వేణుస్వామికి మహిళా కమిషన్ దెబ్బ.. మరోసారి నోటీసులు

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి తెలంగాణ మహిళా కమిషన్ నుండి నోటీసులు అందుకున్నారు.

Update: 2024-11-08 09:23 GMT

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి తెలంగాణ మహిళా కమిషన్ నుండి నోటీసులు అందుకున్నారు. నాగచైతన్య, శోభిత ధూళిపాళ ప్రేమ సంబంధం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వేణు స్వామిపై గతంలో మహిళా కమిషన్ చర్యలు తీసుకునే సూచన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మొదటి విచారణకు హాజరు కాకుండా కోర్టును ఆశ్రయించారు. కోర్టు ద్వారా స్టే పొందినా, తాజా కోర్టు తీర్పుతో స్టే ఎత్తివేయబడింది.

వివరాల్లోకి వెళ్తే, టాలీవుడ్ హీరో నాగచైతన్య, శోభిత ధూళిపాళల భవిష్యత్తు గురించి జ్యోతిష్యం చెబుతూ వేణు స్వామి 2027 లో వీరిద్దరూ విడిపోతారని, అది ఒక అమ్మాయి వల్ల జరుగుతుందని వీడియోలో వ్యాఖ్యానించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వేణు స్వామి విమర్శలకు గురయ్యారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ పలు ఫిర్యాదులు దాఖలు చేశాయి.

మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నీరెళ్ల శారద వేణు స్వామిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు వేణు స్వామిని విచారణకు హాజరు కావాలని ఆగస్టులోనే మొదటి నోటీసు జారీచేశారు. అయితే, ఆయన విచారణకు హాజరు కాకుండా కోర్టుకు వెళ్లడంతో తాత్కాలికంగా స్టే పొందారు. అయితే, తాజాగా కోర్టు ఆ స్టేను ఎత్తివేయడంతో, మహిళా కమిషన్ మరోసారి వేణు స్వామికి నోటీసులు జారీ చేసింది.

ఈ నెల 14న మహిళా కమిషన్ ముందు హాజరుకావాల్సిందిగా వేణు స్వామికి ఆదేశించారు. ఈ కేసు సీరియస్ టర్న్ తీసుకోవడంతో, వేణు స్వామి ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు సమాచారం. ఈ వ్యవహారం మరోసారి మీడియా, సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది.

వేణు స్వామి వ్యాఖ్యలు ఊహించని విధంగా వివాదాస్పదం కావడంతో, ప్రజలు ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. నిత్యం సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను ప్రభావితం చేసేలా జ్యోతిష్యాలు చెప్పడం, వారి భవిష్యత్తు గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. మహిళా కమిషన్ నోటీసులకు వేణు స్వామి ఈ సారి స్పందిస్తారా లేదా అనేది వేచిచూడాలి.

Tags:    

Similar News