జగన్‌ను పట్టించుకోవద్దు: చంద్రబాబు
ఎవరెవరు ధర్నాలో పాల్గొనాలి... ఎక్కడ ధర్నా చేయాలనే విషయాలపై మ్యాప్ రెడీ చేస్తున్నారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. ఈ నెల 24న ఢిల్లీలో ధర్నా చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి పార్టీ నాయకులకు ఆయన ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. పార్టీ పరంగా అనుమతులు.. ప్లేస్ డిసైడ్ చేసే బాధ్యతలను ఎంపీ మిధున్ రెడ్డికి అప్పగించారు. సుమారు 100 మందితో ఢిల్లీలో ధర్నా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి. ఎవరెవరు ధర్నాలో పాల్గొనాలి... ఎక్కడ ధర్నా చేయాలనే విషయాలపై మ్యాప్ రెడీ చేస్తున్నారు.
రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత.. శాంతి భద్రతలు అడుగంటాయని.. రాష్ట్రపతి పాలన విధించే అవసరం ఏర్పడిందని.. ఈ విషయాలను ఢిల్లీ వేదికగా తాము కేంద్రానికి వివరిస్తామని.. జగన్ చెప్పిన నేపథ్యంలో ఈ మేరకు వైసీపీ నాయకులు కూడా రెడీ అవుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు చర్చించారు. శనివారం ఆయన పార్టీ ఎంపీలు.. కేంద్ర మంత్రులతో చర్చించారు. వచ్చే పార్లమెంటు బడ్జట్ సమావేశాల్లో ఏపీకి సంబంధించిన ఏయే అంశాలను ప్రస్తావించాలో దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జగన్ ధర్నా వ్యవహారంపై చంద్రబాబు స్పందిస్తూ.. ఆయనను పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. జగన్ గురించి ఎక్కడా ఎవరూ మాట్లాడొద్దని చంద్రబాబు చెప్పారు. ధర్నాలో కనుక మితిమీరి వ్యాఖ్యాలు చేస్తే..అ ప్పటికప్పుడే ఖండించాలని.. రాష్ట్రంలో వైసీపీ హయాంలో చేసిన కుట్రలు, హత్యలు.. వంటివాటిని టీడీపీ ఎంపీలు ప్రదర్శించాలని.. అయితే.. ముందుగానే ఎవరూ తొందరపడాల్సి న అవసరం లేదన్నారు. అసలు జగన్ ఢిల్లీ ధర్నాపై ఎవరూ ఆలోచన చేయొద్దన్నారు.
ఇక, పార్లమెంటులో వైసీపీ నాయకులు కనుక.. ఏపీ పరిస్థితులు, హత్యలపై చర్చకు పట్టుబడితే మాత్రం ఖచ్చితంగా తిప్పికొట్టేలా.. వ్యవహరించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ విషయంలో వెనక్కి తగ్గొద్దని సూచించారు. పార్లమెంటులోనే సమాధానం చెప్పాలన్నారు. వైసీపీ ఎంపీలకు దీటుగా వ్యాఖ్యానించాలన్నారు. సబ్జెక్టు తెలియకపోతే.. తెలుసుకుని మాట్లాడాలని ఒకరిద్దరికి సూచించారు. ముఖ్యంగా కేంద్ర మంత్రులు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని తెలిపారు