సం''పన్ను''.. భారత్ లో సంచలనం.. అమలు మాత్రం ఆ దేశంలో..

మొత్తం యూరప్ లోనే బాగా డెవలప్డ్ దేశంగా భావించే ఫ్రాన్స్‌ లో జాతీయ అసెంబ్లీ (పార్లమెంటు)కి ఎన్నికలు ఆసక్తి రేపాయి.

Update: 2024-07-10 16:30 GMT

భారత్ లో ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా సైన్స్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు గుర్తున్నాయా...? ‘‘సంపద పన్ను’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ను పూర్తిగా డిఫెన్స్ లో పడేశాయి. అంతేకాదు.. పిట్రోడాను ఆ పార్టీ బాధ్యతల నుంచి తప్పించింది. చివరకు మళ్లీ చేర్చుకోవడం వేరే విషయం. అయితే, సంపద పన్ను వంటి ఆలోచనలు ఏమీ లేవని కాంగ్రెస్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కాగా, పిట్రోడా.. అమెరికాలో అమల్లో ఉన్న వారసత్వ పన్ను భావనను వివరిస్తూ.. "అమెరికాలో వారసత్వపు పన్ను ఉంది. ఒక వ్యక్తి $100 మిలియన్ల విలువైన సంపదను కలిగి ఉంటే అతడు లేదా ఆమె మరణించినప్పుడు మాత్రమే బదిలీ చేయగలరు. 45% తన పిల్లలకు పోగా 55% ప్రభుత్వం లాక్కుంటుంది. మీ తరంలో మీరు సంపాదించి వెళ్లిపోతున్నారు, మీ సంపదను ప్రజల కోసం వదిలివేయాలి, అందులో సగం. ఇది నాకు న్యాయంగా అనిపిస్తుంది" అని పేర్కొన్నారు. కాగా.. భారత్ లో ఇలాంటిదేమీ లేకున్నా. మరొక దేశంలో మాత్రం అమల్లోకి వస్తోంది.

మొత్తం యూరప్ లోనే బాగా డెవలప్డ్ దేశంగా భావించే ఫ్రాన్స్‌ లో జాతీయ అసెంబ్లీ (పార్లమెంటు)కి ఎన్నికలు ఆసక్తి రేపాయి. ప్రస్తుత అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే దీనికి కారణం. ఇప్పుడు అక్కడ లెఫ్ట్ వింగ్ కు చెందిన న్యూ పాపులర్ ఫ్రంట్ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం అవుతోంది. దీంతో ఆ దేశంలో ఎలాంటి విధానాలు అమలవుతాయా? అనే చర్చ నెలకొంది. మరోవైపు పార్లమెంటును ఆకస్మికంగా రద్దు చేస్తూ మెక్రాన్‌ తీసుకున్న నిర్ణయం ఆయనకే తిప్పికొట్టినట్లయింది. 577 స్థానాలున్న శక్తిమంతమైన దిగువ సభపై పట్టు సాధించే ఆయన వ్యూహం బెడిసికొట్టింది. సోమవారం వెలువడ్డ ఫలితాల్లో ఏ కూటమికీ మెజారిటీ రాలేదు.

వామపక్షం సారథ్యం

ఫ్రాన్స్ లో వామపక్షానికి చెందిన న్యూ పాపులర్ ఫ్రంట్ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధపడుతోంది. స్వతహాగానే వామపక్షాలు అధికారంలో ఉంటే ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తాయి. ఇక ప్రాన్స్ లో న్యూ పాపులర్ ఫ్రంట్ కూటమి రానుండడంతో రూ.3.60 కోట్ల (4 లక్షల యూరోలు) కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారిపై 90 శాతం పన్ను విధిస్తామని కూటమి ఎన్నికల ముంగిట హామీ ఇచ్చింది. ఇదిప్పుడు అమలు చేస్తారా? అన్న ప్రశ్న వస్తోంది. మరోవైపు రిటైర్మెంట్ వయసును 60 ఏళ్లకు పరిమిత చేయడం.. ఇంధన ధరల నియంత్రణ, కనీస వేతనాల పెంపు తదితర అంశాలను కూడా తన హామీల్లో ప్రస్తావించింది. దీంతో భారత్ లో సంచలనం రేపిన సంపద పన్ను ఫ్రాన్స్ లో అమలు కానుందా? అనే అభిప్రాయం వినిపిస్తోంది.

Tags:    

Similar News