ఏమిటీ పౌరసత్వ సవరణ చట్టం.. ఏంటీ గోల?
సీఏఏను వారంలో దేశమంతా అమలు చేస్తామని కేంద్రం ప్రకటించడం కాక రేపుతోంది
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ముఖ్య అజెండాల్లో ఒకటి.. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ). ఇప్పుడు ఎన్నికల ముంగిట ఈ అంశం వివాదాస్పదమవుతోంది. సీఏఏను వారంలో దేశమంతా అమలు చేస్తామని కేంద్రం ప్రకటించడం కాక రేపుతోంది. అయోధ్యలో రామాలయ నిర్మాణంతోపాటు ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టం ద్వారా బీజేపీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావిస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
ఇంతకూ ఈ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అంటే.. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ దేశాల నుంచి వచ్చిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కల్పించడం. 2014 డిసెంబర్ 31కి ముందు ఆయా దేశాల నుంచి భార™Œ కు వలస వచ్చిన వారు భారత పౌరసత్వాన్ని పొందడానికి అర్హులు. ఆయా దేశాల నుంచి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులు దీని సీఏఏ కింద భారత పౌరసత్వం పొందొచ్చు.
ఆఫ్గనిస్తాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చినవారికి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా, వాటి గడువు ముగిసినా భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు 1955 నాటి పౌరసత్వ చట్టానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సవరణలు చేసింది.
వాస్తవానికి పౌరసత్వ సవరణ చట్టం ప్రతిపాదన బిల్లును మొదట 2016లో పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అయితే అప్పుడు బీజేపీ మిత్రపక్షం అసోం గణపరిషత్ తోపాటు తదితర పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అనంతరం 2019లో సీఏఏ బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఆమోదించాయి. తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) రూపుదాల్చింది.
అయితే దేశవ్యాప్తంగా సీఏఏపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. విపక్షాల ఆందోళనలతో దాని అమలు ఇన్నాళ్లూ వాయిదా పడింది. కానీ జమ్ముకాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించడం, లడఖ్ ను కేంద్రపాలిత ప్రాంతం చేయడం, అయోధ్యలో రామాలయం నిర్మాణం వంటి చర్యలతో దూకుడు మీదున్న బీజేపీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం విషయంలోనూ అంతే పట్టుదలతో ఉందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఎవరు అభ్యంతరం వ్యక్తం చేసినా పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయడం ఖాయమని వెల్లడించారు.
పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం.. 2014 డిసెంబర్ 31కి ముందు భారత్ కు వలస వచ్చిన మతపరమైన మైనారిటీలకు ఆరేళ్లలోపు భారత పౌరసత్వం కల్పిస్తారు. అలాగే వీరు భారత్ పౌరసత్వం పొందడానికి భారత్ లో కనీసం 11 ఏళ్లుగా నివసిస్తూ ఉండాలన్న నిబంధనను కూడా ఐదేళ్లకు తగ్గించారు.
అయితే హిందువులకు, క్రైస్తవులకు, బౌద్ధులకు, పార్శీలకు పౌరసత్వం ఇస్తూ ముస్లిం మైనారిటీలను చేర్చకపోవడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
సీఏఏపై విపక్షాల అభ్యంతరాలెందుకు అంటే.. వివిధ దేశాల నుంచి వలస వచ్చి భారత్ లో జీవిస్తున్న వివిధ మతాలవారు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు వీరికి పౌరసత్వం కల్పిస్తే వారంతా బీజేపీకి ప్రధాన ఓటు బ్యాంకుగా మారతారని విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే ముస్లింలకు పౌరసత్వం కల్పించకపోవడం పట్ల కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే విదేశీయుల కారణంగా స్థానికంగా ఉండేవారికి ఉపాధి విషయంలో, సంస్కృతి సంప్రదాయాల విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయని ప్రతిపక్షాల అభ్యంతరంగా ఉంది. అలాగే పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్గనిస్తాన్ ల నుంచి వచ్చినవారికి పౌరసత్వం కల్పిస్తూ శ్రీలంక, టిబెట్, మయన్మార్ నుంచి వచ్చినవారికి పౌరసత్వం ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మొత్తంగా సీఏఏ చట్టం రాజ్యాంగబద్ధతనే సవాలు చేస్తూ పలు పార్టీలు ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసులు వేశాయి. వీటిపై విచారణ తుది దశలో ఉంది.