కొత్త ఆశ: పెట్రోల్.. డీజిల్ ధరలు తగ్గనున్నాయా?

తాజాగా జమ్ముకశ్మీర్.. హర్యానా.. మహారాష్ట్ర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మరోసారి పెట్రోల్ ధరలు తగ్గే వీలుందని చెబుతున్నారు.

Update: 2024-09-07 13:30 GMT

అంతకంతకూ పెరగటమే కానీ తగ్గని వస్తువుల ధరల్లో పెట్రోల్.. డీజిల్ ఉండనే ఉంది. పదేళ్ల వ్యవధిలో దేశంలో పెట్రోల్.. డీజిల్ ధరలు ఎంతలా పెరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే.. తాజాగా ఒక తీపికబురు వినిపిస్తోంది. కొన్ని సంస్థల అంచనా ప్రకారం.. రానున్న రోజుల్లో పెట్రోల్.. డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టనున్నట్లుగా చెబుతున్నారు. అదెలా? దానికి ఉన్న లాజిక్ ఏమిటి? అన్న విషయంలోకి వెళితే..

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఈ ఏడాది కనిష్ఠ స్థాయికి చేరనున్నాయి. ఈ మధ్యన ముగిసిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో లీటరు పెట్రోల్.. డీజిల్ కు రెండేసి రూపాయిల చొప్పున తగ్గించిన సంగతి తెలిసిందే. తాజాగా జమ్ముకశ్మీర్.. హర్యానా.. మహారాష్ట్ర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మరోసారి పెట్రోల్ ధరలు తగ్గే వీలుందని చెబుతున్నారు.

పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్).. ఒపెక్ యేతర ఉత్పత్తిదారుల నుంచి చమురు ఉత్పత్తి ఈ మధ్యన పెరిగింది. దీంతో అమెరికాలో చమురు బ్యారెల్ ధర 70 డాలర్ల కంటే తక్కువకు చేరింది. బ్రెంట్ చమురు ధర కూడా 72.75 డాలర్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా తగ్గిన చమురు ధరలు.. రిటైల్ ధరల మీద ప్రభావాన్ని చూపుతాయని.. ధరలు తగ్గే వీలుందని చెబుతన్నారు.

ఈ అంచనాకు తగ్గట్లే.. శుక్రవారం పెట్రోలియం సంస్థల షేర్లు నష్టపోయిన పరిస్థితి. 2022 జులైలో బ్యారెల్ ముడి చమురు ధర 111.9 డాలర్లు ఉంటే 2023 జులై నాటికి 80.11 డాలర్లకు చేరింది. ఈ ఏడాది ఏప్రిల్ లో 89.9 డాలర్లకు చేరుకోగా.. ఆ తర్వాత నుంచి తగ్గుతూ వచ్చి ఈ సెప్టెంబరు 6 నాటికి 71 డాలర్లకు చేరుకోవటంతో.. ఈసారి ధరలు మరోసారి తగ్గే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. మోడీ సర్కారు ప్రజలకు పెట్రోల్.. డీజిల్ ధరల తగ్గింపుపై స్వీట్ న్యూస్ చెబుతుందో? లేదో? చూడాలి.

Tags:    

Similar News