మనశ్శాంతి పోయింది వెతికిపెట్టండి... పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు!
జిహ్వకో రుచి, పుర్రెకోబుద్ది అంటారు.
జిహ్వకో రుచి, పుర్రెకోబుద్ది అంటారు. ఇదే సమయంలో ఇటీవల "నా నీడ పోయింది సర్" అంటూ ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సినిమా కూడా వచ్చి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఒక మహిళ మనశ్శాంతి పోయిందని, దాన్ని పోలీసులు వెతికిపెట్టాలని ఫిర్యాదు చేసింది. దీనికి పోలీసులు కూడా ఊహించని రీతిలో స్పందించారు.
అవును... తాజాగా ఒక మహిళ తన మనశ్శాంతి పోయిందని.. దాన్ని పోలీసులే వెతికిపెట్టాలని ట్విట్టర్ వేదికగా కోరింది. ఈ ట్వీట్ కు ముంబై పోలీసులను ట్యాగ్ చేసింది. దీంతో ఒక్కసారిగా ఈ ట్వీట్ వైరల్ అయ్యింది. అదోలెక్క అంటే... ఈ ట్వీట్ కి ముంబై పోలీస్ ఇచ్చిన ట్వీట్ మరింత వైరల్ అయ్యింది. పోలీసుల్లో ఈటైపు క్రియేటివిటీ కూడా ఉందా అంటూ స్పందిస్తున్నారు
వివరాళ్లోకి వెళ్తే... "నా మనశ్శాంతి పోయింది. పోలీసులే వెతికిపెట్టాలి. స్టేషన్ కు వెళ్లి కంప్లయింట్ చేస్తా" అని ఒక ముంబై మహిళ సరదాగా ట్వీట్ పెట్టింది. అయితే ఈ ట్వీట్ కు పోలీసులు సినిమా భాషలో సరదాగా సమాధానం చెప్పడం గమనార్హం. అది కాస్తా వైరల్ అయ్యింది.
ఇందులో భాగంగా... ఆ సమాధానాన్ని మన తెలుగు సినిమాలు, సీరియల్స్ కు వర్తింపచేస్తే ఇలా ఉంటుంది! మన మనసు "శాంతి నివాసం"లా ఉండాలని ప్రతి ఒక్కరూ "ఆశ" పడతారు, "అన్వేషణ" సాగిస్తారు. అందువల్ల "ఇది (మీ ఒక్కరి) కథ కాదు". కాస్త వేచి చూస్తే... త్వరలో మీ "గుప్పెడు మనసే" ఏదో ఒకనాటికి దీనిని కనుగొనగలదు. అయినా సరే మా సాయం కావాలంటే అది మా "కర్తవ్యం" అంటూ సమాధానం ఇచ్చారు.
దీంతో ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఎవరి స్టైల్లో వారు కామెంట్లు పెడుతున్నారు. ఇందులో భాగంగా... మనశ్శాంతి దొరికితే మాక్కూడా చెప్పండి అని ఒకరు కామెంట్ పెడితే, "మనశ్శాంతి స్నేహితుల దగ్గర ఉంటుంది" అని మరొకరు స్పందించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ ట్రెండ్ అవుతుంది!