ఏమిటి టాటా మీరిలా చేయటమా? ఎయిరిండియాకు భారీ ఫైన్!

అప్పుడెప్పుడో దశాబ్దాల క్రితం టాటాకు చెందిన ఎయిర్ ఇండియాను ప్రభుత్వం తీసుకోవటం.. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత తాజాగా ఆ విమానయాన సంస్థ తిరిగి టాటాల చేతికి చేరటం తెలిసిందే.

Update: 2023-11-23 05:20 GMT

యావత్ దేశంలోనే అత్యంత నమ్మకమైన బ్రాండ్లలో ముందు వరుసలో నిలుస్తుంది ‘టాటా’. దేశ ప్రజల్లో ఎవరికి ఎలాంటి అనుమానం లేని బ్రాండ్ల జాబితాను తీస్తే.. టాటాకు పడే ఓట్లు ఎంతన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి టాటా సంస్థ ఇమేజ్ ను దెబ్బ తీసే ఉదంతం తాజాగా చోటు చేసుకుంది. అప్పుడెప్పుడో దశాబ్దాల క్రితం టాటాకు చెందిన ఎయిర్ ఇండియాను ప్రభుత్వం తీసుకోవటం.. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత తాజాగా ఆ విమానయాన సంస్థ తిరిగి టాటాల చేతికి చేరటం తెలిసిందే.

అయితే.. టాటా సంస్థ చేతికి ఎయిర్ ఇండియా వెళ్లినప్పటికి.. వారి మార్క్ ఇంకా ఎయిరిండియా మీద కనిపించటం లేదన్న మాట వినిపిస్తూ ఉంటుంది. తాజాగా ఆ వాదనను బలం చేకూరే ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ యాజమాన్యంలో సుదీర్ఘకాలం పని చేసిన ఎయిరిండియా తన పాత వాసనల్ని ఇంకా వదిలించుకోలేదని చెప్పాలి. ప్రస్తుతం టాటా గ్రూపు నిర్వహిస్తున్న ఎయిర్ ఇండియాపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్.. మే - సెప్టెంబరు మధ్య కాలంలో షెడ్యూల్డ్ డొమెస్టిక్ ఆపరేటర్ల కోసం ఢిల్లీ.. కొచ్చిన్.. బెంగళూరు ఎయిర్ పోర్టుల్లో తనిఖీలు నిర్వహించింది.

ఈ సందర్భంగా ప్రయాణికులకు అందిస్తున్న సౌకర్యాలు.. నష్టపరిహారానికి సంబంధించిన అంశాల్ని పరిశీలించింది. వీటిని పాటించే విషయంలో ఎయిర్ ఇండియా ఫెయిల్ అయ్యిందన్న విషయాన్ని గుర్తించారు. దీంతో.. డీజీసీఏ రూల్స్ ప్రకారం ఎయిర్ ఇండియాకు రూ.10లక్షల జరిమానా విధిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. దీనికి ముందు సదరు సంస్థ నుంచి వివరణ తీసుకున్నారు. ఎయిర్ ఇండియా ఇచ్చిన వివరణను సమీక్షించిన తర్వాత సీఏఆర్ నిబందనల్ని పాటించటంలో టాటా గ్రూప్ ఫెయిల్ అయ్యిందన్న విషయాన్ని నిర్దారించారు.

ఇంతకూ వారు గుర్తించిన అంశాల్ని చూస్తే.. ఆలస్యమైన విమానాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులకు హోటల్ వసతి లేకపోవటం.. కొంతమంది గ్రౌండ్ సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వకపోవటం.. కొందరు సర్వీస్ లేని సీట్లలో ప్రయాణించాల్సి రావటం లాంటి అంశాల్ని గుర్తించారు. దీంతో.. ఫైన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. టాటా సంస్థకు ప్రజల్లో ఉన్న నమ్మకం.. విశ్వసనీయతకు ప్రశ్నగా మారే ఈ వైఖరిపై సదరు సంస్థ తక్షణం ఫోకస్ చేయాల్సి ఉంది. లేకుంటే ఎయిర్ ఇండియా కారణంగా గ్రూప్ నకు చెందిన మిగిలిన సంస్థల పైనా ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం పొంచి ఉంది.

Tags:    

Similar News