చంద్రబాబు అరెస్టుపై అందరూ ఎందుకు స్పందించాలి.. ఇంట్రస్టింగ్ డిబేట్
సాధారణంగా ఇలాంటి రాజకీయాల విషయంపై స్పందించేందుకు పారిశ్రామిక వేత్తలు కానీ.. సినీ ఇండస్ట్రీలో అగ్రతారలు కానీ ఉత్సాహం చూపించరు.
టీడీపీ అధినేత చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేయడం, ఆ వెంటనే ఆయనను రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టడం వంటి అంశాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టించింది. స్కిల్ డెవలప్‌మెంటుకు సంబంధించి రూ.341 కోట్ల అవినీతికి పాల్పడ్డారనేది వైసీపీ సర్కారు(ఏపీ సీఐడీ) చేసిన ప్రధాన ఆరోపణ. అయితే.. స్కిల్ డెవలప్‌మెంటులో అసలు అవినీతే లేదని.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్ మెంటు సెంటర్లను పరిశీలిస్తే.. ఈ విషయం స్పష్టంగా తెలుస్తుందనేది టీడీపీ వాదన. అంతేకాదు.. అసలు ఇదంతా కూడా రాజకీయ ప్రతీకారంతోనూ.. కుట్రతోనూ చేస్తున్న పనిగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు.
ఇదిలావుంటే, చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ.. టీడీపీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఉద్యమాలకు తెరదీశారు. ఏపీ లోని రెండు మూడు జిల్లాల్లో తొలుత ప్రారంభించిన ఆందోళనలు తర్వాత కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు.ఇక, ఆ తర్వా త.. పొరుగు రాష్ట్రాల్లోని ఐటీ ఉద్యోగులు కూడా ఈ నిరసనలో పాలు పంచుకున్నారు. అదేవిధంగా పలువురు ఎన్నారైలు అమెరి కా సహా వివిధ దేశాల్లో చంద్రబాబు మద్దతుగా.. ఆయనను అరెస్టును ఖండిస్తూ రోడ్డెక్కారు. మొత్తంగా ఏపీ సర్కారుపై సాధారణ మహిళల నుంచి ఉన్నత స్థాయిలో ఉన్న వర్గాల వరకు కూడా విమర్శలు చేశారు. బాబు చేసిన తప్పేంటని ప్రశ్నించారు.
ఇంతవరకు బాగానే ఉంది. అయితే.. చంద్రబాబు అరెస్టు విషయంలోనూ.. ఆయనను జైలుకు పంపించిన విషయంలోనూ కొందరు వ్యక్తులు, కొన్ని వర్గాలు రియాక్ట్ కాలేదు. ముఖ్యంగా నందమూరి కుటుంబానికి చెందిన అగ్రనటుడు జూనియర్ ఎన్టీఆర్... సహా సినీ పరిశ్రమలోని అగ్రనటులు కూడా రియాక్ట్ కాలేదు. అదేవిధంగా పారిశ్రామిక వర్గాల నుంచి కూడా ఎవరూ స్పందించ లేదు. ఇదే ఇప్పుడు టీడీపీ నేతలకు బాధగా మారింది. వారి ఉద్దేశం ప్రకారం.. 'టీడీపీ బాధ ప్రపంచం బాధ కావాలి'... చంద్రబాబును అరెస్టు చేసినా.. జైలు పంపించినా..అందరూ ఎదురు తిరగాలి.. ఆయనకు దన్నుగా మాట్లాడాలి!
కానీ, అలా జరగలేదు. నిజానికి నిర్మొహమాటంగా చెప్పాల్సి వస్తే.. చంద్రబాబు అరెస్టు, జైలు అయిన తర్వాత రెండు రోజులకు కానీ, సాధారణ ప్రజానీకం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. అంతెందుకు.. టీడీపీ నేతలు కూడా రెండు రోజుల వరకు దీనిపై పెద్దగా ఉద్యమించనూ లేదు. అయినప్పటికీ.. జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదని... పారిశ్రామిక వర్గాలురియాక్ట్ కాలేదని.. ఇండస్ట్రీ రియాక్ట్ కాలేదని.. టీడీపీ ఆవేదన చెందుతోంది. ఇది ఒకరకంగా.. 'అత్త కొట్టినందుకు కాదు.. ' అన్న సామెతను గుర్తు చేస్తోందని పరిశీలకులు అంటున్నారు.
నిజం చెప్పాలంటే.. టీడీపీని బహిరంగంగా సమర్థించనంత మాత్రానో..చంద్రబాబు అరెస్టును ఖండించనంత మాత్రానో.. లేక వైసీపీ సర్కారుపై నోరేసుకుని పడిపోనంత మాత్రానో.. వారంతా టీడీపీకి కానీ, ఏపీ రాష్ట్రానికికానీ.. వ్యతిరేకంగా ఉన్నట్టా? అనేది ప్రశ్న. ఎందుకంటే.. టీడీపీ నాయకులే చెబుతున్నట్టుగా.. ఇది అక్రమ కేసు. రాజకీయ కక్ష. ప్రతీకార రాజకీయం. వచ్చే ఎన్నికలకు సంబంధించిన కుట్ర అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరి ఇలాంటి అక్రమ కేసుల్లో.. రాజకీయ కక్షల్లో, కుట్ర రాజకీయాల్లో తెలిసి తెలిసి(టీడీపీ నేతలు చెబుతున్న ప్రకారం) ఎవరు మాత్రం జోక్యం చేసుకుంటారు? ఎందుకు చేసుకోవాలి? అనేది కామన్ కొశ్చన్.
అంతేకాదు.. చంద్రబాబు అరెస్టు పూర్తిగా రాజకీయ పరమైన అంశంమనే అనుకున్నా.. సాధారణంగా ఇలాంటి రాజకీయాల విషయంపై స్పందించేందుకు పారిశ్రామిక వేత్తలు కానీ.. సినీ ఇండస్ట్రీలో అగ్రతారలు కానీ ఉత్సాహం చూపించరు. ఎందుకంటే.. ఎవరి బిజినెస్ వారిది. వారికి రాజకీయాలతో పనిలేదు. ఏదైనా అవసరం వస్తే తప్ప. అంతేకానీ..ఇలాంటి అక్రమ అరెస్టుల విషయంలో వారు జోక్యం చేసుకోవాలని కోరుకోవడం.. జూనియర్ ఎన్టీఆర్ వంటివారు మాట్లాడలేదని టీడీపీ నేతలు వ్యాఖ్యానించడం సరికాదని అంటున్నారు పరిశీలకులు. సమయం వచ్చినప్పుడు అంటే.. ఎన్నికల సమయంలో ఇలాంటివారిని ఉపయోగించుకుని లబ్ధి పొందే యోచన చేస్తే బాగుంటుందని.. అప్పుడు వారి పవర్ పనిచేస్తుందని కూడా చెబుతున్నారు. సో.. ఇదీ సంగతి!!