మోడీ బాగానే ఉన్నారు.. ఎటొచ్చీ బాబుకే చిక్కులు!
ఆయన మూడోసారి ముచ్చటగా ఢిల్లీ పీఠం ఎక్కాలన్న కోరికను ఇప్పటికైతే సాకారం చేసుకున్నారు.
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీకి కీలకమైన నాయకులు బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్, ఏపీ కాబోయే సీఎం చంద్రబాబు. వీరు లేక పోతే.. కేంద్రంలోమోడీ అధికారంలోకిరావడం కలలో మాట. ముం దుగానే వీరితో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లారు. ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. దీంతో వారిద్దరు కూడా.. మోడీకి జై కొట్టారు. పీఠాన్ని ఎక్కించారు. కాపు కాస్తున్నారు ఇంత వరకు బాగానే ఉంది. ఈ విషయంలో మోడీ సక్సెస్ అయ్యారు.
ఆయన మూడోసారి ముచ్చటగా ఢిల్లీ పీఠం ఎక్కాలన్న కోరికను ఇప్పటికైతే సాకారం చేసుకున్నారు. కానీ, ఏపీ నుంచి మోడీకి మద్దతు పలికిన చంద్రబాబుకు ఇప్పుడు చిక్కులు వస్తున్నాయి. ఏ షరతులు లేకుండానే కేంద్రంలోని మోడీకి మద్దతు ఇవ్వడం ఏంటి? అనేది ప్రధాన ప్రశ్న. మేధావులు ఇప్పుడిప్పుడే దీనిపై నోరు విప్పుతున్నారు. ఇది నిజమే.. చంద్రబాబుచెప్పినా.. ఆ పార్టీ కీలక నాయకుడు కనక మేడల రవీంద్ర కుమార్ చెప్పినా.. తాము మోడీ ముందు ఎలాంటి షరతులు పెట్టలేదనే.
ఇదే ఇప్పుడు చంద్రబాబుకు ఇబ్బందిగా మారనుందనే వాదన వినిపిస్తోంది. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సినవి చాలానే ఉన్నాయి. పోలవరం నిధుల నుంచి అమరావతి సొమ్ముల వరకు.. ముఖ్యంగా ప్రత్యేక హోదా దాకా కూడా.. ఏపీకి కేంద్రం నుంచి రావాల్సి ఉంది. వీటిని అడుగుతారని చంద్రబాబుపై ఆశలు ఉన్నాయి. అయితే.. వాటిని ఆయన ప్రస్తావించకుండానే మోడీకి మద్దతు ప్రకటించడంతో వీటి పరిస్థితి ఏంటనేది ఇప్పుడు సమస్యగా మారింది.
అయితే.. ఇక్కడ రెండు చిక్కులు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒకటి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే.. ఇదే కూటమిలో ఉన్న బిహార్ కూడా.. ఆవురావురు మంటూ.. తమకు ముందు ప్రకటించాలని.. తామే ముందు బాధితుల జాబితాలో ఉన్నామని చెబుతోంది. ఏపీకి ఇస్తే.. బిహార్‌కు ఇవ్వాలి. ఈ రెండు రాష్ట్రాలకు ఇస్తే.. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌కు దెబ్బ పడిపోతుంది. దీంతో ఈ విషయాన్ని ముందుగానే లేవనెత్తద్దని బీజేపీ పెద్దల నుంచి బాబుకు సూచనలు వచ్చినట్టు తెలుస్తోంది.
ఇక, రెండో కీలక విషయం.. పోలవరం. దీనిని వడివడిగా పూర్తి చేయడం కూడా ఇప్పుడు ఇబ్బందిగానే మారింది. ఆది నుంచి కూడా.. ఒడిశా ప్రభుత్వం పోలవరంపై కన్నెర్ర చేస్తోంది. సుప్రీంకోర్టులో కేసులు కూడా ఉన్నాయి. గతంలో తెలంగాణ కూడా కేసులు వేసినా.. అది వెనక్కి తీసుకునే అవకాశం ఉంది కానీ.. ఒడిశాలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతున్న దరిమిలా.. అక్కడి గత ప్రభుత్వం వేసిన కేసులు వెనక్కి తీసుకుంటే.. బీజేపీకి పెద్ద మైనస్ అవుతుంది. దీంతో పోలవరం విషయంలోనూ కేంద్రం చిక్కులు పెట్టే సూచనలు ఉన్నాయి. దీంతో ఈ రెండు సమస్యలు కూడా బాబుకు ఇబ్బందిగానే ఉంటాయని అంటున్నారు పరిశీలకులు.