ఎగిరే ట్యాక్సీలకు ఆమోదం వచ్చేసింది...సౌకర్యాలు, సవాళ్లు ఇవే!

Update: 2023-10-30 00:30 GMT

పెరుగుతున్న జనాభా.. మరింతగా పెరుగుతున్న వాహనాలు.. పెద్దగా పెరగని డోడ్ల వెడల్పులు వెరసి... ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్ లో ట్రాఫిక్ అనేది అతిపెద్ద సమస్య అని చెబుతుంటారు నగర వాసులు. ఉదాహరణకు ఇండియాలో బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ మొదలైన నగరాలలోని వాహనదారులను అడిగితే దీనిపై సవివరంగా వివరించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఎగిరే ట్యాక్సీలకు ఆమొదం లభించింది.

అవును... ప్రపంచంలోని రెండో అతిఎక్కువ జనాభా గల దేశంగా ఉన్న చైనా ప్రభుత్వం ఎగిరే ట్యాక్సీలకు ఆమొదం తెలిపింది. దీంతో... ఇకపై బీజింగ్ వీధులు, చైనాలోని ప్రధాన నగరాల్లో ఎగిరే ట్యాక్సీల సందడి ఉండనుంది. ఇద్దరు మాత్రమే కూర్చుని ప్రయాణించే ఈ ట్యాక్సీల ద్వారా ప్రయాణికులు కొత్త అనుభూతి పొందడం పక్కా అంటున్నారు నిపుణులు.

వాస్తవానికి 2014 నుండే... ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో 40 వేల ఫ్లైట్లను టెస్ట్ చేశారు. జనవరి 2021లో, ఇహాంగ్.. సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా నుంచి టైప్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ నేపథ్యంలో టెస్టింగ్‌ లన్నీ నిర్వహించి అనుమతినివ్వడంతో చైనా గగనవీధుల్లో ఈ ఫ్లయింగ్ ట్యాక్సీల ప్రస్థానం ప్రారంభమైంది. వీటి రాకతో ప్రజా రవాణా మరింత సులభతరం అవుతుందని చెబుతున్నారు.

ఈ సందర్భంగా వీటి వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను వెల్ల్డిస్తున్నారు. ఇందులో భాగంగా... రోడ్లపై వాహనాలు వెళ్లలేని ప్రాంతాలకు కూడా ఇవి అలవోకగా వెళ్లగలవని.. ప్రకృతి రమణీయతను ఆకాశంలోనుంచి చూపిస్తూ ప్రత్యేక అనుభూతిని పంచడంతోపాటు.. ట్రాఫిక్ జాంలను నివారిస్తాయని చెబుతున్నారు. ఇక ఎమర్జెన్సీ సమయాల్లో సైతం ఈ ట్యాక్సీలు బాగా ఉపయోగపడతాయని చెబుతున్నారు.

ఇక ఈ సందర్భంగా తొలి ట్యాక్సీని రూపిందించిన ఎహాంగ్ అనే కంపెనీ దానికి ఈహెచ్ 216 – ఎస్ గా నామకరణం చేసింది. ఇది స్కేల్డ్ అప్ కన్స్యూమర్ డ్రోన్‌ ను పోలి ఉంటుంది. ట్యాక్సీ ఆన్ లో లేనప్పుడు రెక్కల్ని ముడుచుకోవడం దీని ప్రత్యేకతగా చెబుతున్నారు. ఫలితంగా... చిన్న చిన్న ప్రదేశాలలో సైతం ఇది ఈజీగా ల్యాండ్ అవుతుందని అంటున్నారు.

ఇక ఈ ఎహాంగ్ రూపొందించిన ఈ ఎయిర్ టాక్సీలు ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ ప్రక్రియలో పని చేస్తాయని.. వీటిలో ఇద్దరు ప్రయాణీకులను లేదా 600 పౌండ్ల బరువును మోయగలవని అంటున్నారు. ఇక గంటకు 80 కి.మీ.ల వేగంతో ఒక్క సారి ఛార్జ్ చేస్తే 18 మైళ్ల దూరం వరకు ప్రయాణించగలవట. ఈ రెండు గంటల్లో వీటిని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చట. ఇక రోడ్లపై తిరిగే ఎలక్ట్రికల్ వాహనాల మాదిరిగానే ఇవి తక్కువ శబ్దంతో నడుస్తాయని చెబుతున్నారు.

అన్నీ బాగానే ఉన్నప్పటికీ... వీటికి కొన్ని సవాళ్లు ఎదురవుతాయని అంటున్నారు. అందులో భాగంగా... ఇవి పనిచేసే ఏరియాల్లో ఆయా ప్రభుత్వాల చట్టాలు, నిబంధనలకు లోబడి ఉండటంతోపాటు... గగనతలంలో వెళ్లే ఇతర వాహనాలతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది.

ఇదే సమయంలో ప్రయాణికులు క్యాబిన్ లోపల కూర్చుని టచ్‌ స్క్రీన్‌ పై తమ గమ్యస్థానాన్ని ఎంచుకోవాలి. అంటే... పైలట్ లేని ప్రయాణం అన్నమాట. మరి ఈ విషయంలో ప్రజల విశ్వాసాన్ని పొందడం కూడా వీటి ముందున్న అతిపెద్ద సవాల్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

Tags:    

Similar News