వెయింటింగ్ మినిస్టర్ ట్యాగ్ లైన్ తో !

బీజేపీ పెద్ద నాయకులతో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి.

Update: 2024-06-11 03:15 GMT

ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి నుంచి మూడున్నర లక్షల ఓట్ల తేడాతో ఎంపీగా గెలిచి భారీ విజయాన్ని నమోదు చేసిన సీఎం రమేష్ మంత్రి పదవి మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. బీజేపీ పెద్ద నాయకులతో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబుతో దశాబ్దాల అనుబంధం ఉంది.

ఇక తనకు తిరుగు లేదు అనుకుంటే కేంద్ర మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కలేదు. పొరుగు జిల్లాకు చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడుకు ఈ పదవి లభించింది. ఆయనకు కేబినెట్ ర్యాంక్ హోదాతో మంత్రి పదవి దక్కింది. దీంతో రమేష్ ఆశలు అన్నీ అడియాశలు అయ్యాయని అంటున్నారు.

సీఎం రమేష్ అంగబలం అర్ధబలం కలిగిన నేత. ఎక్కడో కడప నుంచి అనకాపల్లికి పోలింగ్ కి కేవలం నెల రోజుల ముందు వచ్చి గెలవడం అంటే ఆషామాషీ వ్యవహారం కానే కాదు. ఆయన తన వ్యూహాలతో అందరినీ దగ్గరకు చేసుకుని గెలిచారు. టీడీపీ కూటమికి ల్యాండ్ స్లైడ్ విక్టరీ దక్కడంతో ఆ ప్రభావం పడి భారీ ఆధిక్యతను సాధించారు.

బీజేపీకి విశాఖ సిటీలో మాత్రమే ఇప్పటిదాకా బలం ఉండేది. గెలుపు కూడా అక్కడే ఉండేది. అలాంటిది గ్రామీణ ప్రాంతంలోనూ కమల వికాసం జరిగింది అంటే అది రమేష్ వల్లనే అని అంటున్నారు. దాంతో ఉత్తరాంధ్రాకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చి బీజేపీని పటిష్టం చేసుకుంటారు అని ఆయన భావించారు.

కానీ రామ్మోహన్ నాయుడు పేరుని చంద్రబాబు ప్రతిపాదించడంతో రమేష్ కి చెక్ పెట్టినట్లు అయింది. సీఎం రమేష్ రామ్మోహన్ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో సామాజిక సమీకరణ దృష్ట్యా కూడా సమీప భవిష్యత్తులో కేంద్ర మంత్రి పదవి ఆశలు పెట్టుకున్నా దక్కదని అంటున్నారు.

మోడీ ప్రభుత్వానికి టీడీపీ ఎంతకాలం మద్దతు ఇస్తుందో అంతకాలం రామ్మోహన్ మంత్రి పదవిని ఎవరూ కదిల్చే సమస్య లేదని అంటున్నారు. దాంతో ఉందిలే మంచికాలం అని రమేష్ వెయిట్ చేయడమే అని అంటున్నారు. వెయింటింగ్ ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ మాదిరి ఆయన వెయింటింగ్ మినిస్టర్ అన్న ట్యాగ్ తగిలించుకుని కేంద్ర మంత్రి పదవి విస్తరణ కోసం ఆశగా ఎదురు చూపులు చూడడమే మిగిలింది అని అంటున్నారు. చూడాలి మరి రమేష్ కి మినిస్టర్ కుర్చీ ఎపుడు దక్కుతుందో.

Tags:    

Similar News