బార్ లోకి నో ఎంట్రీ అన్నారని ఐదుగురిని షూట్ చేసిన మహిళ

ప్రపంచానికి పెద్దన్న రాజ్యంలో గన్ కల్చర్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Update: 2023-09-23 04:06 GMT

ప్రపంచానికి పెద్దన్న రాజ్యంలో గన్ కల్చర్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పప్పు బెల్లాల మాదిరి ఆయుధాలు బహిరంగ మార్కెట్లో దొరికే వైనం తెలిసిందే. ఈ గన్ కల్చర్ కారణంగా దారుణ ఉదంతాలు తరచూ చోటు చేసుకోవటం తెలిసిందే. పలువురు ప్రాణాలు కోల్పోతున్న ఉదంతాలు చోటు చేసుకున్న ప్రతిసారీ.. ఈ తీరుపై ఆందోళన వ్యక్తం చేయటం.. ఆ తర్వాత దాన్ని వదిలేయటం మామూలే.

తాజాగా బార్ లోకి రానివ్వలేదన్న కోపంతో ఒక మహిళ విచాక్షణరహితంగా ఐదుగురి మీద కాల్పులు జరిపిన ఉదంతం షాకింగ్ గా మారింది. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేస్తున్నారు. డెన్వర్ సిటీలో రద్దీగా ఉన్న ఒక బార్ లోకి అక్కడి సెక్యూరిటీ సిబ్బంది ఒక మహిళను లోపలకు అనుమతించలేదు. క్యూ నుంచి బయటకు వచ్చిన ఆమె.. తన వద్ద ఉన్న గన్ తో కాల్పులు జరిపారు. తనను లోపలకు పంపని సెక్యూరిటీ గార్డులే లక్ష్యంగా కాల్పులు జరిపి ఉంటారని చెబుతున్నారు.

అయితే..కాల్పుల కలకలంతో అక్కడి వారంతా పరుగులు తీయటంతో.. మహిళ జరిపిన కాల్పుల్లో సాధారణ ప్రజలు గాయాల బారిన పడ్డారు. తప్పుడు ఐడీ కార్డులో బార్ లోపలకు వెళ్లే ప్రయత్నం చేసిన మహిళను అక్కడి సెక్యురిటీ సిబ్బంది అడ్డుకున్నట్లుగా చెబుతున్నారు.కాల్పులు జరిపిన అనంతరం ఆమె అక్కడి నుంచి తప్పించుకుపోయింది. ఆమె కోసం డెన్వర్ పోలీసులు పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. కాల్పుల ఉదంతంలో సదరు బార్ లో కలకలం రేగింది. బయట ఉన్న వారు ప్రాణ భయంతో పరుగులు తీయగా.. బార్ లో ఉన్న వారు అసలేం జరిగిందో అర్థం కాక.. పెద్ద ఎత్తున అరుస్తూ పరుగులు తీశారు. దీంతో..అక్కడి వాతావరణం భయాందోళనలతో నిండిపోయింది.

Tags:    

Similar News