స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి సింగపురం ఇందిర పేరు మాత్రమే ప్రకటించగా రెండో జాబితాలో జనగామ నుంచి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, పాలకుర్తి నుంచి కాంగ్రెస్‌ నాయకురాలు, ఎన్నారై ఝాన్సీరెడ్డి కోడలు యశస్వినిరెడ్డిని ప్రకటించింది. బీజేపీ తరపున జనగామ నుంచి ఆరుట్ల దశమంత్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి గుండె విజయరామారావు, పాలకుర్తి నుంచి లేగ రామ్మోహన్‌రెడ్డి పేర్లను బీజేపీ ఖరారు చేసింది. అయితే.. వీరంద‌రిలోనూ బీఆర్ ఎస్ దూకుడు జోరుగా ఉంది. బీఆర్ ఎస్ నాయ‌కులు.. ప్ర‌జ‌ల్లోకి దూసుకుపోతున్నారు. కేసీఆర్ ఇమేజ్‌, తెలంగాణ సెంటిమెంటును పండిస్తున్నారు.

వ‌త్తిడి తగ్గించుకునే వ్యూహం!

స‌హజంగానేఎన్నిక‌లు అన‌గానే అభ్య‌ర్థుల‌పై వ‌త్తిడి ఉంటుంది. ఈ క్ర‌మంలో వ‌త్తిడిని త‌గ్గించుకునేందుకు బీఆర్ ఎస్ నాయ‌కులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. నామినేషన్లకు ముందు వీలైనన్ని ఎక్కువ గ్రామాలను పూర్తి చేస్తే ఆ తర్వాత ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో అభ్యర్థులు రోజుకు ఐదు నుంచి ఆరు గ్రామాల వరకు చుట్టేస్తున్నారు. ఓ వైపు పగటిపూట గ్రామా ల్లో ప్రచారం చూస్తూ.. రాత్రిళ్లు వ్యూహాలు, ప్రణాళికలపై అర్థరాత్రి వరకు కసరత్తుల్లో మునిగిపోతున్నారు. మొత్తంగా వ‌రంగ‌ల్ జిల్లాలో ఎన్నిక‌ల రాజ‌కీయంగా జోరుగా సాగుతోంది.

Tags:    

Similar News