దుష్ట చతుష్టయం... గట్టిగా ఇచ్చిపడేసిన జగన్!
అందరికీ మంచి చేయడం మాత్రమే తెలుసని, మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అనేది మాత్రమే చూడాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్.. గత ఏడాది కాలంగా చెబుతున్న మాటనే మరోసారి చెప్పుకొచ్చా రు. తనకు దత్తపుత్రుడి మద్దతు, ఎల్లో మీడియా సపోర్టు అవసరం లేదని చెప్పారు. దుష్ట చతుష్టయం.. అంటూ ఆయన తరచుగా చేస్తున్న విమర్శలు తెలిసిందే. ఈ సారి మరింత గట్టి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబుకు ఎల్లో మీడియా, దత్తపుత్రుడి అండ ఉందని చెప్పారు. తనకు ప్రజలే అండగా ఉన్నారని.. దేవుడి దయతో ప్రజల చల్లని దీవెనలతో ఉన్నానని అన్నారు.
తాజాగా పుట్టపర్తిలో వైఎస్సార్ రైతు భరోసా నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘చంద్రబాబు హయంలో స్కాంలు తప్ప స్కీమ్లు గుర్తుకు రావు. బాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం, ఫైబర్ గ్రిడ్ స్కాం, మద్యం, ఇసుక దందా ఇలా అన్నీ స్కామ్లే. చంద్రబాబు ఏది ముట్టుకున్నా స్కాంలే. చంద్రబాబుకు దోచుకోవడం, దాచుకోవడమే తెలుసు. ఏపీని దోచుకునేందుకు చంద్రబాబు పదవి కావాలి. చంద్రబాబు పాలనలో ప్రజలు, పేదలు, వృద్ధులు, విద్యార్థుల గురించి ఆలోచించలేదు. బాబు పాలనలో స్కీముల గురించి కాదు.. స్కాముల గురించి పాలన జరిగింది`` అని వ్యాఖ్యానించారు.
తనకు అబద్ధాలు చెప్పడం రాదని సీఎం జగన్ అన్నారు. అందరికీ మంచి చేయడం మాత్రమే తెలుసని, మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అనేది మాత్రమే చూడాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. మంచి జరిగి ఉంటే మీరే సైనికులుగా నిలబడాలని కోరారు.
``గెలవడానికి ఒక దత్తపుత్రుడి సాయం, ఎల్లో మీడియా సపోర్టు అవసరం లేదు. గెలవడానికి పైన దేవుడు, మీ అందరి ఆశీస్సులే. మీ బిడ్డ నమ్ముకుంది మిమ్మల్ని మాత్రమే. నాకు మద్దతు ఇవ్వాలని దత్తపుత్రుడిని మీ బిడ్డ కోరడు. నాకు సపోర్ట్ చేయాలని ఎల్లో మీడియాను కూడా మీ బిడ్డ ఏనాడూ కోరడు. మీ బిడ్డకు మీరు ఉన్నారు. మీ సపోర్టు ఉంది`` అని వ్యాఖ్యానించారు.
బంగారు ఇస్తామంటారు.. నమ్మొద్దని ప్రజలకు జగన్ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో మోసాలు, అబద్దాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. వాటిని నమ్మకండి. బంగారం, కార్లు ఇస్తామంటారు.. అవన్నీ అబద్దాలేనని చెప్పుకొచ్చారు.