రాయలసీమ రెడ్లు జగన్ ని ఎందుకు కలవడం లేదు ?

రాయలసీమలో బొమ్మ తిరగబడడం తోనే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ ఓటమి చవి చూడాల్సి వచ్చింది.

Update: 2024-06-10 12:45 GMT

జగన్ కి రాయలసీమలోనే భారీ మద్దతు ఉంది. అయితే అది తాజా ఎన్నికల్లో తేలిపోయింది. రాయలసీమ వైసీపీ పుట్టిన తరువాత కనీ వినీ ఎరుగని తీరులో ఓడించింది. రాయలసీమలో బొమ్మ తిరగబడడం తోనే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ ఓటమి చవి చూడాల్సి వచ్చింది.

అంతే కాదు కనీసం ప్రతిపక్ష స్థాననికి కూడా అవకాశం లేకుండా వైసీపీ ఘోరంగా ఓటమిని మూటకట్టుకుంది. ఇదిలా ఉంటే పార్టీ ఓడిన తరువాత జగన్ వరసబెట్టి సమీక్షలు నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో జగన్ ని అనేక జిల్లాల నుంచి నేతలు వచ్చి కలుస్తున్నారు. జగన్ కూడా వారితో మాట్లాడుతూ అందరికీ అపాయింట్మెంట్ ఇస్తున్నారు. ఇలా చూసుకుంటే ఉత్తరాంధ్రా నుంచి గోదావరి జిల్లాల నుంచి నాయకులు జగన్ ని వచ్చి కలుస్తున్నారు.

అదే సమయంలో వైసీపీకి నిన్నటిదాకా హార్డ్ కోర్ రీజియన్ గా ఉన్న రాయలసీమ నుంచి ఎవరూ వచ్చి కలవడం లేదు. రాయల సీమ రెడ్లు జగన్ ని ఎందుకు కలవడం లేదు అన్న చర్చ అయితే సీరియస్ గానే సాగుతోంది. రాయలసీమ నాలుగు జిల్లాతో పాటు ప్రకాశం నెల్లూరు జిల్లాలు కలుపుకుని గ్రేటర్ రాయలసీమ నుంచి నాయకులు ఎవరూ జగన్ ని కలిసేందుకు రావడం లేదు అని అంటున్నారు.

మొత్తం గ్రేటర్ రాయలసీమలో అనేక మంది రెడ్లు తాజా ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలు అయ్యారు. వీరంతా జగన్ వల్లనే తాము ఓడిపోయామని చాలా కోపంగా ఉన్నారు అని అంటున్నారు. దీంతో చాలా మంది జగన్ ని అసలు కలవడానికి ఇష్టపడడం లేదు అని అంటున్నారు.

నిజానికి వైసీపీకి రాయలసీమలో రెడ్లు అంతా బలంగా ఉంటూ వచ్చారు. 2019లో వైసీపీ గెలుపు వెనక వారు ఉన్నారు. తమ రక్తం ధారపోసి తమ ప్రాణం ఫణంగా పెట్టి వారు పార్టీని గెలిపించారు. అయితే జగన్ అయిదేళ్ల అధికారంలో మాత్రం వారికి ఏ విధంగానూ అనుకున్న స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వలేదని నాటి నుంచే గుర్రుగా ఉంటూ వచ్చారు. మంత్రి పదవుల విషయంలో కానీ ఇతరత్రా విషయంలో కానీ జగన్ రెడ్లను పక్కన పెట్టి సోషల్ ఇంజనీరింగ్ చేశారు. ఫలితంగా వారూ వీరూ అందరూ ఒక్కసారిగా పార్టీని వదిలేశారు. దాంతో వైసీపీ ఓటమి పాలు అయింది.

మరో వైపు చూస్తే జగన్ ఎవరి మాట వినకుండా సొంత నిర్ణయాలు తీసుకున్నారని దాని ఫలితమే ఈ ఓటమి అని కూడా రెడ్లు మండిపడుతున్నారు. టీడీపీ హయాంలోనే తాము ఎంతో కొంత బాగుపడ్డామని వైసీపీ వల్ల ఒరిగేది లేదని వారు అనుకుంటున్న నేపధ్యం ఉంది.

ఈ నేపధ్యంలో నుంచి చూసినపుడు రాయలసీమ రెడ్లు అయితే సమీక్షలకు రావడం లేదు. దాంతో రాయలసీమ వైసీపీలో ఏమి జరుగుతోంది అన్న చర్చకు తెర లేస్తోంది. రాయలసీమలో పాగా వేయడానికి ఒక వైపు బీజేపీ కాచుకుని కూర్చుంది.ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆ పార్టీకి సీమ నుంచి ఎమ్మెల్యేలు గెలిచారు.

దాంతో పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఆ పార్టీ చూస్తోంది అని అంటున్నారు. అక్కడ బలమైన సామాజిక వర్గంగా ఉన్న రెడ్లను ఆకట్టుకోవడానికి చూస్తోంది. ఈ పరిణామాల నేపధ్యంలో రెడ్లు చాలా ఏళ్ల తరువాత కొత్త ఆల్టర్నేషన్ వెతుక్కుంటున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది.

ఒంటెద్దు పోకడలతో జగన్ పార్టీని నడిపించారు అని కూడా చాలా మంది భావిస్తున్నారు. అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని జగన్ నాయకత్వాన్ని చూసిన వారు రాజకీయంగా కొనసాగాలంటే వేరే దారి చూసుకోవాల్సిందే అని అనుకుంటున్నారు అని ప్రచారం సాగుతోంది. అదే కనుక జరిగితే బలమైన రాయలసీమ నుంచి బలమైన సామాజిక వర్గం చేజారితే మాత్రం వైసీపీకి అసలైన కష్టాలు ఏర్పడడం తధ్యం. మరి జగన్ రెడ్లను ఎలా తన వైపునకు తిప్పుకుంటారో చూడాల్సిందే.

Tags:    

Similar News