మహరాణులకూ మద్యం దుకాణాలు.. విశాఖలో అత్యధికం

గడిచిన కొద్దిరోజులుగా ఏపీలోని కొన్ని వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మద్యం దుకాణాల లాటరీ వ్యవహారం సోమవారం సాఫీగా పూర్తైంది.

Update: 2024-10-15 04:30 GMT

గడిచిన కొద్దిరోజులుగా ఏపీలోని కొన్ని వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మద్యం దుకాణాల లాటరీ వ్యవహారం సోమవారం సాఫీగా పూర్తైంది. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏపీలోని మద్యం దుకాణాలకు లైసెన్సులు కేటాయించే ప్రక్రియలో మొత్తం 26 జిల్లాల పరిధిలో లాటరీల ద్వారా జిల్లా కలెక్టర్లు ఎంపిక నిర్వహించటం.. మొత్తం 3396 దుకాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే.. ఈ మొత్తం దుకాణాల్లో దాదాపు 10 శాతానికి పైగా షాపుల్ని మహిళలు సొంతం చేసుకోవటం గమనార్హం.

అత్యధికంగా విశాఖపట్నంలో 31 షాపులు.. అనకాపల్లిలో 25, శ్రీకాకుళం.. విజయనగరం.. నెల్లూరు జిల్లాల్లో 24 షాపుల చొప్పున మహిళలకు దక్కటం విశేషం. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన షాపుల కేటాయింపు ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఈ మొత్తం లాటరీ ప్రక్రియలో ఏపీలోనే అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలోని 96వ నంబరు దుకానానికి 132 మంది.. 97వ నంబరు దుకాణానికి 120.. పెనుగంచిప్రోలులోని 81వ నంబరు దుకాణానికి 110 అప్లికేషన్లు వచ్చాయి.

ఈ మూడు షాపుల లైసెన్సుల లాటరీలో తెలంగాణ రాష్ట్రం వారిని వరించటం ఆసక్తికరంగా మారింది. 96వ నంబరు షాపు ఖమ్మం జిల్లా ఖానాపురానికి చెందిన చెరుకుపల్లి సత్యనారాయణకు దక్కగా.. 97వ నంబరు దుకాణం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బండి అనూషకు.. 81వ నంబరు షాపు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చెందిన రాజుకు లభించాయి. ఏలూరు జిల్లా కుక్కునూరు 121వ నంబరు షాపునకు మొత్తం 108 అప్లికేషన్లు రాగా.. విలీన మండలాల్లో ఒకటైన వేలేరుపాడు మండలానికి చెందిన కామినేని శివకుమారి లాటరీలో దక్కించుకున్నారు. వీరికి తెలంగాణలోనూ మద్యం వ్యాపారాలు ఉన్నాయి.

బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసరావుకు ధర్మవరం నియోజకవర్గం పరిధిలో ఐదు మద్యం ఫాపులు దక్కాయి. మడకశిర నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామికి నాలుగు సాపులు లభించాయి. వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని నాలుగు లిక్కర్ షాపులు బీఆర్ కే న్యూస్ చానల్ యాజమాన్యానికి చెందిన ప్రతినిదులకు దక్కాయి. ఆచానల్ రిపోర్టర్ లాటరీ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ నియోజకవర్గంలో మద్యం షాపులకు తక్కువగా అప్లికేషన్లు రావటంతో వారు అప్లికేషన్లు పెట్టి సొంతం చేసుకున్నట్లుగా చెబుతున్నారు.

ఈసారి మద్యం షాపుల లాటరీకి సంబంధించిన దేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన వారైనా అప్లికేషన్లు దాఖలు చేసుకునే వీలు కల్పించటంతో ఇతర రాష్ట్రాల వారు పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు పెట్టారు. వారిలో పలువురికి షాపులు దక్కాయి. విజయవాడలోని14, 18 నంబరు షాపులు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన వారు సొంతం చేసుకోగా.. మచిలీపట్నంలో ఒక షాపును కర్ణాటకకు చెందిన వారు.. మరో షాపును ఢిల్లీకి చెందిన వారు సొంతం చేసుకున్నారు. ఒడిశా మద్యం వ్యాపారులు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో రెండేసి షాపులు లాటరీలో దక్కాయి. కర్నూలు జిల్లాలో 10 మద్యం షాపుల్ని కర్ణాటక.. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యాపారులు సొంతమయ్యాయి. పలు జిల్లాల్లో ఎన్ఆర్ఐల పేరుతో.. వారి బంధువులు.. కుటుంబీకులు అప్లికేషన్లుపెట్టగా.. వారికి లభించాయి.

Tags:    

Similar News