హుజూరాబాద్లో ఎవరో బాద్ షా?
బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లిన ఈటల.. ఇప్పుడు అదే పార్టీకి కొరకరాని కొయ్యగా మారారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతోంది. విజయం కన్నేసిన వివిధ పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక నాయకులు బరిలో దిగిన నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ ఉంది. ఇందులో హుజూరాబాద్ నియోజకవర్గం కూడా ఒకటి. ఇక్కడి నుంచి బీజేపీ అగ్రనేత ఈటల రాజేందర్ పోటీలో ఉండటమే అందుకు కారణం. బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లిన ఈటల.. ఇప్పుడు అదే పార్టీకి కొరకరాని కొయ్యగా మారారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హుజూరాబాద్ అంటే బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉండేది. కానీ ఈటల రాజేందర్ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరి ఉప ఎన్నికలో గెలవడంతో పరిస్థితి మారిందనే చెప్పాలి. హూజూరాబాద్ లో గతంలో ఇతర పార్టీలకూ తగిన గుర్తింపు దక్కింది. 1957 నుంచి ఇక్కడ వరుసగా నాలుగు సార్లు కాంగ్రెస్ గెలిచింది. స్వతంత్ర అభ్యర్థులూ మూడు సార్లు విజయాలు సాధించారు. తెలుగు దేశం పార్టీ (1985, 1994, 1999) మూడు సార్లు జెండా ఎగిరేసింది. కానీ 2004 నుంచి ఇక్కడ బీఆర్ఎస్ దే హవా. 2004, 2008 ఎన్నికల్లో లక్ష్మీకాంత రావు అప్పటి టీఆర్ఎస్ నుంచి గెలిచారు. 2009 నుంచి ఈటల రాజేందర్ వరుసగా గెలుస్తున్నారు.
కానీ 2021లో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఈటల బీజేపీలో చేరిపోయారు. ఉప ఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేసి మరీ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకున్నారు. ఇప్పుడు మరోసారి హుజూరాబాద్ లో విజయకేతనం ఎగరేయాలని ఈటల చూస్తున్నారు. ఆయనపై అక్కడి ప్రజలకు ఉన్న నమ్మకంతో ఈటల దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ సారి బీఆర్ఎస్ నుంచి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి వొడితల ప్రణవ్ బరిలో నిలిచారు. అయినా మరోసారి ఇక్కడ ఈటల విజయాన్ని అడ్డుకోవడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.