మహిళల మిస్సింగ్... ఏపీలో కంటే తెలంగాణలోనే ఎక్కువ!

ఇదే సమయంలో వాలంటీర్లు పవన్ పై తీవ్ర నిరసన కార్యక్రమాలు చేశారు

Update: 2023-07-27 03:59 GMT

కొన్ని రోజుల క్రితం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌ లో రికార్డు స్థాయిలో ఆడపిల్లలు, మహిళలు మిస్సయ్యారని... వారిలో చాలా మంది ఆచూకీ తెలియడం లేదని సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీనికోసం నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్.సి.ఆర్.బి) ని ప్రస్థావించారు పవన్.

అవును... నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లో తన మూలాలను ఉటంకిస్తూ, ఆంధ్రప్రదేశ్‌ లో 30,000 మందికి పైగా మహిళలు తప్పిపోయారని.. అయితే తప్పిపోయిన మహిళలు, బాలికలలో సగం మంది కూడా వెనక్కి రాలేదని తెలిపారు. ఈ క్రమంలో గ్రామ/వార్డు వాలంటీర్లపై మిస్సింగ్ కేసులను ఆపాదించారు.

ఇళ్లల్లో ఒంటరిగా ఉంటున్న మహిళల జాబితాను వాలంటీర్లు గుర్తిస్తున్నారని... ఆ వివరాలు సంఘవిద్రోహ శక్తులకు ఇస్తున్నారని... ఫలితంగా వైసీపీ పెద్దల సహాయ సహకారాలతో ఉమన్ ట్రాఫికింగ్ కి పాల్పడుతున్నారన్ని తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో వైసీపీ నాయకులు పవన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఇదే సమయంలో వాలంటీర్లు పవన్ పై తీవ్ర నిరసన కార్యక్రమాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పవన్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఆయన ఫోటోలను చెప్పులతో కొట్టారు. పలు స్టేషన్ లలో కేసులు నమోదు చేశారు. ఇదే సమయంలో మహిళా కమిషన్ పవన్ కు నోటీసులు జారీచేసింది.

ఇదే సమయంలో వాలంటీర్లపై నిరాధార ఆరోపణలు చేశారంటూ ప్రభుత్వం పవన్ ని ప్రాసిక్యూట్ చేయడానికి కూడా ప్రయత్నించింది. ఇదే సమయంలో కొంతమంది వాలంటీర్లు తమ వ్యక్తిగత ప్రతిష్టకు పరువు నష్టం కలిగిందని కేసులు వేయడం, కోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే! ఈ సమయంలో కేంద్రం ఒక నివేదిక విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్‌ లో మహిళల మిస్సింగ్ కేసులు భారీగానే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంటులో వెల్లడించింది. అయితే ఇది కేవలం ఏపీకి మాత్రమే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న లెక్కలు తెరపైకి తెచ్చింది. వీటిలో అత్యధికంగా మహారాష్ట్రలో మిస్సింగ్ లు ఉండగా... ఏపీ కంటే ఎక్కువగా తెలంగాణ లో ఉన్నాయని తేల్చింది!

2019 నుంచి 2021 మధ్య మూడేళ్ల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్‌ లో 22,278 మంది మహిళలు, 7,928 మంది బాలికలు అదృశ్యమయ్యారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ కుమార్ మిశ్రా రాజ్యసభలో చేసిన ప్రకటనలో తెలిపారు. అయితే వారిలో ఎంతమందిని గుర్తించి వారి బంధువులకు అప్పగించారనేది కేంద్ర నివేదికలో పేర్కొనలేదు.

ఇక ఏ ఏడాదికి ఆ ఏడాది వివరాలు చూస్తే... 2019లో తప్పిపోయిన మహిళలు - బాలికల సంఖ్య వరుసగా 6252 - 2186.. 2020లో 7057 - 2374.. 2021లో 8969 - 3358 గా పేర్కొంది. ఇక్కడ మరింత ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. తప్పిపోయిన మహిళలు, బాలికల సంఖ్య ఆంధ్రప్రదేశ్‌ తో పోలిస్తే తెలంగాణలోనే ఎక్కువ!

ఈ ఘణాంకాల ప్రకారం 2019 - 2021 మధ్య కాలంలో తెలంగాణలో భారీ సంఖ్యలో 34,495 మంది మహిళలు, 8066 మంది బాలికలు అదృశ్యమయ్యారు. 2019లో తప్పిపోయిన మహిళలు - బాలికల సంఖ్య వరుసగా 10,744 - 2,849.. 2020లో 10,917 - 2,232.. 2021లో 12,834 - 2,994 గా ఉంది!

ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, రాజస్థాన్ వంటి అనేక ఇతర రాష్ట్రాల్లో తప్పిపోయిన మహిళలు, బాలికల సంఖ్య అసాధారణంగా ఎక్కువగా ఉంది. బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా ఈ సంఖ్య ఎక్కువగానే ఉంది!

దీంతో 2019 నుండి ఏపీలో 30,000 మందికి పైగా మహిళలు తప్పిపోయారని పవన్ కళ్యాణ్ చెప్పడం సరైనదే అయినప్పటికీ... ఈ తప్పిపోయిన మహిళల వెనుక గ్రామ/వార్డు వాలంటీర్లు ఉన్నారని చెప్పడం మాత్రం ఇప్పటికే అసత్య ప్రచారంగానే ఉందని తెలుస్తోంది.

ఫలితంగా... తెలంగాణలో ఏ వాలంటీర్లు వున్నారు... మహారాష్ట్రతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ వాలంటీర్ల వల్ల మహిళలు - బాలికలు అదృశ్యమవుతున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఏపీలోని వాలంటీర్లు. దీంతో పవన్ చెప్పిన నెంబర్ నిజమే కానీ... అంతకంటే ఎక్కువ పక్కనే ఉన్న తెలంగాణలో ఉంది.

పైగా ఏపీలో మిస్సింగ్ కి వాలంటీర్లు కారణం కాదు అని తేలింది! ఈ విషయాలపై పవన్ ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలని అంటున్నారు పరిశీలకులు!

Tags:    

Similar News