రాయలసీమలో రాజకీయం మారుతుందా...!?

రెండు పర్యాయాలు వైసీపీ కొమ్ము కాసిన రాయలసీమ నాలుగు జిల్లాలలో ఈసారి రాజకీయం మారుతుందా అంటే జవాబు అవును అనే వస్తోంది.

Update: 2024-02-12 03:57 GMT

రెండు పర్యాయాలు వైసీపీ కొమ్ము కాసిన రాయలసీమ నాలుగు జిల్లాలలో ఈసారి రాజకీయం మారుతుందా అంటే జవాబు అవును అనే వస్తోంది. రాయలసీమలో కడపలో పది ఎమ్మెల్యే సీట్లు ఉంటే చితూరులో కర్నూల్, అనంతపురం జిల్లాలలో తలో పద్నాలుగు సీట్లూ ఉన్నాయి.

ఈ నాలుగూ కలుపుకుంటే మొత్తం 52 సీట్లు అవుతాయి. 2019లో ఇక్కడ వైసీపీ బంపర్ విక్టరీని సాధించింది. మొత్తం 52 సీట్లలో టీడీపీకి కేవలం మూడు సీట్లను మాత్రమే విడిచిపెట్టి 49 సీట్లను తన ఖాతాలో వేసుకుంది.

దీనికంటే ముందు 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా వైసీపీ మెజారిటీ సీట్లు సాధించింది. అయితే 2024లో మాత్రం ఇంత వన్ సైడెడ్ గా విక్టరీ వైసీపీకి ఉండదని అంటున్నారు. ఎందుకంటే ఈసారి వైసీపీ అధికారంలో ఉండడమే ప్రధాన కారణం. జగన్ ప్రభుత్వం వస్తే చాలా తమకు మేలు జరుగుతుందని అనుకున్నా ఆశించిన మేర జరగలేదు అన్న అసంతృప్తి ఒకటి ఉంది.

అలాగే రాజధాని అమరావతిని మార్చి విశాఖను పరిపాలనా రాజధాని అని బిల్లు పెట్టి చట్టం చేశారు. ఆ తరువాత దాన్ని రద్దు చేసుకున్నా రాయలసీమ వాసులకు మాత్రం రాజధాని హోదా మాకు లేదా అన్న ఆవేదన అయితే ఏర్పడింది అంటున్నారు. న్యాయ రాజధాని అని చెప్పినా కర్నూల్ కి హై కోర్టు దేముడెరుగు హై కోర్టు బెంచ్ కూడా రాలేదు.

పారిశ్రామికంగా కూడా వైసీపీ ఈ ప్రాంతానికి చేసింది ఏమీ లేదన్న వేదన ఉంది. కడప స్టీల్ ప్లాంట్ కి మూడు సార్లు శంకుస్థాపన చేయడం మినహా అక్కడ ఏమీ ముందుకు సాగలేదు అని అంటున్నారు. అలాగే నీటి ప్రాజెక్టుల విషయంలో కూడా ఏమీ జరగలేదు అని అంటున్నారు. ఉద్యోగ కల్పన లేదని యువతలో కూడా అసంతృప్తి ఉంది.

ఇవన్నీ ఇలా ఉంటే వైఎస్సార్ ఇమేజ్ తో వైసీపీ గత రెండు ఎన్నికల్లో గట్టిగా నిలబడింది. 2019 మార్చి 15న వివేకానందరెడ్డి హత్య తరువాత వైఎస్సార్ కుటుంబంలో వచ్చిన చీలికలు ఆ మీదట కడప ఎంపీ అవినాష్ రెడ్డి మీద ఏకంగా వివేకా కుమార్తె సునీత చేసిన తీవ్ర ఆరోపణలు సీబీఐ ని ఆ దిశగా విచారణ చేయమని కోరిన నేపధ్యంతో వైసీపీ ప్రాభవం కొంత మసకబారింది అని అంటున్నారు.

టీడీపీ సహా ఇతర ప్రతిపక్షాలు సొంత బాబాయినే హత్య చేయించిన వారికి ప్రభుత్వం కొమ్ము కాస్తోందని విమర్శలు చేయడం తో పాటు స్థానికంగా కూడా వివేకా హత్య పెద్ద చర్చకు దారి తీయడం వంటివి వైసీపీకి ఇబ్బందిని పెట్టీ అ పరిణామాలు అని అంటున్నారు. గత ఏడాది మార్చిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు సీట్లకు రెండూ ఈ ప్రాంతంలో టీడీపీ పరం కావడం కొంత గాలి మార్పుని సూచిస్తోందని కూడా అంటున్నారు

ఇక కడపలో కూడా ఈసారి వైసీపీ క్లీన్ స్వీప్ చేసే చాన్స్ లేదనే అంటున్నారు. పదికి మూడు సీట్లలో టీడీపీ గెలుచుకుంటుందని అంటున్నారు. కర్నూల్ లో కూడా పద్నాలుగు సీట్లలో అయిదారు సీట్లలో టీడీపీ బలంగా ఉందని అనంతపురం జిల్లాలో నువ్వా నేనా అన్న పోటీ ఉందని అంటున్నారు. చిత్తూరు జిల్లాలో చూస్తే ఈసారి నాలుగైదు సీట్లు టీడీపీ కూటమి గెలుచుకోవచ్చు అంటున్నారు. అంటే మొత్తం నాలుగు జిల్లాల్లో టీడీపీ ఇరవై సీట్ల దాకా గెలుచుకుంటే కనుక ఏపీలో రాజకీయాలు మారడం తధ్యం అని అంటున్నారు. మరి దీని మీద వైసీపీ ఏ విధంగా ప్రతి వ్యూహం రూపొందిస్తుందో చూడాల్సి ఉంది.


Tags:    

Similar News