వైసీపీ మహిళా ఎంపీలు ఇక మాజీలే...!

అయితే ఇది తనకు అసంతృప్తిగానే ఉంది అని జగన్ అభ్యర్ధుల రిలీజ్ రోజున చెప్పుకొచ్చారు.

Update: 2024-03-27 04:37 GMT

వైసీపీ మహిళలకు పెద్ద పీట వేశామని చెప్పుకుంది. 25 పార్లమెంట్ 175 అసెంబ్లీ కలుపుకుని 200 సీట్లకు గానూ 24 మందికి చాన్స్ ఇచ్చామని పేర్కొంది. అయితే ఇది తనకు అసంతృప్తిగానే ఉంది అని జగన్ అభ్యర్ధుల రిలీజ్ రోజున చెప్పుకొచ్చారు. వచ్చే సారికి వారికి మరింతగా అవకాశాలు కల్పిస్తామని ఆయన అన్నారు.

ఇదిలా ఉంటే 2019 ఎన్నికల్లో వైసీపీ వేవ్ లో కొందరు మహిళలకు అవకాశం సునాయాసంగా లభించింది. వారు ఎకాఎకీన చట్టసభలకు వెళ్ళిపోయారు. అపుడు కూడా అనకాపల్లి ఎంపీ సీటు చివరి నిముషంలోనే ఖరారు చేశారు. అప్పటిదాకా చాలా పేర్లు అనుకుని చివరికి డాక్టర్ గా ఉన్న భీశెట్టి సత్యవతికి టికెట్ అనౌన్స్ చేశారు. ఆ మీదట ఆమె పోటీ చేసి దాదాపుగా తొంబై వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

ఆయిదేళ్ళ పాటు ఆమె తన పరిధి మేరకు పనిచేశారు. అనకాపల్లిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని కూడా చెప్పుకున్నారు. రెండవసారి తనకు చాన్స్ వస్తుందని కూడా తలచారు. కానీ అనూహ్యంగా ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడుకు ఈ చాన్స్ వరించింది. దాంతో ఆమె మాజీ ఎంపీగా మిగిలిపోతున్నారు

ఇదే రకమైన పరిస్థితి అరకు ఎంపీ గొడ్డేటి మాధవికి కలుగుతోంది. ఆమె కూడా పాతికేళ్ళ వయసుకే ఎంపీ అయిపోయారు. 2019 ఎన్నికల్లో ఆమెకు రెండున్నర లక్షలకు పైగా భారీ మెజారిటీ దక్కింది. పైగా ఆమె ఓడించినది ఎవరినో కాదు అయిదు దశాబ్దాల పాటు రాజకీయంగా రాణించి కేంద్రంలో ఎన్నో మంత్రి పదవులు చేపట్టిన వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ ని. ఆయన టీడీపీ తరఫున పోటీ చేస్తే అప్పటికపుడు రాజకీయ ఎంట్రీ ఇచ్చిన మాధవి ఓడించి జెయింట్ కిల్లర్ అనిపించుకున్నారు

ఆమెకు ఒక దశలో లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా బీజేపీ ప్రభుత్వం ఆఫర్ చేసిందని వార్తలు వచ్చాయి. కానీ ఎన్డీయేలో చేరడానికి వైసీపీ అంగీకరించలేదు అని అంటారు. ఇపుడు చూస్తే మాధవి కూడా మాజీ ఎంపీ కాబోతున్నారు. ఆమె ప్లేస్ లో అరకు నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా తనూజా రాణీని నిలబెడుతున్నారు. ఆమె డాక్టర్ కూడా.

ఇక అరకు అసెంబ్లీ టికెట్ ని మొదట ఆమెకు ప్రకటించినా వర్గ పోరులో అది కాస్తా మార్చేశారు. ఇదే తీరులో పాడేరు సిట్టింగ్ ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మికి కూడా ఈసారి టికెట్ దక్కలేదు. అరకు ఎంపీ సీటుకి ఆమెను ఇంచార్జిగా నియమించారు. ఆమె అరకు ఎంపీగా పోటీ చేస్తుంది అని అంతా భావించారు.

కానీ చివరి నిముషంలో కొత్త పేరుని వైసీపీ తెర పైకి తేవడంతో ఆమె మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోతున్నారు. ఇలా జిల్లాలో చూస్తే కనుక 2019లో పోటీ చేసి గెలిచిన ఈ ముగ్గురు మహిళా నాయకురాళ్ళూ మాజీలే అని అంటున్నారు. దాంతో వారి అభిమానులు అనుచరులు నిరుత్సాహ పడుతున్నారు. అయితే వైసీపీ అధినాయకత్వం వారి భవిష్యత్తుకు హామీ ఇచ్చిందని అంటున్నారు.

Tags:    

Similar News