అందుకే తెలంగాణలో పోటీ చేయలేదు: చంద్రబాబు
తెలంగాణలో పర్యటిస్తున్న చంద్రబాబు.. తాజాగా ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు.
తెలంగాణలో గత ఏడాది నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ఈ ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కారణంగానే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ ఏకంగా పార్టీకి రాజీనామా చేసి బీఆర్ ఎస్ పంచకు చేరిపోయారు. అయితే.. టీడీపీ ఎందుకు దూరంగా ఉంది? ఎన్నికల్లో ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు? అనే ప్రశ్నలకు కారణాలు మాత్రం ఇప్పటి వరకు పార్టీ అధినేత చంద్రబాబు చెప్పలేదు. తాజాగా ఆయన ఈ విషయంపై మనసులో మాట బయట పెట్టారు. తెలంగాణలో పర్యటిస్తున్న చంద్రబాబు.. తాజాగా ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు.,
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రత్యేక పరిస్థితుల కారణంగానే తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు. ఇంతకు మించిన ప్రత్యేక కారణం ఏమీలేదని.. పైకి ఎవరో ఏదో చెప్పారని ఏమీ నమ్మాల్సిన అవసరం లేద న్నారు. కానీ, ఇప్పుడు తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేసుకోవాల్సి ఉందన్నారు. త్వరలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని నియమించనున్నట్టు చెప్పారు. గ్రామీణ స్తాయి నుంచి పార్టీని డెవలప్ చేసే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా తెలంగాణలో త్వరలోనే ప్రారంభించనున్నట్టు చెప్పారు.
ఈ సందర్భంగా పార్టీని వీడిపోయిన నాయకులు విషయం చర్చకు వచ్చింది. దీనిపై స్పందిస్తూ.. పార్టీ ఆవిర్భావం నుంచి అనేక మంది నాయకులు వచ్చారు.. వెళ్లారని.. కానీ, పార్టీ సిద్ధాంతాలు మాత్రం పదిలంగానే ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. అనేక ఎత్తు పల్లాలను పార్టీ చవి చూసిందన్నారు. అనేక విజయాలను కూడా సొంతం చేసుకుందన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నిక ల్లో తెలంగాణలోని ప్రతి జిల్లాలోనూ పోటీకి పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. క్యాడర్ పార్టీకి అత్యంత కీలకమన్న చంద్రబాబు.. అందరూ కేడర్‌ను సమన్వయం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణలో కొన్ని ప్రత్యేక కారణాలతోనే పార్టీ బలహీన పడిందన్న చంద్రబాబు.. పుంజుకునేలా చేసే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తానని తెలిపారు. అదేసమయంలో ఏపీ, తెలంగాణల మధ్య నెలకొన్న సమస్యలను శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు తాను ఎప్పుడూ సిద్ధమేనని చంద్రబాబు వెల్లడించారు. ప్రతిఒక్కరినీ కలుపుకొని పోతానని.. ఎవరితోనూ విభేదాలు పెట్టుకునే తత్వం తనకు లేదని.. పరోక్షంగా సీఎం రేవంత్‌ను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు.