ఇదేం పోయేంకాలం అమ్మా.. విమానంలో ఈ పనులేంటి? వైరల్ వీడియో

ఎక్కడున్నాం? ఏం చేస్తున్నామన్న సోయి మరిచి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.;

Update: 2025-03-24 20:30 GMT

విచ్చలవిడితనం పెరిగిపోతోంది. మగవారే.. ఆడవారు కూడా ఈ మధ్య ఆధునిక పోకడలతో తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఎక్కడున్నాం? ఏం చేస్తున్నామన్న సోయి మరిచి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అసలు విమానంలో నిప్పును రాజేసే దేన్నీ అనుమతించరు. కానీ ఓ మహిళ లైటర్, సిగరెట్ తో విమానం ఎక్కి అక్కడ అంటించి విమానం తగులబెడుతానంటూ రచ్చ చేయడం అందరినీ షాక్ కు గురిచేసింది.

ప్రజారవాణా వ్యవస్థల్లో పొగ తాగడం నిషేధం అని అందరికీ తెలిసిందే. బస్సులు, రైళ్లలో పొగ తాగడం వల్ల తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలగడమే కాకుండా, అగ్ని ప్రమాదాలు సంభవించే ప్రమాదం కూడా ఉంది. అలాంటిది, అత్యంత భద్రతా నియమాలు కలిగిన విమానంలో పొగ తాగేందుకు ప్రయత్నించడమే కాకుండా, ఏకంగా విమానాన్నే తగలబెట్టేందుకు ప్రయత్నించిన ఒక మహిళ చేసిన నిర్వాకం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇస్తాంబుల్ నుండి సైప్రస్ వెళ్తున్న ఒక విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళ విమానంలో సిగరెట్ వెలిగించి పొగ ఊదడంతో తోటి ప్రయాణికులు, విమాన సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. సిబ్బంది వెంటనే ఆమె వద్దకు చేరుకుని సిగరెట్ లాక్కునే ప్రయత్నం చేయగా, ఆమె మరింత రెచ్చిపోయింది. సిగరెట్ ఇవ్వకపోగా, మరో చేత్తో లైటర్ వెలిగించి విమానంలోని సీటు కవర్లను తగలబెట్టేందుకు ప్రయత్నించింది.

దీంతో ఒక్కసారిగా విమానంలో గందరగోళం నెలకొంది. ఎయిర్ హోస్టెస్ వెంటనే స్పందించి ఆమెను అడ్డుకున్నారు. అయినా ఆగకుండా, ఆ మహిళ అక్కడున్న నాప్కిన్‌ను అంటించేందుకు ప్రయత్నించింది. చివరికి, సిబ్బంది వాటర్ బాటిల్‌లోని నీళ్లు పోసి ఆమె చేతిలోని లైటర్‌ను ఆర్పివేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమాన భద్రతా నియమాలను ఉల్లంఘించిన ఆ మహిళ ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒక వ్యక్తి చేసిన పిచ్చి పని వల్ల విమానంలో ఉన్న అందరి ప్రాణాలకు ప్రమాదం వాటిల్లేదని మండిపడుతున్నారు. సేఫ్టీ ప్రోటోకాల్స్‌ను పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ మహిళపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

విమాన ప్రయాణాలు అత్యంత సురక్షితమైనవిగా పరిగణించబడతాయి. అందుకు కారణం అక్కడ అమలయ్యే కఠినమైన భద్రతా నియమాలే. ప్రయాణికులందరూ ఈ నియమాలను తప్పకుండా పాటించాలి. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

Tags:    

Similar News