ఉన్నతాధికారులపై వేటు తప్పదా ?

ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన నేపధ్యంలో తెలంగాణాలోని కొందరు ఉన్నతాధికారులపై వేటు పడే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.

Update: 2023-10-10 13:30 GMT

ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన నేపధ్యంలో తెలంగాణాలోని కొందరు ఉన్నతాధికారులపై వేటు పడే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. విధి నియంత్రణలో అత్యంత వివాదాస్పదమైన అధికారులపై ఇప్పటికే ఎన్నికల సంఘానికి చాలా ఫిర్యాదులు వచ్చాయి. అయితే ఎన్ని ఫిర్యాదులు వచ్చినా వాళ్ళపై యాక్షన్ తీసుకునే అవకాశం లేదుకాబట్టి ఏమీ చేయలేక చూస్తు ఊరుకున్నది. అయితే షెడ్యూల్ ప్రకటించారు కాబట్టి వివాదాస్పదమైన అధికారులపైన కమీషన్ ఇపుడు కొరడా ఝుళిపించబోతోంది.

ఎలాగంటే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన దగ్గర నుండి చివరి వరకు ఎన్నికల విధుల్లో ఉండే అధికారులందరు కమీషన్ నిర్ణయానికి లోబడే పనిచేయాలి. వివాదాస్పదమైన అధికారుల్లో పోలీసులు, రెవిన్యు శాఖల్లోని వాళ్ళే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఈమధ్యనే తెలంగాణాలో పర్యటించిన కేంద్ర ఎన్నికల కమీషనర్ రాజకీయపార్టీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అనేకమంది అధికారులపైన ప్రతిపక్షాలు ఫిర్యాదులు చేశాయి.

కొన్ని పార్టీలు కొందరు అధికారులపైన ప్రత్యేకంగా రాతమూలకంగా కూడా ఫిర్యాదులు చేశారట. ఆ ఫిర్యాదులను కమీషన్ చాలా గోప్యంగా ఉంచింది. అయితే షెడ్యూల్ ప్రకటించారు కాబట్టి ఆరోపణలను ఎదుర్కొంటున్న అధికారుల చరిత్రను బయటకు తీయబోతున్నారు. దాని ఆధారంగా ఎవరెవరిపైన యాక్షన్ తీసుకోవాలి అన్న విషయాన్ని కమీషన్ డిసైడ్ చేస్తుంది. కొందరు ఎస్పీలతో పాటు కిందస్ధాయి అధికారులు, మరికొందరు కలెక్టర్లు అధికార పార్టీ చెప్పినట్లు మాత్రమే నడుచుకుంటున్నట్లు ప్రతిపక్షాలు ఫిర్యాదులు చేశాయట. ఈ ఫిర్యాదుల్లో నిజా నిజాలను కమీషన్ ఇపుడు విచారిస్తోందట. శాఖపరమైన అంతర్గత విచారణ ద్వారా విషయాలను తెలుసుకుంటోంది.

ఫిర్యాదుల్లో వాస్తవాలు ఉన్నాయని తేలితే వెంటనే అలాంటి వాళ్ళ జాబితాను కేంద్ర ఎన్నికల కమీషన్ కు పంపి వాళ్ళను ఎన్నికల డ్యూటీకి దూరంగా ఉంచాలని రికమెండ్ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. ఎందుకంటే వివాదాస్పద అధికారులను ఇతర ప్రాంతాలకు బదిలీచేసినా అక్కడ కూడా అదే వైఖరితో వ్యవహరించే అవకాశాలున్నాయన్నది కమీషన్ అభిప్రాయమట. కాబట్టి హోలుమొత్తంమీద అలాంటి అధికారులను ఎన్నికల ప్రక్రియకు దూరంపెట్టేస్తే సమస్యే ఉండదని అనుకుంటున్నది. ఏ అధికారి అయినా ప్రభుత్వం చెప్పినట్లు వినాల్సిందే తప్పదు. విన్నప్పుడల్లా ప్రతిపక్షాల నుండి ఫిర్యాదులూ తప్పవు. మరిక్కడ కమీషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News