కేటీఆర్ నువ్వు మీ చెల్లికి ఆస్థి ఇవ్వకపోతే ఆమె కూడా ఎదురు తిరుగుతుంది!

ఈ పరిస్థితిలో బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ ఏపీలో వైసీపీ ఓటమిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-07-09 12:15 GMT

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన వ్యవహారంపై ఇప్పటికీ రకరకాల చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి తమ ఓటమికి గల కారణాలను ఓపెన్ గానే చెబుతున్నారు.. తప్పులను ఒప్పుకుంటున్నారు. ఈ పరిస్థితిలో బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ ఏపీలో వైసీపీ ఓటమిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... ఏపీలో తమ పార్టీ ఘోర పరాజయం పాలవ్వడానికి పలు స్పష్టమైన కారణాలున్నాయని, వాటిని మేము మార్చుకోలేకపోయామని వైసీపీ నేతలు ఓపెన్ అయిపోతున్న తరుణంలో... బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఆసక్తికరంగా స్పందించారు. ఇందులో భాగంగా... ఏపీలో వైసీపీ ఓటమి తనకు ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు. పేదలకు పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చినా జగన్ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు.

ఈ స్థాయిలో ఘోర పరాజయం పాలైనప్పటికీ 40 శాతం ఓట్లు సాధించడం మామూలు విషయం కాదని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఎన్డీయే కూటమితో కాకుండా పవన్ విడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు మరో విధంగా ఉండేవని అభిప్రాయపడ్డారు. తాజాగా ఢిల్లీలో నిర్వహించిన మీడియా చిట్ చాట్ లో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ప్రతీ రోజూ జనంలోకి వెళ్లే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఓడిపోవడం కూడా తనకు ఆశ్చర్యమేనని కేటీఆర్ తెలిపారు.

ఇక తెలంగాణ విషయానికొస్తే... ఇక్కడ తమకు అహంకారం ఉందని కృత్రిమంగా సృష్టించారని.. ప్రజలతో తమకు గ్యాప్ ఉన్న మాట వాస్తవమేనని.. చేసిన అభివృద్ధిని జనాలకు చెప్పుకోలేకపోయామని అన్నారు. ఇదే సమయంలో టీఆరెస్స్ ను బీఆరెస్స్ గా మార్చడం వల్ల ఓడిపోయామనడానికి ఆధారం లేదని తెలిపారు. ఇదే సమయంలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిళ విషయంలోనూ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... ఏపీలో జగన్ ను ఓడించేందుకు షర్మిళను పావుగా వాడుకున్నారని, అంతకు మించి ఏమీ లేదని కేటీఆర్ తెలిపారు. దీంతో గతంలో వైఎస్సార్టీపీ పార్టీని స్థాపించినప్పుడు షర్మిళ... బీఆరెస్స్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడి, సమస్యలపై పోరాడిన విషయాన్ని ఆయన ఇంకా మరిచిపోయినట్లు లేరనే కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి!

అయితే ఏపీలో షర్మిళ.. జగన్ కు వ్యతిరేకంగా పోటీ చేయడాన్ని, పోరాడటాన్ని ప్రత్యర్థులు పావుగా వాడుకోవడంగా కేటీఆర్ విశ్లేషించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. వైఎస్ జగన్ తన తండ్రి మరణానంతరం తన చెల్లెలు షర్మిళకు ఆస్తిని పంచలేదనే చర్చ బలంగా వినిపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో స్పందించిన షర్మిళ... పంచలేదని అంగీకరిస్తూనే, ఎక్కడికీ పోదంటూ ధీమాగా సమాధానం చెప్పారు!

ఒకవేళ ఆమె తన అన్నతో విభేదించడానికి ఆ ఒక్క అంశమే కారణమైనా.. అందులో తప్పు పట్టడానికీ ఏమీ లేదు కదా అనేది సోషల్ మీడియా జనాల ప్రశ్న. రేపటి రోజున కేటీఆర్ కూడా ఆస్తుల విషయంలో సోదరికి హ్యాండ్ ఇస్తే ఇలాంటి పరిణామాలు వారి కుటుంబంలో సైతం జరగకపోవు అనడానికి గ్యారెంటీ ఏమిటనే అనే చర్చా సోషల్ మీడియా వేదికగా మొదలైంది.

తండ్రి మరణానంతరం తోడుగా ఉండాల్సిన అన్న హ్యాండ్ ఇచ్చినా కూడా చెల్లెలు మౌనంగా ఉండాలని, అన్నకే సహకరించాలని  కేటీఆర్ భావిస్తున్నారా అనేది షర్మిల అభిమానులు, సోషల్ మీడియా జనాలు సంధిస్తున్న ప్రశ్నలని అంటున్నారు. ఏది ఏమైనా... ఏపీ ఎన్నికల్లో షర్మిళ పాత్రపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆమె అభిమానులు, నెటిజన్లు కాస్త ఘాటుగానే రియాక్ట్ అవుతున్నట్లున్నారు!

Tags:    

Similar News