వరంగల్ సభ డౌటేనా ?
అయితే తాజా పరిణామాలు చూస్తుంటే బహిరంగసభ జరిగేది అనుమానంగానే ఉంది. ఎందుకంటే బహిరంగ సభ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు మొదలుకాకపోవటమే.
ఈనెల 16వ తేదీన వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని గతంలో కేసీఆర్ డిసైడ్ అయ్యారు. వరంగల్ సభతో ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని పెద్ద ప్లానే వేసుకున్నారు. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే బహిరంగసభ జరిగేది అనుమానంగానే ఉంది. ఎందుకంటే బహిరంగ సభ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు మొదలుకాకపోవటమే. బహిరంగసభ నిర్వహణ అంటే ఎన్ని పనులుంటాయో అందరికీ తెలిసిందే. జనసమీకరణ, వేదిక నిర్మాణం, గ్రౌండును రెడీచేయటం, వచ్చిన జనాలు కూర్చోవటానికి వీలుగా కర్చీలు వేయటం, మంచినీళ్ళ సౌకర్యం కల్పించటం, ఎలక్ట్రిసిటీ లాంటి అనేక ఏర్పాట్లు చేయాల్సుంటుంది.
అయితే ఇందులో ఒక్కటంటే ఒక్క దానికి కూడా అధికార పార్టీ ప్రారంభించలేదు. ముందుగా కలెక్టర్, ఎస్పీలకు అనుమతుల లెటర్లు పెట్టుకోవాలి. ప్రోగ్రామ్ షీటును ఫైనల్ చేసి పోలీసులకు ఇవ్వాల్సుంటుంది. మున్సిపల్ పర్మిషన్ కు ఇంతవరకు దరఖాస్తు చేయలేదు. కనీసం పార్టీ నేతలతో మీటింగ్ కూడా పెట్టలేదు. మంత్రులు, ఎంఎల్ఏలతో కూడా సమీక్ష చేయలేదు. సో, జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే బహిరంగసభ నిర్వహణ అనుమానమే అన్నట్లుగా ఉంది.
దీనికి కారణం ఏమిటంటే స్కీములన్నీ అరాకొరగా అమలవుతుండటమే. కొన్ని స్కీములైతే అసలు మొదలే కాలేదు. వివిధ కారణాలతో జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. వరంగల్ సభకు 10 లక్షలమందిని తీసుకొచ్చి బ్రహ్మాండమని అనిపించాలని గతంలో కేసీయార్ చెప్పారు. ఆ సభలోనే పార్టీ మ్యానిఫెస్టో ప్రకటించబోతున్నట్లు కూడా సంకేతాలిచ్చారు. అయితే ఇపుడా సంకేతాలు ఏవీ కనబడటంలేదు. దళితబంధు, బీసీ బంధు, గృహలక్ష్మి, మైనారిటి సాయం కోసం ఎంఎల్ఏలు లబ్దిదారులను ఎంపికచేశారు.
లబ్ధిదారులను ఎంపిక చేశారు కానీ నిధులు మాత్రం విడుదల కాలేదు. ఇదే సమయంలో లబ్ధిదారుల ఎంపికలో చాలా నియోజకవర్గాల్లో గొడవలు జరిగినట్లే వరంగల్లో కూడా జరిగింది. లబ్దిదారుల జాబితాలో లేనివాళ్ళంతా ఎంఎల్ఏలతో పాటు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ఎన్నికల ప్రచారానికి వస్తున్న ఎంఎల్ఏలను జనాలు నిలదీస్తున్నారు. దాంతో ఎంఎల్ఏలకు ఏమిచేయాలో అర్ధం కావటం లేదు. అందుకని ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత భారీ బహిరంగ సభలు కాకుండా జిల్లాల్లో చిన్న సైజు సభలు పెట్టే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చివరకు కేసీఆర్ ఏమి చేస్తారో చూడాలి.