ఇంట్రస్టింగ్... నిన్నటి టీచర్లే నేటి ఏపీ మంత్రులు..!

అవును... గతకొంతకాలంగా ఏపీలో టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చిన వారు రాజకీయాల్లో రాణించడమే కాదు ఏకంగా మంత్రులు అయిపోతున్నారు.

Update: 2024-06-19 11:21 GMT

ఈ సమాజంలో ఉపాధ్యాయులకు ఉండే గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! ఒకటి రెండు చీడ పురుగులను తీసేస్తే... సాధారణంగా సమాజంలో ఉన్నత విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయులంటే విపరీతమైన గౌరవం! అయితే అనూహ్యంగా ఏపీలో టీచర్లుగా పనిచేసిన మహిళా నేతలే మంత్రులుగా మారడం అనే విషయం ఆసక్తిగా మారింది.

అవును... గతకొంతకాలంగా ఏపీలో టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చిన వారు రాజకీయాల్లో రాణించడమే కాదు ఏకంగా మంత్రులు అయిపోతున్నారు. ప్రస్తుతం ఏపీలో ఈ ట్రెండ్ కొనసాగుతుంది. ప్రస్తుతం అంటే... కనీసం మూడు దఫాలుగా! ఇందులో భాగంగా... వైసీపీ ప్రభుత్వంలో హోం మంత్రిగా పనిచేసిన తానేటి వనిత ఎమ్మెల్యే కాకముందు కాలేజీలో లెక్చరర్‌ గా ఉద్యోగం చేశారు.

అదేవిధంగా 2014లో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పీతల సుజాత ఉపాధ్యాయురాలుగా పని చేసినవారే. దీంతో... ఉపాధ్యాయులంతా ఏపీలో మంత్రులు అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఉపాధ్యాయులుగా పనిచేసి అనంతరం ఎమ్మెల్యేలుగా గెలుపొందడం.. అనంతరం మంత్రులవడం ఇటీవల కాలంలో వరుసగా జరుగుతుంది.

తాజా విషయానికొస్తే... వంగలపూడి అనిత ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పాయకరావుపేట నియోజకవర్గ నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం చంద్రబాబు కేబినెట్ లో కీలకమైన హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత హోంమంత్రి అనిత 2009లో ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎంఏ, ఏంఈడి పూర్తి చేసి ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు.

ఈ క్రమంలోనే 28 సంవత్సరాలకే తన ఉద్యోగానికి రాజీనామా చేసిన అనిత 2012 సంవత్సరంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో... 2014లో పాయకరావుపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో టీటీడీ బోర్డు సభ్యురాలుగానూ పనిచేశారు.

అనంతరం 2019లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం 2021లో టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలుగా పనిచేసిన ఆమె తాజా ఎన్నికల్లో తిరిగి పాయకరావుపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈ క్రమంలోనే ఏపీ హోంమంత్రిగా పనిచేశారు.

ఇక గతానికి వెళ్తే... జగన్ సర్కార్ లో ఐదేళ్లపాటు మంత్రిగా పనిచేసిన తానేటి వనిత ఒకప్పుడు ఉపాధ్యాయురాలే. 1995లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ, ఎంఈడి పూర్తి చేసిన వనిత... తరువాత నల్లజర్లలోని ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్‌ గా పని చేశారు. అనంతరం తండ్రి వారసత్వాన్ని స్వీకరించి 2009లో టీడీపీ తరపున గోపాలపురం నియోజకవర్గ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

అనంతరం... 2012లో తన ఎమ్మెల్యే పదవికి, టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఈ క్రమంలోనే 2014 సార్వత్రిక ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి 2019లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ క్రమంలోనే జగన్ మొదటి కేబినెట్ లోనే మంత్రిగా పనిచేశారు.

ఈ క్రమంలోనే మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 2022లో మంత్రివర్గ పునర్విభజనలో మరోసారి మంత్రి అయ్యారు వనిత. ఇందులో భాగంగా... కీలక శాఖ అయిన హోం మంత్రిగా తానేటి వనిత బాధ్యతలు చేపట్టారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి గోపాలపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ఇదే క్రమంలో... మాజీ మంత్రి పీతల సుజాత కూడా ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. 2004లో తండ్రి వారసత్వంగా రాజకీయాలలోకి వచ్చి మొదటిసారి పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2009లో నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా ఆచంట నియోజకవర్గం కాస్తా రిజర్వేషన్ కు మారిపోవడంతో ఆమె పోటీ చేయలేదు.

తర్వాత 2014లో చింతలపూడి నియోజకవర్గంలో నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పీతల సుజాత గెలుపొందారు. ఇదే సమయంలో చంద్రబాబు కేబినెట్ లో మహిళా స్త్రీ శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో... టీచర్లుగా పనిచేసి అనంతరం రాజకీయాల్లోకి వచ్చిన మహిళ నేతలు తప్పకుండా మంత్రులు అవుతారనే ట్రెండ్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Tags:    

Similar News