మహిళా బిల్లు పాసైతే.. బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చాల్సిందేనా?
మహిళా రిజర్వేషన్ కు అనుకూలంగా చట్ట సభల సీట్ల సంఖ్యను పెంచుతారని. ఈ మేరకు మార్పులు చేసిన తర్వాతనే అమల్లోకి తెచ్చే వీలుంది.
తెలంగాణలో ఎన్నికలకు మరో రెండున్నర నెలలే సమయం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ తన అభ్యర్థులను ప్రకటించేసింది. కేవలం 4 స్థానాలకు మాత్రమే పెండింగ్ పెట్టింది. రేపోమాపో కాంగ్రెస్ కూడా అభ్యర్థులను ప్రకటించనుంది. బీజేపీ ఇప్పుడు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో ఉంది. బీఎస్పీ, వామపక్షాలు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. ఓ విధంగా చెప్పాలంటే అధికారంలో ఉన్న సౌలభ్యతతో.. అభ్యర్థులకు కొదవలేని పరిస్థితుల్లో 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి బీఆర్ఎస్ ముందంజ వేసింది. కానీ, ఇప్పుడు మహిళా బిల్లు రూపంలో ఓ పెద్ద సమస్య వచ్చి పడింది.
ఏమిటి పరిస్థితి..?మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల బిల్లు దాదాపు 27 ఏళ్లుగా పెండింగ్ లో ఉంది. మళ్లీ ఇన్నాళ్లకు కదలిక వచ్చింది. వాస్తవానికి ఈ బిల్లు పెద్దల సభ అయిన రాజ్య సభలో ఎప్పుడో గట్టెక్కింది. మిగిలింది లోక్ సభనే. అంటే.. బీజేపీకి బలం లేని పెద్దల సభలో మహిళా బిల్లు పాస్ అయింది. సంపూర్ణ మెజారిటీ ఉన్న లోక్ సభలో మాత్రమే పెండింగ్ లో ఉంది. చిత్తశుద్ధితో గనుక ప్రయత్నిస్తే మహిళా బిల్లును బీజేపీ గట్టెక్కించడం పెద్ద కష్టమేం కాదు. ఆపై రాష్ట్రపతి ఆమోద ముద్రనే తరువాయి. దీంతో చట్టరూపం దాల్చడం.. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ అమలులోకి రావడమే తరువాయి.
మరి అభ్యర్థుల సంగతేమిటో..?తెలంగాణలో నెల కిందట అభ్యర్థులను ప్రకటించింది బీఆర్ఎస్. ఒకవేళ మహిళా రిజర్వేషన్ గనుక అమల్లోకి వస్తే 33 శాతం టికెట్లను మహిళలకే ఇవ్సాల్సి ఉంటుంది. అంటే 39 సీట్లను మహిళలకే కేటాయించాలి. ఇప్పటికైతే టికెట్లు ఇచ్చిన బీఆర్ఎస్ అనే కాదు.. ఇవ్వాల్సి ఉన్న ఏ పార్టీ కూడా ఇన్ని సీట్లు కేటాయించలేవు.
సీట్ల సంఖ్యను పెంచాల్సేందే..వినవస్తున్న ఊహాగానాల ప్రకారం.. మహిళా రిజర్వేషన్ కు అనుకూలంగా చట్ట సభల సీట్ల సంఖ్యను పెంచుతారని. ఈ మేరకు మార్పులు చేసిన తర్వాతనే అమల్లోకి తెచ్చే వీలుంది. మరోవైపు బిల్లు అమలు తేదీ లేదా సంవత్సరాన్ని నిర్దిష్టంగా పేర్కొని అప్పటినుంచి అమలు ఆరంభించవచ్చు. ఈ పరిణామాల ప్రకారం చూస్తే.. బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చే అవసరం రాకపోవచ్చు.
కొసమెరుపు: అనుకున్నది అమలు చేసేంతవరకు పట్టు విడవని మోదీ ప్రభుత్వ హయాంలో ఏదైనా జరగొచ్చు. మహిళా రిజర్వేషన్ బిల్లు పేరిట రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయించవచ్చు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేసి జమిలికి వెళ్లే అవకాశం కూడా ఉంది. ఎలాగూ జమిలిపై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కమిటీ పనిచేస్తున్న సంగతి తెలిసిందే.