లడ్డూ ప్రసాదం ఇష్యూ... టీడీపీ క్లోజ్ చేస్తుందా ?

ఇది రాజకీయంగా ఆరోపణగా ఉంటుందని బహుశా టీడీపీ భావించవచ్చు కానీ ప్రపంచదేవుడు అయిన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదం అన్నది అతి సున్నితమైన ఇష్యూ.

Update: 2024-09-26 14:30 GMT

శ్రీవారి మహా ప్రసాదం లడ్డూ లో కల్తీ జరిగింది అని బాంబు లాంటి వార్తను ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు పేల్చారు. ఆయన యధాలాపంగా అన్నా కూడా ఇది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. క్షణాలలో దేశం దాటి ప్రపంచానికి తాకింది. కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బ తిన్నాయి. ఇది రాజకీయంగా ఆరోపణగా ఉంటుందని బహుశా టీడీపీ భావించవచ్చు కానీ ప్రపంచదేవుడు అయిన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదం అన్నది అతి సున్నితమైన ఇష్యూ. పైగా సెంటిమెంట్ తో కూడుకున్నది.

దాంతో కోట్లాదిమంది భక్తులు ఈ మొత్తం వ్యవహారం మీద కలవరపడ్డారు, వారంతా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దాంతో ఇష్యూ మొత్తం వేరే కోణంలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ రాజకీయం దాటి మరీ ఇది సెన్సిటివ్ ఇష్యూగా పరిణామం చెందింది. దాంతో పాటు దీని మీద భిన్నాభిప్రాయాలు కూడ ఏర్పడ్డాయి. లడ్డూ ప్రసాదం కల్తీ అయితే విచారణ జరిపించి నిగ్గు తేల్చాలి కానీ ఇలా బాహాటంగా ఆరోపణలు చేసి కోట్ల మంది అమాయక భక్తుల మనోభావాలను దెబ్బ తీయాలా అన్న చర్చ కూడా సాగింది.

ప్రధానంగా విశ్వహిందూ పరిషత్ వంటి ధార్మిక సంస్థలు ఈ విషయంలో టీడీపీని సైతం తప్పు పట్టాయి. ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీని రాజకీయంగా బదనాం చేయాలని టీడీపీ ఆలోచన అయి ఉండొచ్చు కానీ అది అటు తిరిగి ఇటు తిరిగి టీడీపీ మెడకు కూడా చుట్టుకునేలా ఉంది. ఎందుకంటే వైసీపీ ఈ విషయంలో సీబీఐ విచారణ కోరుతోంది. అలాగే న్యాయ విచారణ కోరుతోంది.

లడ్డూ ఇష్యూలో బాధ్యుల మీద చర్యలు ఉండాలని కోరుతున్న వామపక్షాలు కాంగ్రెస్ వంటి సంస్థలు కూడా దీనిని సీబీఐకే అప్పగించమని కోరుతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రం సిట్ తో సరి అంటోంది. సిట్ అంటే అందులో పనిచేసే అధికారులు అంతా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటారు. ఒక ముఖ్యమంత్రి బాహాటంగా లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అని పదే పదే స్టేట్మెంట్స్ ఇచ్చిన తరువాత దానిని భిన్నంగా వారు నివేదిక ఇవ్వగలరా అన్న చర్చ వస్తోంది.

మరో వైపు కోట్లాది మంది హిందూ భక్తులు సైతం దీనిని సీబీఐకి లేదా న్యాయ విచారణకు ఇవ్వాలని కోరుతున్నారు. ఇక్కడే టీడీపీ కూటమి తగ్గినట్లు అయింది అని అంటున్నారు. సిట్ విచారణతో సరి అంటే నిజాలు వెలుగు చూస్తాయా ఎప్పటికీ అనుమానాలు అలాగే ఉండిపోతాయా అన్న డౌట్లు చాలా మందిలో ఉన్నాయి. మరో వైపు చూస్తే ఈ ఇష్యూలో ఇంకా సాగదీసేందుకు ఏమీ లేదని కూడా అధికార పక్షం భావిస్తోంది.

సిట్ ని ఇప్పటికే నియమించిన ప్రభుత్వం వీలైనంత తొందరగా నివేదికను తెప్పించుకుని దానిని జనం ముందు పెట్టి అక్కడితో ఇష్యూ క్లోజ్ చేయాలని చూస్తోంది. అందుకే గత కొద్ది రోజులుగా టీడీపీ నుంచి లడ్డూ ప్రసాదం మీద ప్రకటనలు ఏవీ ఉండడంలేదు.

అయితే సరిగ్గా టీడీపీ కూటమి సిట్ విచారణ వద్దనే ఆగుతున్న పాయింట్ ని పట్టుకుని వైసీపీ రివర్స్ గేర్ పాలిటిక్స్ స్టార్ట్ చేసింది. జగన్ తిరుమల శ్రీవారిని కాలి నడకన దర్శించుకోవాలనుకోవడం వైసీపీ శ్రేణులు అంతా ఈ నెల 28న ప్రత్యేక పూజలు చేయాలనుకోవడం అందులో భాగమే. అంటే వైసీపీ ఈ ఇష్యూని ముగించకూడదు అని అనుకుంటోంది.

ఆ పార్టీకి అది అవసరం కూడా. నింద వైసీపీ మీదకు తోసేసారని బాధ్యులు ఎవరో తేలాలి అంటే సీబీఐ విచారణ అవసరం అని ఆ పార్టీ అంటోంది. ఈ విషయంలో సీబీఐ విచారణను డిమాండ్ చేస్తున్నా సుప్రీం కోర్టు మీద కూడా వైసీపీ ఆశలు ఉన్నాయి. కోర్టు అయితే న్యాయపరంగా ఈ ఇష్యూలో ఏమైనా డైరెక్షన్స్ ఇస్తుందని వైసీపీ ఆశతో ఉంది.

అందుకే ఈ ఇష్యూ విషయంలో ఏ మాత్రం వదలకూడదని ఆ పార్టీ చూస్తోంది. వైసీపీ మీద పడిన ఈ మచ్చను తొలగించుకోవాలని చూస్తోంది. టీడీపీ కూటమి అయితే వ్యూహాత్మకంగా ఎంతవరకూ వివాదాన్ని లాగాలో అంతవరకూ లాగి ప్రస్తుతం ఒక సైలెన్స్ మెయింటెయిన్ చేస్తోంది. మరి జగన్ తిరుమల శ్రీవారి దర్శనం తరువాత టీడీపీ కూడా తన రియాక్షన్ మొదలుపెట్టే అనివార్య పరిస్థితి రావచ్చు. ఏది ఏమైనా అతి సున్నితమైన అంశంలో ఎవరి చేతులు కాలుతాయో అన్నది మాత్రం చర్చగానే ఉంది ఇప్పటికి.

Tags:    

Similar News