ఇక మహిళా రాజ్యం...రాజకీయ విప్లవమే ...!
మోడీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మహిళా రిజర్వేషన్ బిల్లు కనుక చట్టం అయితే లోక్ సభలో వారి వాటా అమాంతం పెరిగిపోవడం ఖాయం.
రాజకీయాలు అంటే పురుషులే కనిపిస్తారు. వారే దశాబ్దాలుగా ముందుండి రాజకీయం చేస్తున్నారు. అయితే దేశానికి స్వాతంత్రం వచ్చి యాభై ఏళ్లు గడచిన వేళ మహిళలకు మొత్తం చట్ట సభ సీట్లలో 33 శాతం సీట్లు ఇవ్వాలన్న ఆలోచన అయితే వచ్చింది. కానీ అది కార్యరూపం దాల్చడానికి మరో పాతికేళ్ళ కాలం పట్టడం అంటే నిజంగా రాజకీయ విషాదమే.
మోడీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మహిళా రిజర్వేషన్ బిల్లు కనుక చట్టం అయితే లోక్ సభలో వారి వాటా అమాంతం పెరిగిపోవడం ఖాయం. మొత్తం 545 మంది ఎంపీలు ఉన్న లోక్ సభలో మహిళా ఎంపీలు 179 స్థానాలు
వారి పరం అవుతాయి. అంటే ఇది నిజంగా మహిళా విప్లవమే అవుతుంది.
ప్రస్తుతం మహిళా ఎంపీలా వాటా లోక్ సభలో 14.94 శాతంగా ఉంది. అదే రాజ్యసభలో చూసుకుంటే 14.05 శాతంగా ఉంది. హిమాచల్ ప్రదేశ్ మొత్తంలో ఒకే ఒక మహిళా ఎమ్మెల్యే ఉన్నారు. ఏపీ తెలంగాణా సహా దేశంలోని 19 రాష్ట్రాలలో మహిళా ప్రతినిధుల శాతం కేవలం పది లోపు గానే ఉండడం విశేషం.
ఆంధ్రాలో మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు గానూ 58 సీట్లు వారికి దక్కుతాయి. అలాగే మొత్తం 25 ఎంపీలలో 9 దాకా వారికే దక్కుతాయి. అలాగే తెలంగాణాలో మొత్తం 119 అసెంబ్లీ సీట్లకు గానూ 39 సీట్లు కచ్చితంగా మహిళలకే కేటాయించాల్సి ఉంటుంది. అదే విధంగా అక్కడ 17 ఎంపీ సీట్లలో 6 ఎంపీ సీట్లు మహిళలకే ఇవ్వాల్సి ఉంటుంది.
ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పటికే దేశంలోని పంచాయతీ రాజ్ చట్టం మేరకు 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు ఉన్నాయి. రాజ్యాంగంలోకి ఆర్టికల్ 243డి ప్రకారం మహిళలకు ఈ రిజర్వేషన్లు ఇచ్చారు. దీని కోసం 1992లో 73వ రాజ్యంగ సవరణ చట్టం తెచ్చారు.
దీని వల్ల పంచాయతీ రాజ్ వ్యవస్థలో మహిళకు బడుగు వర్గాలకు 33 శాతం రిజర్వేషన్లు తప్పనిసరిగా ఉంది. ప్రస్తుతం ఈ రిజర్వేషన్లను 50 శాతంగా మహిళల కోసం పెంచాయి. ఆ జాబితాలో ఏపీ తెలంగాణా రాష్ట్రాలు ఉన్నాయి. మొత్తానికి ఎటు చూసినా మహిళా రాజ్యం కనిపించేలా మోడీ తెచ్చే మహిళా బిల్లు ఉండబోతోంది అంటున్నారు. అదే జరిగితే చాలా రాజకీయ పార్టీలే కాదు నాయకుల జాతకాలు తిరగబడతాయి అని అంటున్నారు.