మాకు ఒక్క సీటూ లేదు... మూలుగుతున్న బీజేపీ
బీజేపీకి బంగారం లాంటి అవకాశాలు ఏపీ ప్రజలు ఇచ్చినపుడు మాత్రం పట్టించుకోకుండా తాను అనుకున్న తీరున పనిచేసుకుని పోయింది.
ఏపీలో మాకు ఒక్క సీటూ లేదు అని బీజేపీ ఎపుడూ బాధతో మూలుగుతూ ఉంటుంది. వాస్తవం చూస్తే ఏపీలో బీజేపీ రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితినే ఎదుర్కొంటోంది. సొంతంగా పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్క్తాయో లేదో డౌట్ గా ఉంటుంది. బీజేపీకి బంగారం లాంటి అవకాశాలు ఏపీ ప్రజలు ఇచ్చినపుడు మాత్రం పట్టించుకోకుండా తాను అనుకున్న తీరున పనిచేసుకుని పోయింది. ఏపీలో 1998 లోక్ సభ ఎన్నికల్లో ఏపీ నుంచి నాలుగు సీట్లు సొంతంగా అందించారు.
ఏపీ ప్రజలు. నాలుగు ఎంపీ సీట్లు అంటే 28 అసెంబ్లీ సీట్లు, 18 శాతం ఓటు షేర్ తో అనాడు బీజేపీని టీడీపీకి ఆల్టర్నేషన్ గా చూస్తే 1999 ఎన్నికల నాటికి అదే బీజేపీతో దోస్తీ చేసి బీజేపీ తన ఎదుగుదలను తన కళ్ళను తానే కూల్చుకుంది అని విశ్లేషణలు ఉన్నాయి. అదంతా వాజ్ పేయ్ వేవ్ లో బీజేపీకి దక్కిన ఆదరణ.
సీన్ కట్ చేస్తే 2014లో బీజేపీకి ఏపీలో మళ్లీ మోడీ రూపంలో ఒక ప్రభంజనం కనిపించింది. అప్పట్లో బీజేపీ సొంతంగా పోటీ చేస్తే ఈపాటికి బాగానే నిలదొక్కుకుని ఉండేది. పైగా ఆనాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదట బీజేపీకే మద్దతు ప్రకటించారు. ఆయనను కలుపుకుని విభజన ఏపీలో థర్డ్ ఆల్టర్నేషన్ గా ఈపాటికి బాగానే రాణించి ఉండేది.
కానీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని మళ్లీ తనకు తాను బ్రేకేసుకుంది. పోనీ 2014లో బీజేపీని నాలుగు ఎమ్మెల్యే రెండు ఎంపీ సీట్లలో ప్రజలు ఆదరించినందుకు అయినా ప్రత్యేక హోదా పోలవరానికి నిధులతో పాటు ఏపీకి తానే ఒక రాజధానిని నిర్మించి ఉంటే జనాలు ఎప్పటికీ గుర్తు పెట్టుకుని ఉండేవారు కదా. విభజన హామీలను నెరవేర్చితే బీజేపీని నెత్తిన పెట్టుకునే వారు కదా.
ఆశగా ఎదురుచూసిన ఏపీ ప్రజలకు బీజేపీ చేసింది ఏమీ లేదు అన్న భావన ఉంది. బీజేపీ నేతలు మాత్రం ఏపీకి ఎంతో చేశామని అంటారు. పైగా మాకు ఒక్క సీటు ఏపీలో లేకపోయినా ఎక్కువే చేశామని అంటారు. కేంద్రం మిగిలిన రాష్ట్రాలతో పాటే ఏపీకి ఇస్తోంది కదా అన్నది ప్రజల నుంచి సూటిగా వస్తున్న ప్రశ్న.
రోగి కోరింది, వైద్యుడు ఇచ్చేది ఒక్కటి అయినపుడే కదా న్యాయం జరిగేది. ప్రజలకు ఏది కావాలో అది చేయకుండా తాము అన్ని రాష్ట్రాలతో పాటే ఏపీకి కూడా ఏదో విదిలిస్తూ ఏపీ మమ్మల్ని చిన్నచూపు చూస్తోందని వగచి వాపోవడం తగునా అన్నదే ఇపుడు జనం నుంచి వస్తున్న ప్రశ్న. బీజేపీ అయితే ఏపీకి ఎంతో చేశామన్న భావన నుంచి ముందు తాను బయటపడాలని అంటున్నారు.
ప్రజల మనసులో ఏముందో చూడాలి, వారు కోరుకున్న వాటిని ఆలస్యం అయినా నెరవేర్చాలి. ఈ రోజుకీ లేట్ అయితే లేదు, ప్రత్యేక హోదా ఇస్తున్నామని ప్రకటించి జనసేనతో బీజేపీ ఎన్నికలకు వెళ్తే మంచి ఫలితాలే వస్తాయని అంటున్నారు. అలాగే పోలవరం మా బాధ్యత ఎలాంటి కొర్రీలు పెట్టకుండా పూర్తి చేస్తామని చెప్పడం కాదు నిధులు ఇవ్వమనండి బీజేపీ పట్ల జనాలు తన మనసు మార్చుకుంటారు కదా. అలాగే అమరావతికే మా మాద్దతు అని కాదు, అక్కడ భవనాల నిర్మాణానికి కేంద్రం ఉదారంగా నిధులు ఇచ్చినపుడే జనం నమ్ముతారు.
ఇదంతా ఎందుకు అంటే విశాఖలో మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఏపీలో ఒక్క సీటు లేకపోయినా ఎంతో చేస్తున్నామని అంటున్నారు. అలా జీవీఎల్ అనుకోవడం కాదు జనాలు అనుకోవాలి. కాస్తా తీరిక చేసుకుని ఏపీ జనం ఏమనుకుంటున్నారో కమలనాధులూ చూడండి అని అంతా కోరుతున్నారు.
అదే విధంగా జనం భాషలో రాజకీయాలు చేయకుండా మా మట్టి మా భూమి, దేవాలయాలు అంటూ బీజేపీ తన ఫిలాసఫీని తాను వల్లించుకుంటూ పోతే ప్రజలకు అదంత సులువుగా అర్ధం కాదు కదా మాస్టారూ అంటున్నారు. సో ఏపీలో ఎదగాలీ అనుకుంటే మూలుగులూ సణుగుళ్ళూ గొణుగుళ్ళూ కాదు, బీజేపీ యాక్షన్ ప్లాన్ తో దిగాల్సి ఉంది అని అంటున్నారు. దానికంటే ముందు బీజేపీ పట్ల మమకారం ఉన్న వారికి బాధ్యతలు ఇస్తే ఇంకా మేలు అంటున్నారు. పొత్తుల చూపులు చూసే వారిని తెచ్చి పెట్టి పార్టీకి సీట్లూ ఓట్లు అంటే కుదిరే పనేనా అని కూడా అంటున్నారు.