'కొలుసు' కు ఏం తక్కువ చేశారో? పొలిటికల్ కామెంట్
ఈ వ్యాఖ్యలు చేయడానికి ముందు వరకు కూడా కొలుసు అంటే.. వైసీపీలో ప్రత్యేక స్థానం ఉండేది.
ఏమీ లేనప్పుడు.. కనీసం ఏదో ఒకటైనా దక్కితే బాగుంటుంది. అది దక్కితే .. ఇంకా ఏదో దక్కితే బాగుం టుంది. అది కూడా దక్కిందనుకోండి.. అసలైందేదో అది దక్కలేదనే ఏడుపు కామన్. ఇది రాజకీయాల్లో మరింత ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఈ చర్చ ఎందుకు వచ్చిందంటే.. తనను సీఎం జగన్ గుర్తించలేద ని, పెనమలూరు జనాలే గుర్తించారని.. వారికి తాను రుణపడి ఉంటానని.. మాజీ మంత్రి, వైసీపీ పెనమ లూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి.. ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసి తనకు తానే సెగ పెట్టుకున్నా రని రాజకీయవిశ్లేషకులు అంటున్నారు.
ఈ వ్యాఖ్యలు చేయడానికి ముందు వరకు కూడా కొలుసు అంటే.. వైసీపీలో ప్రత్యేక స్థానం ఉండేది. ఉంది కూడా. ఎందుకంటే.. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తొలిసారి ఆయనకు మంత్రి పదవిని ఇచ్చారు. ఐదేళ్ల పాటు ఆయనను కొనసాగించారు. పైగా.. వైఎస్‌కు-కొలుసుకు స్నేహం కూడా ఉంది. ఎప్పుడు కృష్ణాజిల్లా కు వచ్చినా..(తన హయాంలో మొత్తం ఐదు సార్లు వైఎస్ కృష్ణాకు వచ్చారు) కొలుసు ఇంటికి వెళ్లేవారు. దీంతో వైసీపీ కూడా అంతే ప్రాధాన్యం ఇచ్చింది. పైగా.. కాంగ్రెస్ నుంచి జగన్ బయటకు వచ్చి.. సొంత పార్టీ పెట్టుకున్నప్పుడు.. కొలుసు నోరు పారేసుకున్నారు.
వైసీపీపై తీవ్ర విమర్శలు కూడా చేశారు కొలుసు. అయినప్పటికీ.. 2014 ఎన్నికలస మయంలో ఆయన పార్టీలోకి వస్తానంటే సాదరంగా ఆహ్వానించారు. మచిలీపట్నం ఎంపీ సీటును సైతం ఇచ్చారు. ఆయన ఆ ఎన్నికల్లో ఓడిపోయినా.. తర్వాత.. 2019 ఎన్నికల్లో పెనమలూరు సీటును ఇచ్చారు. గెలిపించుకు న్నారు కూడా. ఇక, టీటీడీ బోర్డు మెంబర్ పదవిని ఇచ్చారు. కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఇంతగా.. వైసీపీ అధినేత జగన్.. కొలుసుకు ప్రాధాన్యం ఇచ్చారు.
అయితే.. కొలుసు వారి బాధేంటంటే.. పైన చెప్పుకొన్నట్టుగా.. ఒకటి దక్కినా.. ఇంకోటి దక్కలేదన్న బాధ. తనకు మంత్రి పీఠం ఇవ్వలేదన్న అక్కసు. ఇదే ఆయన నోరు జారేందుకు దారి తీసింది. నిజానికి కొలుసుకన్నా ముందే పార్టీకి అండగా ఉన్న అనేక మంది నాయకులకు కూడా జగన్ సామాజిక సమీకరణల్లో భాగంగా మంత్రి పీఠం ఇవ్వలేదు. అంత మాత్రాన వారంతా ఎదురుదిరిగారా? అనేది ప్రశ్న. ఇక, తాజాగా కొలుసు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.
‘మీరు చేసిన వ్యాఖ్యలు పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉన్నాయి. అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది!’ అంటూ కొలుసు పార్థసారథిని కీలక సలహాదారు ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే.. దీనికి ఆయన తప్పయింది.. తొందరపడ్డాను అని చెప్పుకొచ్చారట. అయినప్పటికీ.. పార్టీకి చాలా డ్యామేజీ జరిగిందని.. సీఎం జగన్ భావిస్తున్నట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కొలుసును పక్కన పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.