33 శాతం కోటా సరే.. తెలంగాణలో మహిళా నేతలకు టికెట్లేవి?
‘‘చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు’’.. దాదాపు మూడు దశాబ్దాల డిమాండ్ ఇటీవల నెరవేరింది.
‘‘చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు’’.. దాదాపు మూడు దశాబ్దాల డిమాండ్ ఇటీవల నెరవేరింది. మున్ముందు మూడొంతుల్లో ఒక వంతు మహిళా నేతలే ఉండనున్నారు. కాగా, ఈ రిజర్వేషన్ అమల్లోకి రావడానికి కొంత సమయం పట్టనుంది. అయితే, రిజర్వేషన్ ఆమోదం పొందిన వెంటనే జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో ఆయా రాజకీయ పార్టీలు ఎంతమంది మహిళలకు టికెట్లిచ్చాయనేది ఆసక్తికర అంశం. దేశవ్యాప్తంగా లెక్కలు తేలకున్నా.. తెలంగాణ వరకు చూస్తే.. మొత్తం 17 సీట్లున్నాయి. కనీసం ప్రతిపార్టీ ఐదుగురు మహిళలకు సీట్లివ్వాలి. మరి ఎలా ఇచ్చాయో చూస్తే..
14లో 3.. కాంగ్రెస్ ముందంజ
లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలోని 14 సీట్లకు ఇప్పటివరకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లకు ఇంకా వెల్లడించలేదు. అయితే, 14లో ముగ్గురు మహిళలకు టికెట్లిచ్చింది. మల్కాజిగిరి వంటి పెద్ద నియోజకవర్గం నుంచి సునీతా మహేందర్ రెడ్డిని బరిలో దింపింది. ఆదిలాబాద్ లో ఆత్రం సుగుణకు అవకాశం ఇచ్చింది. వరంగల్ లో కడియం కావ్యను నిలిపింది.
బీఆర్ఎస్ ఒకరికి
బీఆర్ఎస్ మొత్తం 17 సీట్లకూ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో మహబూబాబాద్ లో సిటింగ్ ఎంపీ మాలోత్ కవితను బరిలో నిలిపింది. వాస్తవానికి కడియం కావ్యను బీఆర్ఎస్ ముందుగా వరంగల్ అభ్యర్థిగా ప్రకటించింది. కానీ, ఆమె తన తండ్రి శ్రీహరితో కలిసి కాంగ్రెస్ లో చేరారు. దీంతో కారు పార్టీ ఒక్క సీటే మహిళలకు ఇచ్చినట్లయింది.
హైదరాబాద్ సహా బీజేపీ 2...
తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఎంఐఎం అడ్డా. అలాంటిచోట తొలిసారి మహిళకు టికెటిచ్చింది బీజేపీ. మాధవీ లతను పోటీకి దింపి మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ను ఢీకొడుతోంది. సీనియర్ నాయకురాలు డీకే అరుణకు మహబూబ్ నగర్ టికెట్ కేటాయించింది. ఇద్దరు మహిళలకే టికెట్లు ఇవ్వగలిగింది.
ఒక్కొక్కరు 5.. ఇచ్చింది మొత్తం 6
మహిళలకు ఒక్కొక్క పార్టీ ఐదేసి సీట్లివ్వాల్సిన చోట మొత్తం మూడు ప్రధాన పార్టీలు కలిపి ఆరు సీట్లే ఇచ్చాయి. కాగా, మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ 2029 ఎన్నికల నుంచి అమల్లోకి రానుంది. మరి అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.