అటు మస్తాన్... ఇటు వేణు స్వామి...!
రాజకీయాలనే శ్వాసగా చేసుకున్న జగన్ కి చంద్రబాబుకు అర్ధం కావా అన్నదే కదా ప్రశ్న.
ఏపీలో భీకరమైన పోరు సాగుతోంది. ఎవరు కూడా ఏ చిన్న చాన్సూ వదులుకోలేని నేపధ్యం ఉంది. ఎందుకంటే ఈ ఎన్నికలు అలాంటివి. ఈసారి గెలిచిన వారు రాజకీయంగా పాతుకుపోతారు. ఓడిన వారు ఇబ్బందులూ పడతారు.
ఇది తలపండిన రాజకీయ విశ్లేషకులకు అర్ధం అయ్యే విషయం. రాజకీయాలనే శ్వాసగా చేసుకున్న జగన్ కి చంద్రబాబుకు అర్ధం కావా అన్నదే కదా ప్రశ్న. దాంతోనే ఇద్దరూ మోహరించి మరీ రాజకీయ కురుక్షేత్రానికి తెర లేపారు.
పోలింగ్ ఘట్టం ముగిసింది. కొద్ది గంటలలో కౌంటింగ్ కి తెర లేవనుంది. ఈ కీలకమైన టైంలో ఏపీ రాజకీయ జాతకాలను తిప్పేస్తోంది ఇద్దరే ఇద్దరు. ఇలా జూన్ నెల ఎంట్రీ ఇస్తూనే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఈసారి పదుల సంఖ్యలో వచ్చాయి. వెల్లువలా వచ్చాయి. పుట్టగొడుగుల మాదిరిగా ప్రతీ సంస్థ సర్వేలు చేసి వదిలేసింది.
ఇందులో ఏది ప్రామాణికమో ఏది ప్రతిష్టాత్మకమో కూడా తెలియని అయోమయం ఏర్పడింది. అయితే అందరి చూపూ మాత్రం ఆరా సంస్థ మస్తాన్ మీదనే ఉంది. ఆయన తేల్చి చెప్పేశారు. వైసీపీదే మరోసారి అధికారం అని. అంతే అక్కడ నుంచి రాజకీయ రచ్చ స్టార్ట్ అయింది.
దేశంలో దిగ్గజ సంస్థలు ఇచ్చిన సర్వేలను సైతం పక్కన పెట్టి అరా మస్తాన్ సర్వే మీద సోషల్ మీడియాలో అతి పెద్ద వార్ సాగుతోంది. టీడీపీ నేత బుద్దా వెంకన్న లాంటి వారు అయితే కూటమి అధికారంలోకి రాకపోతే నాలిక తెగ్గోసుకుంటాను అని సవాల్ చేశారు.
అంటే అంతలా ఆరా మస్తాన్ సర్వే టీడీపీలో కుదుపు పుట్టించింది అన్న మాట. ఇంకో వైపు చూస్తే వరసబెట్టి యూట్యూబ్ చానల్స్ ఆరా మస్తాన్ ని ఇంటర్వ్యూ చేస్తున్నాయి. ఆయన తన సర్వే నూరు శాతం నిజం తప్పు అయితే మీడియాకే ముఖం చూపించను అని పెను సవాల్ చేస్తున్నారు.
ఎందుకు కంగారు రెండు రోజులు మాత్రమే కదా. నా సర్వే ఫలితాలు ఎలా వస్తాయో చూడండి అని ఆయన మరింత గట్టిగా చెబుతున్నారు. దీంతో టీడీపీతో పాటు వైసీపీలోనూ ఆందోళన పెరుగుతోంది. ఎందుకంటే వైసీపీలో పలువురు కీలక నేతల ఓటమిని మస్తాన్ రాసేశారు. దాంతో వారు కలవరపడుతున్నారు.
ఇక మస్తాన్ వర్సెస్ టీడీపీ సోషల్ మీడియా అన్నట్లుగా ఉన్న సీన్ ను మార్చేసి జ్యోతీష్య సెలిబ్రిటీ వేణు స్వామి రంగ ప్రవేశం చేశారు. ఆయన ఎగ్జిట్ పోల్స్ అయిన తరువాత ఫస్ట్ రియాక్షన్ ఇచ్చారు. వీరంతా ఇపుడు సర్వేలు చూసి చెబుతున్నారు తాను నాలుగేళ్ళ క్రితమే జగన్ మరోసారి సీఎం అని చెప్పేశాను అని క్రెడిట్ తీసుకున్నారు. అంతే కాదు జగన్ కి 17 ఏళ్ల పాటు రాజయోగం ఉందని అది 2019 నుంచి స్టార్ట్ అయిందని ఆయన 2029లో కూడా మరో సారి సీఎం అని మరో కొత్త జోస్యం కూడా వదిలారు.
అసలే 2024లో ఎవరిది అధికారం అని అంతా ఉగ్గబట్టి చూస్తున్న వేళ 2029లో సీఎం సీటుకు కూడా వేణుస్వామి జగన్ కి రిజర్వ్ చేసి కర్చీఫ్ వేసేసారు. మొత్తానికి చూస్తే కౌంటింగ్ కి కొద్ది గంటల ముందర అటు మస్తాన్ ఇటు వేణుస్వామీ ఇద్దరూ పాలిటిక్స్ ని షేక్ చేసేస్తున్నారు.
చిత్రమేంటి అంటే ఆరా మస్తాన్ 2012 ఉప ఎన్నికల నుంచి సర్వేలు చేస్తూ వస్తున్నారు. ఆయన సర్వేలు అన్నీ కూడా నూరు శాతం సక్సెస్ రేటుతో ఉన్నాయి. ఇక వేణు స్వామి విషయం తీసుకుంటే ఆయన చెప్పిన జాతకాలు చాలా మటుకు కరెక్ట్ అయ్యాయి. కొన్ని ఫెయిల్ కూడా అయ్యాయి. ఒకరేమో సైంటిఫిక్ మెథడాలజీ నమ్ముకున్నారు. మరొకరు ఆధ్యాత్మికం తో పాటు వేదం నుంచి పుట్టిన జోతీష్యాన్ని నమ్ముకున్నారు. మరి ఈ రెండూ భిన్న దృవాలు. ఈ రెండూ సక్సెస్ అవుతాయా లేదా అన్నదే ఇపుడు ఏపీ తో పాటు దేశాన్ని కూడా ఉత్కంఠను పెంచే అంశంగా మారింది.