కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి కాకుంటే సీఎం ఎవరు...

వందకు వేయి శాతం కాంగ్రెస్ నాయకులు తాము అధికారంలోకి రాబోతున్నామని విశ్వాసంతో ఉన్నారు.

Update: 2023-12-02 12:28 GMT

కాంగ్రెస్ పార్టీకి తెలంగాణాలో ఈసారి అవకాశం లభిస్తుందని అధికారం వారిదే అని అనేక సర్వే నివేదికలు వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా బల్లగుద్ది మరీ అదే నిజం అని చెప్పేసాయి. ఇక అఫీషియల్ గా ఈ ఆదివారం ఈవీఎం మిషన్లు తెరచి ప్రజా తీర్పును తెలుసుకోవడమే మిగిలింది. వందకు వేయి శాతం కాంగ్రెస్ నాయకులు తాము అధికారంలోకి రాబోతున్నామని విశ్వాసంతో ఉన్నారు.

ఎటు నుంచి ఎలా జరిగినా మంచి మెజారిటీ తమకు వస్తుందని కూడా అంటున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే ఎనభైకి తక్కువ కాకుండా సీట్లు దక్కుతాయని కూడా గన్ షాట్ గా చెప్పుకొస్తున్నారు. సరే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అని అంతా అంటున్న వేళ తెలంగాణాకు కాంగ్రెస్ నుంచి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అన్న కొత్త చర్చకు తెర లేస్తోంది.

ఇప్పటిదాకా బీయారెస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా ఉన్న హాట్ డిస్కషన్ కాస్తా ఇపుడు చేంజ్ అవుతోంది. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి వర్సెస్ అదర్స్ అన్నట్లుగా మరో చర్చ నడుస్తోంది. రేవంత్ రెడ్డికి సీఎం నూటికి నూరు శాతం ఇవ్వాలని అన్న వారూ ఉన్నారు. వద్దు ఆయన కంటే సీనియర్ నేతలు ఉన్నారని అన్న వారూ ఉన్నారు.

రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కాబట్టి సహజంగా ఆయన పేరు ఎపుడూ అగ్ర స్థానంలోనే ఉంటుంది. అంతే కాదు రేవంత్ రెడ్డి పార్టీ కోసం మొత్తం తెలంగాణా అంతటా తిరిగారు. తాను పోటీ చేస్తున్న రెండు సీట్లతో పాటుగా అందరి అభ్యర్ధుల విజయానికి ఆయన చాలా గట్టిగా కృషి చేశారు.

మరి రేవంత్ రెడ్డికి ఈ విజయంలో భాగం చాలానే ఉందని అంతా ఒప్పుకుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక మహా సముద్రం. అది గెలిచిన తరువాత ఎక్కడ లేని నేతలూ పోటీకి వస్తారు. ఆ విధంగా చూస్తే కాంగ్రెస్ లో లిస్ట్ కూడా పెద్దదిగానే ఉంటుంది. దానికి తోడు సీనియర్లమని చెప్పుకుంటూ కాంగ్రెస్ లో అనేక మంది నేతలు ఉన్నారు.

వారు స్వేచ్చగా మీడియా ముందుకు వచ్చి ఎక్కువగానే మాట్లాడుతూంటారు అన్న భావన ఉంది. అంతే కాదు చాలా మంది నేతలకు కోపం వచ్చినా పట్టలేరు. వారు మీడియా ముందుకు చటుక్కున వచ్చేసి తమ ఆగ్రహన్ని చూపించేస్తారు. అలాగే అలక పానుపు ఎక్కే నేతలకు కూడా కాంగ్రెస్ లో కొదవ లేదు.

అంతే కాదు తడవకోసారి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేసి మరీ హై కమాండ్ కి ఫిర్యాదులు చేసే నాయకులూ ఉంటారు. ఇలా కాంగ్రెస్ అనే మహా సముద్రంలో విభిన్న మనస్తత్వం కలిగిన వారు ఉన్నారు. ఇక కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేశారు. పార్టీ కోసం అనేక రకాలుగా కష్టపడ్డారు.

వివిధ రకాలైన సమీకరణల నేపధ్యంలో ఒక వేళ రేవంత్ రెడ్డిని పక్కన పెట్టినట్లు అయితే మాత్రం ఎవరికి చాన్స్ ఇస్తారు అన్నది కూడా చర్చగా ఉంది. మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నరు. అలాగే నల్గొండ జిల్లాకు చెందిన కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. సీనియర్ మోస్ట్ నేత కె జానారెడ్డి ఉన్నారు. అదే విధంగా లేడీ ఫైర్ బ్రాండ్ గా రేణుకా చౌదరి పేరు వినిపిస్తోంది.

ఇక సీఎల్పీ లీడర్ గా ఉన్న మల్లు భట్టి విక్రమార్క ఉన్నారు. అలాగే మరో సీనియర్ నేత జీవన్ రెడ్డి ఉన్నారు. ఇంత మంది సీనియర్ నేతలలో ఎవరికి చాన్స్ ఇస్తారు ఎవరి పేరు ముందుకు వస్తుంది ఒకవేళ వీరిలో ఒకరికి ఇస్తే మిగిలిన వారు శాంతిస్తారా అన్నది కూడా చర్చకు వస్తోంది.

ఇక కాంగ్రెస్ ని గెలిపించిన ప్రజలకు కూడా ఆ పార్టీలో ఎవరు సీఎం అవాలో అన్న ఆలోచన ఉంటుంది కదా. అలా ఆలోచిస్తే రేవంత్ రెడ్డి పేరునే ఎక్కువ మంది చెబుతున్నారు. మరి రేవంత్ రెడ్డిని కాకుండా ఎవరికి ఇచ్చినా వివాదాలకు తావు లేకుండా కొత్త సీఎల్పీ నేతను ఎంపిక చేయడం అంత సులువునా అన్న చర్చ కూడా వస్తోంది.

ఏది ఏమైనా కాంగ్రెస్ అందరి ఆమోదం అయిన నేతకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని జనాలు కోరుతున్నారు. అంతే కాదు ప్రజల మద్దతు ఉన్న వారికీ వివాదరహితులకు ఈ పదవిని ఇస్తే కాంగ్రెస్ కే మంచి మార్కులు పడతాయని ప్రజలు ఇచ్చిన తీర్పునకు కూడా అర్ధం పరమార్ధం ఉంటుందని అంటున్నారు. మరి హై కమాండ్ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News