ఏపీ ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ఎటు వైపు ....!?

ఏకంగా ఉమ్మడి ఏపీలో అనేక జిల్లాలలో తిరిగి వందకు పైగా నియోజకవర్గాల్లో టీడీపీ తరఫున అదరగొట్టిన స్పీచ్ లిచ్చారు.

Update: 2023-12-26 14:45 GMT

జూనియర్ ఎన్టీఆర్ అంటే ఒక ప్రభంజనం. యూత్ ఐకాన్. అంతే కాదు నందమూరి ఫ్యామిలీలో మూడవ తరం సూపర్ స్టార్. జూనియర్ 2009లో టీడీపీకి మద్దతు ఇచ్చారు. ఎన్నికల సభలలో ప్రచారం చేశారు. ఏకంగా ఉమ్మడి ఏపీలో అనేక జిల్లాలలో తిరిగి వందకు పైగా నియోజకవర్గాల్లో టీడీపీ తరఫున అదరగొట్టిన స్పీచ్ లిచ్చారు.

అయితే ఆ తరువాత మళ్లీ జూనియర్ టీడీపీ ప్రచారంలో ఎక్కడా కనిపించలేదు. ఇప్పటికి పదిహేనేళ్ళు అవుతోంది. మధ్యలో రెండు ఎన్నికలు జరిగాయి. 2014లో టీడీపీ గెలిచింది. 2019లో వైసీపీ గెలిచింది. ఈసారి ఎన్నికలు టీడీపీకి ఒక విధంగా చావో రేవో అన్నట్లుగా ఉండబోతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం కోసం టీడీపీ సర్వ శక్తులూ ఒడ్డుతోంది.

ఈసారి ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారానికి నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవరు వస్తున్నారు అన్నది కూడా ఆసక్తికరమైన అంశం కాబోతోంది. అందరి విషయం ఎలా ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ ఎటు వైపు అన్న చర్చ కూడా వస్తోంది. అయితే దీని మీద జూనియర్ అన్న హీరో కళ్యాణ్ రామ్ కొన్ని విషయాలు చెప్పారు. ఆయన లేటెస్ట్ మూవీ డెవెల్ కి సంబంధించి వివరాలు తెలియచేస్తూ ఇస్తున్న ఇంటర్వ్యూలలో భాగంగా ఒక యూట్యూబ్ చానల్ కి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నికల అంశం ప్రస్తావనకు వచ్చింది

ఏపీలో జరిగే ఎన్నికల్లో ఎటు వైపు అన్న దానికి కాసేపు ఆలోచించిన మీదట కళ్యాణ్ రామ్ చెప్పిన సమాధానం ఏంటి అంటే తాను ఒక్కడినే ఈ ప్రశ్నకు జవాబు చెప్పలేను అన్నారు. తమ కుటుంబం అంతా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పారు. కుటుంబం అంటే తాను తారక్ అని చెప్పేశారు. అంటే జూనియర్ కళ్యాణ్ రామ్ ఇద్దరూ కలసి ఒక డెసిషన్ తీసుకుని ముందుకు వస్తారు అన్న మాట.

ఆ డెసిషన్ టీడీపీ ప్రచారానికి అనుకూలంగా ఉండబోతుందా లేక ఈ రాజకీయాలు మనకెందుకు అని సైలెంట్ గా ఉండడమే డెసిషన్ కాబోతుందా అన్నది తెలియదు. అయితే జూనియర్ వైఖరి చూస్తే మాత్రం ఆయన సీరియస్ గా తన ప్రొఫెషన్ మీదనే దృష్టి పెట్టి ఉన్నారు. ట్రిపుల్ ఆర్ తో గ్లోబల్ స్టార్ అయ్యారు. దాంతో ఆయన లెటేస్ట్ మూవీస్ అన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లో చేస్తున్నారు. ఇక ఆ బిజీలోనే జూనియర్ ఉన్నారు.

ఇదే మాటను కళ్యాణ్ రామ్ కూడా చెబుతూ సినిమాలు అంటే వేరు రాజకీయాలు వేరు అని చెప్పుకొచ్చారు. అందువల్ల తానూ తారక్ కలసి దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటామని అన్నారు ఇక ఫ్యామిలీ అంటే తాను తారక్ మాత్రమే మిగిలామని కూడా కళ్యాణ్ రామ్ చెప్పడం విశేషం. నిజానికి నందమూరి ఫ్యామిలీ అంటే పదుల సంఖ్యలో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వీరంతా అప్పట్లో చంద్రబాబు అరెస్ట్ మీద సానుభూతి వ్యక్తం చేస్తూ వైసీపీ సర్కార్ కి వ్యతిరేకంగా నిరసన తెలియచేశారు.

అపుడు కూడా జూనియర్ కళ్యాణ్ రామ్ సైలెంట్ గా ఉన్నారు. బహుశా రేపటి ఎన్నికల్లో కూడా అదే సైలెంట్ మెయింటెయిన్ చేయవచ్చు అని అంటున్నారు. ఎందుకంటే నందమూరి ఫ్యామిలీ మొత్తం చంద్రబాబు వెంట నడుస్తోంది. ఆయనతో చాలాకాలం విభేదించిన దగ్గుబాటి ఫ్యామిలీ కూడా బాబుకు దగ్గర అవుతోంది.

కానీ ఇపుడు చంద్రబాబు విషయంలో దూరంగా ఉంటూ రాజకీయ నీడ పడకుండా జాగ్రత్తగా నెట్టుకుని వస్తున్నది మాత్రం కళ్యాణ్ రామ్, జూనియర్ అని మాత్రమే చెప్పాలి ఈ ఇద్దరే ఇపుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. మరి సినిమాలే ప్రపంచంగా మార్చుకున్న జూనియర్ మాత్రం ఏపీ రాజకీయాల వైపు తొంగి చూడకపోవచ్చు అని చర్చ అయితే సాగుతోంది.

Tags:    

Similar News