జగన్ ర్యాగింగ్ కి బాబు భరించాల్సిందేనా ?
చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆయన మీడియా సమావేశం పెట్టి మరీ ఏకరువు పెడుతున్నారు.
ఏపీ సీఎం గా నాలుగవ సారి అధికారం చేపట్టిన చంద్రబాబుని హామీల విషయంలో వెంటనే అమలు చేయాలని విపక్ష నేత మాజీ సీఎం జగన్ గట్టిగానే ఒత్తిడి పెడుతున్నారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆయన మీడియా సమావేశం పెట్టి మరీ ఏకరువు పెడుతున్నారు.
ఎన్నికల ముందు హామీలు అన్నీ అమలు చేస్తాను అని బాబు చెప్పాడా లేదా అని జగన్ జనాలనే మీడియా ముఖంగా అడుగుతున్నారు. అంతే కాదు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు సంతోషమా అంటూ ప్రతీ ఇంటి గడపా తొక్కి మరీ బాబు హామీలను టీడీపీ నేతలు వల్లె వేశారని ఆయన చెప్పారు.
ఇక పిఠాపురం టూర్ లో హైలెట్ ఏంటి అంటే ఆయన అచ్చం చంద్రబాబు మాదిరిగా మాట్లాడుతూ ఆయన లాగానే హావభావాలను వ్యక్తం చేస్తూ ఇమిటేట్ చేసారు. హామీలు ఎక్కడ, ఎపుడు అమలు చేస్తారు చంద్రబాబు అని రెట్టించారు.
నాలుగు నెలలు అయింది అధికారంలోకి వచ్చి, హామీలను నెరవేర్చకుండా ఎందుకంత లేట్ అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో జగన్ కంటే ఎక్కువ ఇస్తాను అని ఇష్టం వచ్చినట్లుగా హామీలు ఇచ్చిన బాబుకు ఇపుడు అవి గుర్తున్నాయా అని ఆయన ఎకసెక్కమాడుతున్నారు.
ఏపీలో ప్రభుత్వం పాలన సంగతి పక్కన పెడితే జగన్ కి బాబు హామీలే అతి పెద్ద ఇష్యూగా మారుతున్నాయి. ఆయన వాటినే జనం ముందు పెట్టి బాబు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. దీంతో బాబు కానీ కూటమి నేతలకు కానీ జవాబు చెప్పుకోలోఅని పరిస్థితి ఉంది.
నేను కనుక మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే కనుక కచ్చితంగా హామీలను నెరవేర్చేవాడిని అని జగన్ చెప్పారు. ఈపాటికి అమ్మ ఒడి పడేది, అలాగే రైతు భరోసా ఇచ్చేవారిమని, రీ అంబర్స్ మెంట్ కూడా చేసేవాళ్లమని ఆయన చెప్పుకుంటున్నారు. అయిదేళ్ళ పాటు తుచ తప్పకుండా తాను అమలు చేశాను అని తన ట్రాక్ రికార్డుని కూడా జనం ముందు జగన్ పెడుతూ బాబుని నిలదీస్తున్నారు.
ఏపీ ఖజానా చూస్తే ఇబ్బందిపెడుతోంది. దైనందిన పాలన సాఫీగా సాగడమే కష్టంగా ఉంది. ప్రతీ నెలా ఒకటవ తారీఖుకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, అలాగే పెన్షనర్లకు పెన్షన్లు ఇవ్వాలి. ఇక సామాజిక పెన్షన్లు నెలకు నాలుగు వేలు వంతున ఇవ్వాలి. వీటికే. ఏకంగా 15 వేల రూపాయల పై దాటి ఖర్చు అవుతోంది అని అంటున్నారు. దాంతోనే బాబు వేరే కార్యక్రమాలను తీసుకోలేకపోతున్నారు అని అంటున్నారు.
హామీలు నెరవేర్చాలంటే ఆర్ధికంగా ఉన్న పరిస్థితులు ఏ మాత్రం అవకాశం ఇచ్చేలా లేవు అని అంటున్నారు. కనీసం ఒక ఏడాది తరువాత ఊపిరి కూడదీసుకుని కొన్ని అయినా చేయాలని బాబు ఆలోచిస్తున్నారు. కానీ ఇంతలో జగన్ మాత్రం అసలు ఊరుకోవడం లేదు. ఈ రోజుకే ఇచ్చి తీరాలని డిమాండ్ చేస్తున్నారు.
అయిదేళ్ల అధికారంలో ప్రతీ నెలా ఇచ్చినా హామీలు అమలు చేయాలి అనే ఆయన అంటున్నారు. వాయిదాలు వేసుకోవడం ద్వారా ప్రభుత్వం కొంత ఉపశమనం పొందేందుకు ప్రయత్నం చేస్తోంది కానీ అసలు ఆ చాన్స్ ఇవ్వడంలేదు. పైగా ప్రతీ ఇంట్లో ఎందరు పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం ఇస్తాను అని బాబు చెప్పారని తరచూ గుర్తు చేస్తున్నారు. అలాగే 18 ఏళ్ళు నిండిన ప్రతీ మహిళకూ నెలకు 1500 రూపాయలు అని చెప్పారని కూడా అంటున్నారు.
ఒకవేళ టీడీపీ కూటమి ఈ పధకాలు అమలు చేసినా చాలా సవరణలు ఉంటాయి. ఎన్నికల్లో చెప్పినట్లుగా ఎవరికీ ఇవ్వలేరు. అలా ఇవ్వకపోతే అది జగన్ కి వైసీపీకి ప్లస్ పాయింటే అవుతోంది. అందుకే కూటమి ప్రభుత్వం మీద బాబు మీద ఇప్పటి నుంచే ఆయన జనాలను ఎగదోస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి బాబుకు హామీలతో ఇరకాటంగా ఉంటే జగన్ కి చెలగాటంగా అది మారుతోంది అని అంటున్నారు.