ఏపీలో ఈసారి ఎన్నికలు హింసాత్మకమేనా...!?

ఆయన గట్టి పట్టుదలతో ఉన్నారు. వై నాట్ 175 అన్న టార్గెట్ ని చూస్తేనే జగన్ ఎంతలా ఈ ఎన్నికలను తీసుకున్నారో అర్ధం అవుతుంది.

Update: 2024-02-17 02:45 GMT

ఏపీలో ఈసారి ఎన్నికలు చరిత్రలో కనీ వినీ చూడని విధంగా జరుగుతాయా అంటే జరుగుతున్న పరిణామాలు అవును అని చెప్పబోతున్నాయి. ఎందుకంటే ఈసారి హోరా హోరీ పోరు సాగనుంది. అందరికీ చావో రేవో లాంటి సమస్యగానే ఉంది. అధికారంలో ఉన్న జగన్ ఈసారికి టీడీపీని ఓడించేస్తే చాలు మూడు దశాబ్దాల వరకూ తిరుగు ఉండదని భావిస్తున్నారు. ఆయన గట్టి పట్టుదలతో ఉన్నారు. వై నాట్ 175 అన్న టార్గెట్ ని చూస్తేనే జగన్ ఎంతలా ఈ ఎన్నికలను తీసుకున్నారో అర్ధం అవుతుంది.

అంతే కాదు కుప్పంలో బాబుని, మంగళగిరిలో లోకేష్ ని అదే విధంగా పవన్ ని ఎక్కడ పోటీ చేసినా ఓడించాలని చూస్తున్నారు. ఇక తెలుగుదేశం సంగతి సరే సరి. చంద్రబాబు ప్రతీ చిన్న అవకాశాన్ని వాడుకుంటున్నారు. పొత్తులను కలిపేస్తున్నారు. కుడి ఎడమలను కూడా తన వెంటే ఉంచుకుంటున్నారు. ఆఖరుకు కాంగ్రెస్ లో సైతం తన అనుకూల వాతావరణాన్ని తెచ్చుకుంటున్నారు.

చంద్రబాబు ఆరు నూరు అయినా ఈసారి గెలిచి తీరుతామని అంటున్నారు. రెండు నెలలు ఆగండి మన ప్రభుత్వం వస్తుందని బాబు ప్రతీ సభలో చెబుతూంటే వైసీపీ మంత్రులు కానీ కీలక నేతలు కానీ ఎన్నికలు అయ్యాక మళ్లీ మనమే అందువల్ల అపుడు అన్నీ చేస్తామని హామీల మీద హామీలు ఇస్తున్నారు. ఆర్ధిక మంత్రి అయితే వచ్చే బడ్జెట్ మేమే పెడుతున్నామని చెప్పేశారు.

ఇంతలా రెండు పక్షాలు హోరా హోరీగా పోరుకు మోహరించి ఉన్న సన్నివేశం అయితే కనిపిస్తోంది. ఇక ఒక వైపు డైలాగ్ వస్తే రెండవ వైపు నుంచి ధీటుగా జవాబు వస్తోంది. చొక్కాలు మడతపెట్టి ఎన్నికలకు సిద్ధం కావాలని జగన్ అంటే కుర్చీలు మడతబెడతామని చంద్రబాబు రిటార్ట్ ఇచ్చారు. ఎక్కడా ఎవరూ తగ్గేది లేదు అంటున్నారు.

దొంగ ఓట్ల మీద రెండు పార్టీలూ ఫిర్యాదు చేసుకున్నారు. ప్రతీ నియోజకవర్గంలో పోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలన్న దాని మీద పక్కాగా వ్యూహరచన చేస్తున్నారు. ఎలక్షనీరింగ్ లో వైసీపీ ఆరితేరిపోయింది అని లోకల్ బాడీ ఎన్నికలు నిరూపించాయి పవర్ తోడు అయితే వైసీపీని అసలు పట్టుకోలేం తట్టుకోలేమని అర్ధమైన టీడీపీ బీజేపీ సాయం కోరింది. కేంద్రంలో బీజేపీతో పొత్తు ఉంటే పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ కూడా ఢీ కొట్టవచ్చు అన్నది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది.

వైసీపీ కూడా తగ్గడంలేదు బీజేపీ టీడీపీ కూటమితో పొత్తు పెట్టుకున్నా కూడా తమ పట్ల ఎంతో కొంత సాఫ్ట్ కార్నర్ తో ఉంటే చాలు తాము దూసుకునిపోతామని చెబుతున్నట్లుగా ఉంది. రాజ్యసభలో 11 మంది ఎంపీలతో వైసీపీ బీజేపీ పెద్దలకు ఊరిస్తోంది. సో కేంద్ర పెద్దలు తమ పరిధి పరిమితికి లోబడే ఏపీ ఎన్నికల్లో పాత్ర పోషిస్తారు అని అంటున్నారు.

దాంతో ఏపీలో ఎన్నికలు మాత్రం మజిల్ పవర్ మనీ పవర్ తో ముడిపడి ఉంటాయని గట్టిగా చెప్పేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎవరి ఎత్తుగడలు వారికి ఉన్నాయి. ఎవరి మాస్టర్ ప్లాన్స్ వారు బయటకు తీయబోతున్నారు. ఏపీలో ఎన్నికలు ఎపుడూ ప్రశాంతంగా సాగిన చరిత్ర మాత్రమే ఉంది. ఈసారి అలా కాదు అనే అంటున్నారు.

ఈసారి ఎన్నికలు కొత్త చరిత్రను సృష్టిస్తాయా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. దీని మీద టీడీపీ శ్రీకాకుళం ప్రెసిడెంట్ కూన రవికుమార్ మాట్లాడుతూ జగన్ వ్యాఖ్యలు చూస్తే రాబోయే ఎన్నికలు హింసాయుతంగా జరగబోతున్నాయనడానికి సంకేతంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలని లేకపోతే ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే అవకాశాలు ఉండవని అంటున్నారు.

ఏది ఏమైనా అటూ ఇటూ సమవుజ్జీలు బరిలోకి దిగినపుడు ఇలాగే ఉంటుంది. ఏపీలో ఎపుడూ అలాంటి వాతావరణం లేదు. ఈసారి మాత్రం కేవలం ఏపీతో పాటు దేశమంతా చూసేలా ఎన్నికలు సాగుతాయా అన్న చర్చ మాత్రం ఉంది. అలా కాకుండా సకల చర్యలు ఎన్నికల సంఘం తీసుకుంటేనే అసలైన ప్రజా తీర్పు వస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News