జగనే ఎందుకు కావాలి.. ఇవే వైసీపీకి ప్లస్‌లు కానున్నాయా..!
ప్రజలతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని ఎక్కడా సడలిపోకుండా కూడా చూసుకుంటారు.
రాష్ట్రంలో వినూత్న కార్యక్రమాలకు.. వినూత్న పథకాలకు తెరదీసి.. సంచలనం సృష్టించిన వైసీపీ అధినేత సీఎం జగన్.. ప్రచారంలోనూ వినూత్నంగానే ఆలోచిస్తుంటారు. ప్రజలతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని ఎక్కడా సడలిపోకుండా కూడా చూసుకుంటారు. వాస్తవానికి ఎన్నికలకు ఆరు మాసాల ముందు ప్రారం భించాల్సిన ప్రచారం కావొచ్చు.. ప్రభుత్వ వ్యతిరేకతపై పోరు కావొచ్చు.. ఏదైనా కూడా ఆయన రెండేళ్ల ముందుగానే ప్రారంభించడం గమనార్హం.
ఇలా... వచ్చినవే గడప గడపకు మన ప్రభుత్వం, మా నమ్మకం నువ్వే జగన్! వంటి అనేక కార్యక్రమాలకు తెరదీశారు. ఈ పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ``వై జగన్ నీడ్స్ ఏపీ`` పేరుతో ఒక కార్యక్ర మానికి శ్రీకారం చుట్టారు. ఇది 2024 ఎన్నికలకు ముందు.. వైసీపీ ప్రారంభిస్తున్న అధికారిక అతి ప్రతిష్టా త్మక కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు మళ్లీ సీఎంగా జగనే ఎందుకు కావాలనే విషయంపై వివరించనున్నారు.
ఈ కార్యక్రమం మొత్తం.. సీనియర్ ఐఏఎస్ అధికారుల కనుసన్నల్లోనే జరగనుంది. ప్రధానంగా ఈ కార్యక్ర మం ద్వారా.. ప్రజలకు క్షేత్రస్థాయిలో ప్రభుత్వాన్ని మరింత చేరువ చేయడం, సీఎంగా జగన్ ఇప్పటి వరకు చేసిన సేవలు వంటి వాటిని ప్రధానంగా ప్రస్తావించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే ఎన్నిక ల్లో వైసీపీని అధికారంలోకి తీసుకురావడమే ప్రధానంగా కనిపిస్తున్నప్పటికీ.. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు. తద్వారా.. మరోసారి జగనే ఎందుకు సీఎం కావాలో వివరించనున్నారు.
ప్రధానంగా ప్రస్తావించే అంశాలు..!
+ అమ్మ ఒడి. చేయూత, రైతు భరోసా
+ పింఛన్ల పెంపు.( వచ్చే జనవరి నుంచి రూ.3000లకు చేరుతున్న వైనం)
+ డ్వాక్రా రుణాలు
+ నాడు -నేడు, ఇంగ్లీష్ మీడియం
+ వివిధ వృత్తి దారులకు ఏటా రూ.10 వేల సాయం.
+ నేతన్నకు రూ.45 వేల సాయం
+ విప్లవాత్మక పథకంగా ఆరోగ్య శ్రీ.
+ ఇంటింటి డాక్టర్, జగనన్న సురక్ష