తెలంగాణలో ఆ జంపింగ్ ఎమ్మెల్యేపై వేటు ఖాయం?
అయితే, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యల విషయంలో హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏం జరగనుంది? అనే ఆసక్తి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ వరదలతో అల్లాడుతుంటే.. పార్టీ ఫిరాయింపులపై తెలంగాణలో రాజకీయ రొద జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ టార్గెట్ చేసుకోవడం రచ్చ రేపుతోంది. మధ్యలో ‘ఆంధ్రా’ అంశం రావడంతో వివాదం చినికిచినికి గాలివానగా మారింది. కాగా.. బీఆర్ఎస్ నుంచి గెలిచిన 38 మంది ఎమ్మెల్యేల్లో ఒకరు మరణించారు. ఆ స్థానాన్ని (సికింద్రాబాద్ కంటోన్మెంట్) కాంగ్రెస్ ఉప ఎన్నికలో కైవసం చేసుకుంది. 10 మంది శాసన సభ్యులు కాంగ్రెస్ లోకి వెళ్లారు. అంటే సాంకేతికంగా బీఆర్ఎస్ కు మిగిలిన ఎమ్మెల్యేలు 27 మంది. అయితే, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యల విషయంలో హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏం జరగనుంది? అనే ఆసక్తి నెలకొంది.
మిగతా 9 మంది సేఫ్
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేల్లో 9 మంది పదవులకు ఎటువంటి ముప్పు లేకపోవచ్చనేది రాజకీయ నిపుణుల అభిప్రాయం. దీనికి వారు చూపే కారణాలు కూడా సహేతుకంగానే ఉన్నాయి. అయితే, ఒక్కరి విషయంలోనే మాత్రం అనర్హత వేటు తప్పదనే వాదన వినిపిస్తోంది. గతంలో మంత్రి పదవి నిర్వహించిన అనుభవం సొంతం. కానీ, నిను వీడను నీడను నేను అంటూ బ్యాడ్ లక్ ఎప్పుడూ వెంటాడుతూ ఉంటోంది.
పోటీకి దిగడంతోనే..
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారిన 10 మందిలో ఆయన ఒక్కరి పరిస్థితే ఎందుకిలా అయిందంటే.. ఆ ఎమ్మెల్యే సాంకేతికంగా దొరికిపోవడమే అనే కారణాన్ని చూపుతున్నారు. పార్టీ మారిన ఆయన.. ఆ పార్టీ గుర్తుపై ఎన్నికల్లో పోటీకి దిగడమే కొంప ముంచిందని చెబుతున్నారు. వాస్తవానికి ఆయన ఎన్నికల్లో పోటీకి దిగింది మంత్రి పదవిని ఆశించే. ఓడినా, గెలిచినా మంత్రివర్గంలో స్థానం ఇస్తామనే హామీతోనే కాంగ్రెస్ లోకి వెళ్లారని చెబుతున్నారు. ఇక సగం పోటీకి వచ్చేసరికి ఓడిపోతేనే మంత్రి పదవి దక్కుతుందనే ఆలోచనకు వచ్చారని సమాచారం.చివరకు ఆయనను ఓటమే పలకరించింది.
ఇప్పుడు అనర్హత అయితే..
పొరపాటున ఇప్పుడు అనర్హత వేటుకు గురైతే ఆ ఎమ్మెల్యే పరిస్థితి భలే చిత్రంగా ఉంటుంది. గతంలోనూ వేరే పార్టీ నుంచి గెలిచి రాజీనామా చేసి అధికార పార్టీలో చేరారు. రాజీనామాతో ఉప ఎన్నికకు వెళ్లి ఓడిపోయారు. మరోసారి గెలిచిన మంత్రి అయినప్పటికీ ఆయన అభిమాన నాయకుడు అనూహ్యంగా మరణించడంతో అంతా తలకిందులైంది. 2014 తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో ఆ ఎమ్మెల్యే అధికార పార్టీని ఆశ్రయించారు. మళ్లీ గత ఏడాది ఆ పార్టీ పరాజయంతో గెలిచిన పార్టీలోకి జంప్ అయ్యారు. కానీ, సాంకేతికంగా దొరికిపోవడంతో చిక్కుల్లో పడున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.