జగన్ లండన్.. బాబు అమెరికా.. పవన్ ఎక్కడ?
అయితే, పవన్ పోలింగ్ అనంతరం ఏపీ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ లేఖ విడుదల చేసి..తాను రాష్ట్ర నాయకుడిని అనిపించుకున్నారు.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు అత్యంత హోరాహోరీగా జరిగి.. ప్రజల్లో ఉత్కంఠను పెంచాయి. మిగతా రాష్ట్రాలూ ఇటు చూస్తున్నాయంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ప్రత్యేకత ఏమిటో తెలిసిపోతుంది. అంతేగాక పదేళ్ల తర్వాత టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు పెట్టుకుని బరిలో దిగాయి. ఎప్పటిలాగానే వైసీపీ ఒంటరి పోరులో నిలిచింది. అయితే, ఐదేళ్లు అధికారంలో ఉన్నందున వైసీపీని ఈసారి ఒంటరి అనలేం.
జగన్ లండన్..
ఇక ఎన్నికల అనంతరం ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ భార్య భారతితో కలిసి లండన్ వెళ్లారు. ఆయన జూన్ 1న కానీ తిరిగి రారు. వచ్చిన వెంటనే ఓట్ల లెక్కింపు సమయంలో పార్టీ నేతలకు జాగ్రత్తలపై దిశానిర్దేశం చేయనున్నారు. జూన్ 4న వెలువడే ఫలితాలు అనుకూలంగా వస్తే జగన్ మరోసారి సీఎం అవుతారు. లేదంటే ప్రతిపక్ష నేత పాత్రకు పరిమితం అవుతారు.
బాబు అమెరికా..
పోలింగ్ తర్వాత కొద్ది రోజులు ఏపీలోనే ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు తర్వాత భార్య భువనేశ్వరితో కలిసి అమెరికా వెళ్లారు. రెండు రోజుల కిందట సింగపూర్ లో ఆయన రోడ్డు దాటుతున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే ఇవి ఎడిట్ చేసినవని తర్వాత తేలింది. చంద్రబాబు తిరిగి ఎప్పుడు వచ్చేది ఎప్పుడూ అంటే ఈ నెల 31. అంటే జగన్ కంటే ఒకరోజు ముందే ఏపీకి తిరిగిరానున్నారు అన్నమాట.
పవన్ ఎక్కడ?
ఏపీ రాజకీయాల్లో ఈసారి అత్యంత కీలకంగా భావిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోలింగ్ అనంతరం వారాణాసీలో ప్రధాని మోదీ నామినేషన్ కు చంద్రబాబుతో కలిసి వెళ్లారు. ఆ తర్వాత భార్య అన్నా లెజ్నోవాతో కలిసి ఆలయాలను సందర్శించారు. కాగా, అప్పటినుంచి పవన్ ఎక్కడున్నదీ బయటకు తెలియదు. బహుశా ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్లు భావించాలేమో? వాస్తవానికి ఏపీ ఎండల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా పవన్ నీరసించారు. అది ఆయన ముఖంలో స్పష్టంగా కనిపించింది. అయినప్పటికీ పంటి బిగువన భరించారు. ఇక మే 13న పోలింగ్ అనంతరం పవన్ పిఠాపురం వెళ్లలేదు. ఫలితాల వెల్లడి రోజైన జూన్ 4 తిరిగి తాను పోటీచేసిన నియోజకవర్గానికి వెళ్లనున్నారు. కాగా, పిఠాపురం జన సేన శ్రేణులు మాత్రం పవన్ తమకు ధన్యవాదాలు చెప్పలేదని నొచ్చుకున్నారట. అయితే, పవన్ పోలింగ్ అనంతరం ఏపీ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ లేఖ విడుదల చేసి..తాను రాష్ట్ర నాయకుడిని అనిపించుకున్నారు.