31 మృతదేహాలు, 158 శరీర భాగాలు... సామూహిక అంత్యక్రియలు వీడియో!

వయనాడ్ విలయం మిగిల్చిన విషాదం నుంచి దేశం ఇంకా కోలుకోలేకపోతోందనే చెప్పాలి

Update: 2024-08-06 05:27 GMT

వయనాడ్ విలయం మిగిల్చిన విషాదం నుంచి దేశం ఇంకా కోలుకోలేకపోతోందనే చెప్పాలి. ఈ ప్రకృతి ప్రకోపం కారణంగా జరిగిన దుర్ఘటనలో గల్లంతైనవారిలో ఇంకా 180 మంది ఆచూకీ లభించలేదని అంటునారు. ఇదే సమయంలో గుర్తుతెలియని 189 మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి!

అవును... వయనాడ్ మిగిల్చిన విషాదం నుంచి దేశం ఇంకా కోలుకోలేకపోతోంది. తమ వారు ఏమయ్యారనే ఆందోళనల్లో ఇంకా వందల మంది ఉన్న పరిస్థితి. మరోపక్క కొండచరియలు విరిగిపడి గల్లంతైన వారి కోసం సోమవారం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. ముండక్కైలో అగ్నిమాపక దళ సిబ్బంది, వాలంటీర్లతో సహా సుమారు 1,500 మందికి పైగా ఈ పనుల్లో ఉన్నారు.

ఆర్మీ, నేవీ, ఫరెస్ట్, ఎన్.డి.ఆర్.ఎఫ్, కే-9 డాగ్ స్క్వాడ్, పోలీసు అధికారులు ఆరు జోన్ లలోనూ సోదాలు కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో... వయనాడ్, మలప్పురం, కోజీకోడ్ జిల్లాల గుండా ప్రవహించే చలియార్ నదిలో సెర్చ్ తిరిగి ప్రారంభమైంది. ఈ సమయంలో ఇప్పటికే లభించిన మృతదేహాల్లో గుర్తుపట్టని వాటికి సామూహిక అంత్యక్రియలు జరిగాయి.

ఈ మేరకు పుత్తుమలలోని 64 సెంట్ల శ్మశాన వాటికలో మొత్తం 189 మృతదేహాలను ఖనం చేశారు! ఇందులో 31 మంది గుర్తుతెలియని మృతదేహాలు ఉండగా.. 158 విడి శరీర భాగాలు ఉన్నాయి. ఈ 189ని ఒకేసారి ఖననం చేశారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు చేశారు. ఒక సెంటు స్థలంలో కనీసం 7 మృతదేహాలను పాతిపెట్టేలా ఏర్పాట్లు చేశారు.

ఇదే సమయంలో చలియార్ నదిలో మరో 28 మృతదేహాలను వెలికితీయడంతో విపత్తులో మరణించిన వారి సంఖ్య 385కు చేరిందని స్థానిక మీడియా వెళ్లడించింది. ఆ నదిలో ఇప్పటివరకూ మొత్తం 75 మృతదేహాలు, 142 శరీర భాగాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు.

Tags:    

Similar News